ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే జీవో1
ABN, First Publish Date - 2023-01-15T00:26:02+05:30
ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 1ను తక్షణం ఉపసంహరించుకోవాలని టీడీపీ, వామపక్షాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదుల గొంతులు నొక్కేందుకే ప్రభుత్వం ఈ దుర్మార్గపు జీవోను తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరుపై టీడీపీ, వామపక్ష నేతల ఆగ్రహం
భోగిమంటల్లో ప్రతులు దహనం చేసి నిరసన
ఒంగోలులో పాల్గొన్న సీపీఎం నేత శ్రీనివాసరావు
పలుచోట్ల టీడీపీ ముఖ్య నేతల నేతృత్వం
ఒంగోలు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 1ను తక్షణం ఉపసంహరించుకోవాలని టీడీపీ, వామపక్షాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదుల గొంతులు నొక్కేందుకే ప్రభుత్వం ఈ దుర్మార్గపు జీవోను తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నంబరు 1కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రతిపక్షపార్టీలు, పౌరసంఘాలతో సంయుక్తంగా ఏర్పడిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి పిలుపు మేరకు శనివారం జిల్లా అంతటా టీడీపీ, వామపక్ష శ్రేణులు జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. ఒంగోలులోని దిబ్బలరోడ్డులో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి జీవో ప్రతులను మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి చట్టంకన్నా జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో దారుణంగా ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోకపోవడాన్ని ఖండించిన ఆయన తక్షణం వెనక్కు తీసుకోకపోతే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. కనిగిరిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి భోగి మంటల్లో జీవో ప్రతులను వేసి దహనం చేశారు. ప్రశ్నించే వారిని అణిచివేస్తూ తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులు పాల్గొని జీవో ప్రతులను దహనం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదించారు. పలు ఇతర ప్రాంతాల్లోనూ భోగి మంటల్లో జీవో ప్రతులను టీడీపీ. వామపక్షాల కార్యకర్తలు దహనం చేశారు.
Updated Date - 2023-01-15T00:26:03+05:30 IST