హెచ్‌ఎం బదిలీల్లో కిరికిరి
ABN, First Publish Date - 2023-06-10T01:10:38+05:30
జిల్లాలో గ్రేడ్-2 హెడ్మాస్టర్ల బదిలీల్లో కిరికిరి జరిగింది. హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో హెచ్‌ఎం పోస్టును మిగులుగా తేల్చి వాటిని రద్దుచేసి మరో పాఠశాలకు బదిలీ చేశారు.
రద్దయిన పోస్టు ఖాళీగా ప్రకటన
ఒంగోలు (విద్య), జూన్ 9 : జిల్లాలో గ్రేడ్-2 హెడ్మాస్టర్ల బదిలీల్లో కిరికిరి జరిగింది. హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో హెచ్‌ఎం పోస్టును మిగులుగా తేల్చి వాటిని రద్దుచేసి మరో పాఠశాలకు బదిలీ చేశారు. అయితే రద్దయిన పోస్టు ఖాళీల జాబితాలో దర్శనమిచ్చింది. ఆ పాఠశాలలో హెచ్‌ఎం పోస్టు రద్దయిన విషయం తెలియక ఒక హెచ్‌ఎం బదిలీల్లో ఆ స్థానం కోరుకుని గాలి లోకి వెళ్లారు. జిల్లాలో మొత్తం 246మంది హెచ్‌ఎంలు బదిలీ అయ్యారు. బదిలీల కోసం మొత్తం 199 మంది దరఖాస్తు చేశారు. 47 మంది స్కూలు అసిస్టెంట్లు హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి పొంది ప్రస్తుతం స్థానాలు కోరుకున్నారు. బదిలీల కోసం దరఖాస్తు చేసిన 199 మందిలో 171 మంది ఇతర పాఠశాలలకు బదిలీ కాగా మిగిలిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగుతున్నారు. బదిలీ అయిన వారు, కొత్తగా ఉద్యోగోన్నతి పొందిన వారంతా హెచ్‌ఎంలుగా తాము కోరుకున్న పాఠశాలల్లో గురువారమే బాధ్యతలు స్వీకరించారు.
12 ప్రధానోపాధ్యాయుల పోస్టులు రద్దు
జిల్లాలో 12 జడ్పీ హైస్కూళ్లలో హెచ్‌ఎం పోస్టులు రద్దయ్యాయి. జీవో నెంబరు 117 ప్రకారం విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో హెచ్‌ఎం పోస్టులను మిగులుగా తేల్చి వాటిని ఇతర అప్‌గ్రేడెడ్ హైస్కూళ్లకు కేటాయిం చారు. శీలంవారిపల్లి, పెద్దగోల్లపల్లి, వలపర్ల, ముప్పాళ్లపాడు, అదిపూడి, ముప్ప వరం, బసవన్నపాలెం, ఈదుమూడి, చిలంకూరు, అడుసుమల్లి, కొనగానివారి పాలెం, శాఖవరం జడ్పీ హైస్కూళ్లలో హెచ్‌ఎం పోస్టులు రద్దయ్యాయి.
రద్దు చేసిన పోస్టు ఖాళీగా...
విద్యార్థులు తక్కువగా ఉన్న కారణంగా మిగులుగా తేలిన ఆదిపూడి జడ్పీ హైస్కూలులో రద్దుచేసిన పోస్టే ఖాళీల జాబితాలో దర్శనమిచ్చింది. ఈ విష యాన్ని ఇక్కడి డీఈవో కార్యాలయ ఐటీసెల్ ప్రతినిధులు గమనించారు. అయి తే ఖాళీలను అప్పటికే సీఎస్‌ఈ కార్యాలయంలో ప్రీజ్ చేయడంతో ఆ ఖాళీని మార్చేందుకు అవకాశం లేకుండాపోయింది. ఇక్కడి ఐటీసెల్ ప్రతినిధులు సీఎస్‌ఈ కార్యాలయం ఐటీసెల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు కూడా ఆ ఖాళీని జాబితా నుంచి తొలగించకపోవడంతో ఆ స్థానం అలాగే కొనసాగింది.
గాలిలో బల్లికురవ హెచ్‌ఎం
ఖాళీల ప్రకటనలో జరిగిన పొరపాటుకు బల్లికురవ జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం బలయ్యారు. బల్లికురవ హెచ్‌ఎం బి.భారతి అదిపూడి జడ్పీ హైస్కూల్‌ను కోరుకున్నారు. అయితే అక్కడ పోస్టు రద్దయిన విషయం ఆమెకు తెలియదు. ఈ నేపథ్యంలో బల్లికురవ హైస్కూల్ కోరుకున్న కొత్త హెచ్‌ఎం గురువారం బాధ్యతలు స్వీకరించడంతో ఆమె అక్కడ నుంచి రిలీవ్ అయ్యి ఆదిపూడి జడ్పీ హైస్కూల్‌లో చేరేందుకు వచ్చారు. అక్కడ హెచ్‌ఎం పోస్టు రద్దు అయినట్లు అప్పుడు ఆమెకు తెలిసింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితితో వెనుదిరిగారు. ఐటీసెల్ నిర్వాకంతో ఆమె ప్రస్తుతం గాలిలో ఉన్నారు. అందరికీ పోస్టులు కేటాయించగా మిగిలిన రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ఈ హెచ్‌ఎంకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
Updated Date - 2023-06-10T01:10:38+05:30 IST