ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
ABN, First Publish Date - 2023-08-22T21:47:25+05:30
మేము ఓట్లు వేసి నిన్ను ఎంపీటీసీ సభ్యునిగా గెలిపించాం.. ఈ రెండు సంవత్సరాలలో మాకేం పనులు చేశావని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారని మండలంలోని గుంటుపల్లి ప్రాదేశికం నుంచి గెలుపొందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు ఆరుమళ్ల కుమారి ఎంపీపీ, అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
మండల సమావేశంలో వైసీపీ ఎంపీటీసీ ఆవేదన
పీసీపల్లి, ఆగస్టు 22 : మేము ఓట్లు వేసి నిన్ను ఎంపీటీసీ సభ్యునిగా గెలిపించాం.. ఈ రెండు సంవత్సరాలలో మాకేం పనులు చేశావని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారని మండలంలోని గుంటుపల్లి ప్రాదేశికం నుంచి గెలుపొందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు ఆరుమళ్ల కుమారి ఎంపీపీ, అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అత్యాల జఫన్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమతమ శాఖల ప్రగతిని వివరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పవన్‌కుమార్ తమ శాఖ ప్రగతిని వివరించిన అనంతరం ఎంపీపీ అత్యాల జఫన్య గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే సభ్యులు తనకు లేదా ఎంపీడీవో దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకోవాలన్నారు. అదే సమయంలో గుంటుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కుమారి మాట్లాడుతూ ఎంపీటీసీగా గెలిచి సుమారు రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు ఒక్క పనికూడా చేయలేదని ప్రజలు తనను ప్రశ్నిస్తున్నారన్నారు. కనీసం పింఛను కూడా ఇప్పించలేక పోతున్నామని అన్నారు. గ్రామంలో స్వర్ణ చిన్నమ్మి అనే మహిళ వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు మంజూరు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి వెంటనే ఫైల్ తెప్పించి చిన్నమ్మ దరఖాస్తును పరిశీలించారు. ఆమెకు పింఛన్ మంజూరైందని, వచ్చే కొత్త పింఛన్‌లో ఆమెకు నగదు అందజేస్తామని తెలిపారు. అనంతరం ఎన్‌ఆర్జీఎ్‌సలో సమీక్ష జరుగుతున్న సమయంలో చౌటగోగులపల్లి సర్పంచ్ భర్త నజీర్ మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులకే పథకాల గురించి తెలపడంలేదన్నారు. మురుగుమ్మి ఎంపీటీసీ సభ్యుడు సతీష్ మాట్లాడుతూ జంగాలపల్లిలోని విద్యుత్ సమస్యను ఎప్పటిలోపు పరిష్కరిస్తారని ఏఈని అడిగారు. ఇప్పటికే స్తంభాలు కూడా మంజూరయ్యాయని టెక్నికల్ శాన్షన్ రాగానే పనులు మొదలు పెడతామని ఏఈ లక్ష్మీరాజేష్ తెలిపారు. తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మారెళ్లలో రీసర్వే జరుగుతుందని సర్వే బృందం పొలాలకు వెళ్లినప్పుడు రైతులు అందుబాటులో ఉండి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్‌లను చూపించి తమ పొలాలను సర్వే చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా 3 నెలలకోసారి జరగుతున్న ఈ సమావేశానికి కొన్నిశాఖల అధికారులు డుమ్మా కొడుతూనే ఉన్నారు. మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి గృహ నిర్మాణ, సాంఘిక సంక్షేమ శాఖ, ఎక్సైజ్‌శాఖ, వాటర్‌షెడ్, కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన అధికారులెవరూ హాజరు కాలేదు. సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పలుశాఖల అధికారులు ఉన్నారు.
Updated Date - 2023-08-22T21:47:25+05:30 IST