అవినీతి రిజిస్ట్రేషన్
ABN, First Publish Date - 2023-05-11T23:42:39+05:30
ఆస్తులు కొనడం కష్టంతో కూడినదైతే, దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గగనంగా మారుతోంది. అసలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం పారదర్శకత అని బాకాలు ఊదుతున్నా స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు కన్పించడం లేదు. అవి అవినీతికి కేంద్రాలుగా మారాయి. కంభంలో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వ్యక్తిని అక్కడి సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.50వేలు డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. అడిగినంత ఇవ్వనిదే రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే రూల్స్ అంటూ రకరకాల పత్రాలు కావాలని అడుగుతున్నారు.
డాక్యుమెంట్ రైటర్లదే హవా
వారు చెప్పిందే రేటు
నేరుగా సబ్‌రిజిస్ర్టార్లతో లావాదేవీలు
కొన్నిచోట్ల నకిలీ పత్రాలతో వివాదాలు
ప్రశ్నిస్తే రూల్స్ బయటకు తీసి మెలిక
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి ఆలవాలంగా మారాయి. పైసలిస్తేనే పని జరుగుతోంది. అక్కడ డాక్యుమెంట్ రైటర్ల రాజ్యం నడుస్తోంది. సబ్ రిజిస్ట్రార్లతో సంబంధాలు ఏర్పరుచుకొని వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. బుధవారం ఏసీబీ అధికారుల దాడిలో కంభం సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ పట్టుబడడాన్ని చూస్తే అవినీతి ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ప్రతి చోటా ఫీజు టూ ఫీజు అంటూ డాక్యుమెంట్‌ను బట్టి వసూలు చేస్తున్నారు. దీంతోపాటు చట్టంలో ఉన్న చిన్నచిన్న లొసుగులను ఆసరా చేసుకొని అధిక మొత్తంలో డిమాండ్ చేస్తూ వాటాలు పంచుకుంటున్నారు. నకిలీ వీలునామాలతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తున్నారు. కొన్ని చోట్ల ఒక సర్వే నెంబర్‌తో రెండు, మూడు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. భూ వివాదాలకూ ఆజ్యం పోస్తున్నారు.
ఒంగోలు (క్రైం), మే 11 : ఆస్తులు కొనడం కష్టంతో కూడినదైతే, దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గగనంగా మారుతోంది. అసలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్దకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం పారదర్శకత అని బాకాలు ఊదుతున్నా స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు కన్పించడం లేదు. అవి అవినీతికి కేంద్రాలుగా మారాయి. కంభంలో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వ్యక్తిని అక్కడి సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.50వేలు డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. అడిగినంత ఇవ్వనిదే రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే రూల్స్ అంటూ రకరకాల పత్రాలు కావాలని అడుగుతున్నారు. లేకపోతే రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్తున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక అడిగినంత ఇచ్చుకొని ప్రజలు పని చేయించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో పెచ్చరిల్లిన అవినీతిపై ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డుకు కూడా అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు పలు కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం కంభంలో సబ్ రిజిస్ట్రార్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్ పట్టుబడ్డారు.
డాక్యుమెంట్ రైటర్లదే హవా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలన్నింటిలోనూ డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. వారు వసూల్ రాజాలుగా మారారు. సబ్ రిజిస్ట్రార్‌లకు, భూ క్రయ, విక్రయదారులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఓకే చెప్పకపోతే సబ్ రిజిస్ట్రార్లు ఏదో ఒక కొర్రీ వేసి రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నారు. అప్పుడు తిరిగి బేరసారాలు సాగించాల్సి వస్తోంది. వాస్తవంగా డాక్యుమెంట్ రైటర్ దస్తావేజులు రాసినందుకు ఒక్కో దానికి రూ.వెయ్యి నుంచి రూ.2వేలు తీసుకుంటారు. అయితే రిజిస్ట్రేషన్ ఖర్చులు, సబ్ రిజిస్ట్రార్‌లకు ఫీజు టూ ఫీజు చెల్లించాలంటూ భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్‌లలో ఉన్న చిన్నచిన్న లోపాలను భూతద్దంలో చూపించి మరింత పిండుకుంటున్నారు. వీటిలోనూ సబ్ రిజిస్ట్రార్లకు వాటాలు పుచ్చుకుంటన్నారు. కొందరు మార్కెట్ విలువ తగ్గిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విలువ కంటే ఎక్కువ ధరను సబ్ రిజిస్ట్రార్లతో చెప్పించి ఆతరువాత తగ్గించినట్ల్లు కొనుగోలుదారులను నమ్మించి పెద్దమొత్తం రాబట్టుకుంటున్నారు. ఇలా డాక్యుమెంట్ రైటర్లు రైట్ అంటేనే దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరుగుతోంది.
నకిలీ వీలునామాలతో వివాదాలు
కాసులకు కక్కుర్తిపడి సబ్ రిజిస్ట్రార్లు నకిలీ వీలునామాల దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తూ వివాదాలకు కారణమవుతున్నారు. ఇప్పటికే ఇలా చేసిన అత్యంత విలువైన భూముల వివాదాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇటీవల ఒంగోలు నగరంలో ఇలాంటివి అధికమయ్యాయి. పాత గుంటూరు రోడ్డులో మాజీ మంత్రి సన్నిహితుడికి, చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బినామీదారుల మధ్య సుమారు రూ.20కోట్ల భూమి కోసం వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఇరువురూ ఘర్షణపడి పోలీసు స్టేషన్‌లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అదేవిధంగా స్థానిక రాజీవ్ నగర్‌లో 200 గదుల భూమిని కబ్జా చేసేందుకు ఓ కార్పొరేటర్ అనుచరులతో ప్రయత్నిస్తున్నారని ఒంగోలు తాలుకా పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నల్లూరి నర్సింగ్ హోం సమీపంలో తన పూర్వీకులకు సంబంధించిన సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తిని ఓ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా అనేక భూ వివాదాలు ఒంగోలు పరిసరాలలో నడుస్తున్నాయి. నకిలీ వీలునామాలతో డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయడమే అందుకు కారణమైంది.
ఫీజ్ టూ ఫీజ్
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫీజు టూ ఫీజు సర్వసాధారణమైంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుకునేందుకు ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతోపాటు అంతే మొత్తాన్ని అదనంగా సబ్‌రిజిస్ట్రార్‌కు, కార్యాలయ సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు ఫీజు రూ.50 వేలు ఉంటే అంతే మొత్తం ఫీజ్ టూ ఫీజ్ కింద కప్పం కట్టాలి. అయితే మధ్యలో డాక్యుమెంటు రైటర్లు కొంత ఫీజు తగ్గించి వసూలు చేసి సబ్ రిజిస్ట్రార్‌లకు చేరవేస్తున్నారు. ఇలా అన్ని కార్యాలయాల్లో నడుస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం ఏసీబీ దాడి నేపథ్యంలో గురువారం కంభంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్ల గదులు తాళాలు వేసి కనిపించాయి.
చ ట్టపరమైన చర్యలు తీసుకుంటాం
పుష్పలత, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ
రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని గత నెలలో జీవో కూడా వచ్చింది. నకిలీ వీలునామాలతో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఏసీబీకి చిక్కిన కంభం సబ్ రిజిస్ట్రార్‌పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డబ్బులు అడిగినా తమ దృష్టికి తీసుకురావాలి. నకిలీ డాక్యుమెంట్లు విషయంలో విచారణ చేస్తాం.
Updated Date - 2023-05-11T23:42:39+05:30 IST