నిప్పుల కొలిమి
ABN, First Publish Date - 2023-05-18T01:47:11+05:30
జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు బుధవారం జిల్లాలో నమోదయ్యాయి.
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
మండుతున్న ఎండలతో జనం బెంబేలు
లాక్‌డౌన్ తరహాలో నిర్మానుష్యంగా రోడ్లు
పెరుగుతున్న వడదెబ్బ మరణాలు..
తాజాగా మరో నలుగురు
ఒంగోలు, మే 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు బుధవారం జిల్లాలో నమోదయ్యాయి. పగటిపూట అత్యధిక సమయం ఎక్కువ ప్రాంతాల్లో 43 నుంచి 46డిగ్రీలు నమోదై జిల్లా నిప్పులకొలిమిగా మారడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. దీంతో అత్యధిక ప్రాంతాల్లో పగటిపూట ఒక రకంగా కరోనా నాటి లాక్‌డౌన్ పరిస్థితి రోడ్లపై కనిపిస్తోంది. సాధారణంగా జనం రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పది గంటలకే వీధులు ఖాళీ అవుతున్నాయి. జిల్లాలో బుధవారం కూడా ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రంలోనే అత్యధికంగా మద్దిపాడు మండలం గుండ్లాపల్లిలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం 12గంటలకు, ఒంటిగంటకు కూడా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి మూడు ప్రాంతాలు జిల్లాలోనే ఉన్నాయి. ఇక మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆ సమయంలో కూడా రాష్ట్రంలో అత్యధికంగా గుండ్లాపల్లిలో 46.49 డిగ్రీలు ఉంది. పెద్దారవీడులో 45.95, కురిచేడులో 45.65, ఉప్పలపాడులో 45.39, కేకేమిట్లలో 45.21, జువ్విగుంటలో 45.69 డిగ్రీల ఎండ కాచింది. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో కూడా పామూరు మండలం బొట్లగూడూరులో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పెరుగుతున్న వడదెబ్బ బాధితులు
వేడిగాలుల తీవ్రతతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. పలువురు మృత్యువాతపడుతున్నారు. జిల్లాలోని ఇంచుమించు మూడొంతుల ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకు కూడా 40 నుంచి 44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి సమ యంలో కూడా 36 నుంచి 38 డిగ్రీలు ఉంటున్నాయి. ఈ పరిస్థితితో అన్నివర్గాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. చిరువ్యాపారులు, ఉపాధి కూలీల పరిస్థితి దారుణంగా ఉంటోంది. మరోవైపు వేడిగాలులతో పిల్లలు, వృద్ధులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటి వరకు వడదెబ్బతో నలుగురు మృతిచెందగా మంగళ, బుధవారాల్లో మరో నలుగురు మరణించారు. కంభంలో కొండేటి గురవయ్య (56), వెలిగండ్ల మండలం రామగోపాలపురంలో బి.ఓబులమ్మ(79), టంగుటూరులో కాకర్ల ఆదాం (79) మృతి చెందారు. టంగుటూరులో వీఆర్‌ఏ కోటేశ్వరరావు (70) వడదెబ్బకు గురై మంగళవారం ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉండగా ప్రస్తుత వాతావరణ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-05-18T01:47:11+05:30 IST