అగమ్యగోచరం!
ABN, First Publish Date - 2023-09-22T23:35:45+05:30
సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది కాలం అనుకూలించకపోవడంతో అధికశాతం భూములు ఇప్పటికీ బీడుగానే మిగిలిపోయాయి. సాగర్ డ్యాములకు నీరు చేరకపోవడంతో సాగు వస్తుందన్న ఆశ లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు అల్లాడుతున్నారు.
సాగర్ ఆయకట్టులో అనిశ్చితి
రైతుల పరిస్థితి దయనీయం
నీరివ్వలేమని తేల్చిచెప్పిన ప్రభుత్వం
గతంలోనే ప్రకటించిన ఇరిగేషన్ అధికారులు
బీడుగా మారిన అధిక శాతం భూములు
సాగర్ జలాల కోసం ఇప్పటివరకు వేచిచూసిన అన్నదాతలు
ప్రత్యామ్నాయ పంటల విషయంలోనూ అయోమయం
దర్శి, సెప్టెంబరు 22 : సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది కాలం అనుకూలించకపోవడంతో అధికశాతం భూములు ఇప్పటికీ బీడుగానే మిగిలిపోయాయి. సాగర్ డ్యాములకు నీరు చేరకపోవడంతో సాగు వస్తుందన్న ఆశ లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు అల్లాడుతున్నారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద సుమారు 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. అందులో దర్శి ఎన్‌ఎస్‌పీ డివిజన్ పరిధిలో 99 వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 20 శాతం భూముల్లో మొక్కజొన్న, కంది, సజ్జ పైర్లు వేశారు. మిగిలిన 80శాతం భూములు అలాగే బీడుగానే ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడంతో రైతులు ఎలాంటి పైర్లు సాగు చేయలేకపోయారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో కనీసం దుక్కులు కూడా దున్నలేదు. ఆగస్టు ఆఖరులోనైనా జలాశయాలు నిండి సాగర్ జాలాలు విడుదలవుతాయనే ఆశతో ఇప్పటి వరకు ఉన్నారు. సెప్టెంబరులోనూ శ్రీశైలం, సాగర్ జలాశయాలకు నీరు చేరలేదు.
వరి సాగు ప్రశ్నార్థకమే
శ్రీశైలం, సాగర్ జలాశయాలకు ఇప్పటివరకు నామమాత్రంగానైనా నీరు చేరకపోవడంతో అడుగంటిపొయాయి. అధికారుల లెక్కల ప్రకారం శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 853 అడుగుల నీరు మాత్రమే ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 88.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 524.3 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ పరిమాణం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం జలాశయాల్లో నిల్వ ఉన్న నీటి లెక్కల ప్రకారం సాగునీరు అందించే అవకాశం లేదని అధికారులు తేల్చిచెప్పడంతో ఆయకట్టు భూముల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
Updated Date - 2023-09-22T23:35:45+05:30 IST