కనిగిరి.. అభిమాన సిరి
ABN, First Publish Date - 2023-07-21T00:16:34+05:30
టీడీపీ అధికారంలోకి వస్తేనే కనిగిరి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
టీడీపీ వస్తేనే సస్యశ్యామలం
జగన్‌హామీల కప్పదాటుపై నిప్పులు చెరిగిన లోకేష్
కనిగిరి, జూలై 19 : టీడీపీ అధికారంలోకి వస్తేనే కనిగిరి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ పాదయాత్రలో కనిగిరికి లెక్కలేనన్ని హామీలు గుప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అతి ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తాగు, సాగు నీటి అందించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పి మాట తప్పారన్నారు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను కూడా సక్రమంగా నడిపించలేకపోవడం వారి చేతగాని పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే వెలిగొండను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి తాగు, సాగు నీటిని ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. డయాలసిస్ సెంటరులో మెరుగైన వైద్య సేవలతో పాటు, వైద్యులు, సిబ్బందిని నియమిస్తామన్నారు. కనిగిరికి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ఇన్నేళ్లయినా ఒక్క కంపెనీనిగానీ, ఒక్క ఉద్యోగాన్ని ఇవ్వలేదని దెప్పిపొడిచారు. టీడీపీ వేసిన రోడ్లే తప్ప ఏ గ్రామంలో కొత్తగా రోడ్లేసిన పాపాన పోలేదన్నారు. ట్రిపుల్ ఐటీని ఇక్కడే ఉంచుతామన్నారు. ఈ ప్రాంతంలో పండే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటామన్నా రు. పేదల కోసం టీడీపీ కట్టించిన టిడ్కో ఇళ్లను జగన్ వారికి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ కష్టాలు తెలిసిన మంచి వ్యక్తి డాక్టర్ ఉగ్ర
ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన మంచి వ్యక్తి డాక్టర్ ఉగ్ర అని లోకేష్ అన్నారు. నరసింహా రెడ్డి గారూ అని లోకేష్ సంబోధించారు. ఈ సమయంలో అక్కడున్న అశేష జనం కేరింతలు, ఈలలతో ప్రాంగణం మారుమోగింది. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రతి పక్షంలో ఉన్నప్పటికీ ప్రజాక్షేమం కోసం నిత్యం సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి ఉగ్ర అన్నారు. రోగి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమందు ఇవ్వా లో తెలిసిన ఉగ్ర కనిగిరి అభివృద్ధికి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏం చేయాలో తెలుసునన్నారు. ఉగ్రనుద్దేశించి యువనేత మాట్లాడినంత సేపూ శ్రేణులు, ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సభలో ఎమ్మెల్యేలు స్వామి, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముత్తుముల అశోక్‌రెడ్డి, నేతలు నూకసాని బాలాజీ, దామచర్ల సత్య, టీడీపీ చీరాల, వైపాలెం ఇన్‌చార్జిలు కొండయ్య యాదవ్, గూడూరి ఎరిక్షన్‌బాబు, పరిశీలకుడు నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, శ్యామల కాశిరెడ్డి, నాదెళ్ల తిరుపతిరావు, నారపరెడ్డి(యడవల్లి) శ్రీనివాసులరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, మనోహరరావు, తమ్మినేని వెంకటరెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, ఫిరోజ్, అహ్మద్ పాల్గొన్నారు.
జనప్రభంజనంగా మారిన యువగళం
పీసీపల్లి : లోకేష్ పాదయాత్ర 160వ రోజు కనిగిరిలో జనప్రభంజనాన్ని తలపించింది. శంఖవరం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరజనాలు పలికారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీస్తూ హారతులు పడుతూ లోకే్‌షకు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు లోకే్‌షను చూసేందుకు పెద్దఎత్తున రోడ్లపైకి రావడంతో కిటకిటలాడింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు యువనేతను కలిసి వారివారి సమస్యలను చెప్పుకున్నారు. వారి సమస్యలను విన్న లోకేష్ చంద్రబాబు ప్రభుత్వం రాగానే మీ కష్టాలు తీరుస్తామన్నారు. ప్రజలను పలకరిస్తూ మహిళల వద్ద ఉన్న చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడుతూ లోకేష్ ముందుకు సాగారు. కనిగిరి బస్టాండ్ వద్దకు చేరుకోగానే వర్షం మొదలైంది. అభిమాన నాయకుడిని చూసేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయని ప్రజలు రోడ్లు, బిల్డింగ్‌లపై పెద్ద సంఖ్యలో నిల్చుని అభివాదాన్ని తెలియజేశారు. బహిరంగ సభకు వెళ్లగానే వర్షం పెద్దగా కురుస్తున్నా లోకేష్ ప్రసంగం ముగిసేవరకూ అక్కడే ఉన్నారు.
Updated Date - 2023-07-21T00:16:34+05:30 IST