ఉద్యోగుల నిరసన
ABN, First Publish Date - 2023-03-15T01:51:11+05:30
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అమరావతి జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
జిల్లావ్యాప్తంగా కార్యక్రమం
నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు
ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 14 : సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అమరావతి జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండు వద్ద జరిగిన నిరసనలో జేఏసీ జిల్లా చైర్మన్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా అనేక సమస్యలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వతేదీన జీతం ఇవ్వడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక పరమైన అంశాలన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు ఊతకోలు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలయ్య, నాగేశ్వరరావు, రమేష్, రెవెన్యూ అసోసియేషన్ కోశాధికారి జె.డానియేలు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లాలోని అన్ని మండలకేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసనలు తెలిపారు.
Updated Date - 2023-03-15T01:51:11+05:30 IST