గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రంగా రేషన్ దందా
ABN, First Publish Date - 2023-06-08T23:55:24+05:30
గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రం రేషన్ బియ్యం అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. అక్రమ కొనుగోలు, అమ్మకాలు రవాణా జోరుగా సాగుతున్నది. ఎక్కువమంది రేషన్ బియ్యం వ్యాపారులు వైసీపీ మద్దతుదారులు ఉండటంతో అధికారులు ఈ వ్యవహారంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా వైసీపీ పెద్దల అండదండలతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుంది.
జోరుగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం
అక్రమార్కులకు వైసీపీ పెద్దల అండ
మద్దిపాడు, జూన్ 8: గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రం రేషన్ బియ్యం అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. అక్రమ కొనుగోలు, అమ్మకాలు రవాణా జోరుగా సాగుతున్నది. ఎక్కువమంది రేషన్ బియ్యం వ్యాపారులు వైసీపీ మద్దతుదారులు ఉండటంతో అధికారులు ఈ వ్యవహారంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా వైసీపీ పెద్దల అండదండలతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుంది. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ కావడంతో కొందరు ఈ వ్యాపారాన్ని నిర్విఘ్నంగా నడుపుతున్నారు. ప్రధానంగా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రం రేషన్ బియ్యం వ్యాపారానికి కేంద్రంగా మారింది. రేషన్ బియ్యం కొనుగోలుచేసి ఆ బియ్యాన్ని బాయిల్డ్ చేసి ఉప్పుడు బియ్యంగా తయారుచేస్తారు. ఆ బియ్యాన్ని చెన్నై, తెలంగాణ, కాకినాడు పోర్టు తదితర ప్రాంతాలకు తరలిస్తారు. వైసీపీ నాయకులు గ్రూపుగా చేరి కొందరు కూలీలను ఏర్పరచుకొని కార్డుదారుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు. మద్దిపాడు మండలంలో కొన్ని రేషన్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.36 వంతున అమ్ముతున్నారు. ఎత్తుడు, దింపుడు కూలి పోయినా నికరంగా రూ.16 మిగులుతుంది. ఒకరోజులో రేషన్ బియ్యాన్ని కొనడం, వెంటనే ఆటోలో తరలించి ఉప్పుడు బియ్యంగా మారి అమ్మకం చేపట్టిన వెంటనే లాభం చేతికి వస్తుండటంతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి ఆకర్షితులవుతున్నారు. యజమానులు అక్రమార్కులు తెచ్చిన రేషన్ బియ్యాన్ని వెంటనే మిల్లులో వేసి ముక్కలు, తవుడు వేరుచేసి మిగతా బియ్యం కొత్త సంచుల్లో ప్యాక్ చేస్తున్నారు. అదునుచూసుకుని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
రైస్ మిల్లులకు భారీ లాభం
రైస్‌మిల్లుల యజమానులు కిలో రూ.30 రూ.32 వరకు రేషన్ బియ్యం అమ్ముతుండగా, వారికి కూడా ఖర్చులుపోయి రూ.10 మిగులుతుంది. వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేసింది. దీంతో డీలర్ల హవా కొంత తగ్గింది. అయితే చాలామంది రేషన్ డీలర్లు బియ్యం అవసరంలేని వారిని గుర్తించి కిలో రూ.10 చెల్లించి మరో రూ.4 లాభం చూసుకొని హోటల్‌కు అమ్ముతున్నారు. వీరేకాక కొంతమంది కూలీలను ఏర్పాటుచేసుకొని ఇంటింకి వెళ్లి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. మూడు నాలుగు టన్నులు అయిన వెంటనే వాహనాల్లో రైస్ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకునే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.
పట్టుబడినా ఏం కాదనే..
రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు, పౌరసరఫరాల శా ఖ అడ్డుకోవాల్సి ఉంది. నెలలో పదిరోజులపాటు బియ్యం అక్రమ కొనుగోలు, విక్రయాల వ్యవహారం బహిరంగానే సాగుతున్నప్పటికీ ఫిర్యాదులు వస్తే తప్ప నెలకు ఒక కేసు కూడా నమోదు కావడంలేదు. ఈ వ్యాపారంలో చాలామంది వైసీసీ మద్దతుదారులు ఉండటంతో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. పట్టుబడిన సందర్భాల్లో 6ఏ కేసు నయోదుచేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వదిలివేస్తున్నారు కానీ క్రిమినల్ కేసులు నమోదు చేయడంలేదు.
గుండ్లాపల్లి గ్రోత్‌సెంటరులో దాడులు
గుండ్లాపల్లి గ్రోత్‌సెంటరులో వెంకటేశ్వర బాయిల్ రైస్ మిల్లులో గురువారం గుంటూరు జిల్లా ఏఎస్పీ విజిలెన్స్ అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీ చేశారు. భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మీడియా ప్రతినిధుల్ని లోపలికి అనుమతించకుండా అధికారులు తనఖీలు చేపట్టారు. వివరాలు తర్వాత వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. అప్పుటి దాకా ఎవరిని లోపలికి అనుమతించబోమని అధికారులు వెల్లడించడం గమనార్హం.
Updated Date - 2023-06-08T23:55:24+05:30 IST