బాబోయ్.. బండరాళ్ల లారీలు..!
ABN, First Publish Date - 2023-01-24T00:24:22+05:30
రామాయపట్నం పోర్టు పనుల కోసం చీమకుర్తి నుంచి రాళ్ల తరలింపు ప్రజల పాలిట యమపాశాలుగా మారాయి. అంతేకాదు వందలాది లారీలు రాత్రిపగలు తేడా లేకుండా అతివేగంతో నిత్యం వెళ్తుండటంతో రహదారులు సైతం గుల్లవుతున్నాయి. రాళ్లు తరలిస్తున్న టిప్పర్ డ్రైవర్లు లైసెన్స్‌లు లేకుండానే నడుపుతున్నారు.
అతివేగం ఆపై అధిక లోడు
నిత్యం ఎక్కడో చోట ప్రమాదం
ఆందోళన చెందుతున్న ప్రజలు
ఒంగోలు(క్రైం), జనవరి 23: రామాయపట్నం పోర్టు పనుల కోసం చీమకుర్తి నుంచి రాళ్ల తరలింపు ప్రజల పాలిట యమపాశాలుగా మారాయి. అంతేకాదు వందలాది లారీలు రాత్రిపగలు తేడా లేకుండా అతివేగంతో నిత్యం వెళ్తుండటంతో రహదారులు సైతం గుల్లవుతున్నాయి. రాళ్లు తరలిస్తున్న టిప్పర్ డ్రైవర్లు లైసెన్స్‌లు లేకుండానే నడుపుతున్నారు. పరిమితికి మించి బరువుతో రాళ్లను రవాణా చేస్తున్నారు. అయినా రవాణా శాఖ పట్టించుకోని పరిస్థితి. రామాయపట్నం పోర్టు రాక్‌ఫిల్ వే నిర్మాణం చేస్తున్న కంపెనీ వైసీపీ ముఖ్యనాయకుడికి సంబంధించినది కావడంతో ఆ లారీలను చూస్తేనే అధికారులు భయపడుతున్నారు. అయితే నిత్యం చీమకుర్తి నుంచి రామాయపట్నం వరకు రాళ్ల లారీలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా, రహదారులు గుల్ల అవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఒంగోలులో కానిస్టేబుళ్ల ఎంపిక కోసం రాతపరీక్ష జరిగింది. ఆ సమయంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రాళ్లు తరలిస్తున్న లారీలు అడ్డంకిగా మారుతున్నాయని పోలీస్ అధికారుల దృష్టికి మీడియా తీసుకెళ్లినా వారు చేతులెత్తేశారు. నేరుగా ఎస్పీ మలికగర్గ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రెండు గంటలు ఒంగోలులో పాత బైపాస్ నుంచి దారిమార్చి జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. అసలు ఆ గ్రానైట్ రాళ్ల లారీలు అంటే అధికారులు వణికిపోతున్న పరిస్థితి. నిత్యం 500 లారీలతో చీమకుర్తి నుంచి పోర్టుకు రాళ్లు తరలిస్తున్నారు. కనీసం ఒంగోలు నగరంలో జనసంచారం ఉన్న పాత బైపాస్ రోడ్డు నుంచి కాకుడా హైవేపై నుంచి రవాణా చేయాలని ప్రజలు కోరినప్పటికీ పట్టించుకున్నా నాథుడే లేడు. పగలు కాకుండా రాత్రివేళ్లల్లో తిరిగేలా చూడాలని కోరినా వినిపించుకునే వారే లేరు. ఈ రాళ్లు తరలిస్తున్న లారీలకు పర్మిట్లు కూడా లేవనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు పరిమితికి మించి బరువు రవాణా చేయడంతో లారీల టైర్లు పగిలి అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. టిప్పర్ల రవాణాపై పోలీసు, రవాణా శాఖ అధికారులు మిన్నకుండిపోవడంపై అనేక విమర్శలు తలెత్తున్నాయి.
రద్దీగా ఉండే సమయంలో నిలపరాదు
రద్దీగా ఉండే సమయంలో కర్నూలు రోడ్డు, పాత బైపాస్ రోడ్డుల్లో టిప్పర్లు నిలపరాదని పాదచారులతోపాటు ద్విచక్రవాహనదారులు కోరుతున్నారు. రహదారి వారోత్సవాలలోనైనా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాళ్ల లారీల ప్రమాదాలు కొన్ని..
- ఈనెల 22న సింగరాయకొండ మండలం కనుమళ్ల వద్ద టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా డివైడర్‌కు ఢీకొట్టడంతో టిప్పర్ బోల్తా పడి రాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
-నెలరోజుల క్రితం ఒంగోలులో కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద మోటార్ సైకిలిస్టును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అతనికి త్రీవ గాయాలయ్యాయి.
- కొద్దిరోజుల క్రితం టిప్పర్ సింగరాయకొండ వద్ద హైవేపై తను వస్తున్న మార్గం దాటి పక్కవైపు వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టగా అందులో ఉన్న నిజాంపట్నానికి చెందిన వ్యక్తి మృతిచెందారు.
- చీమకుర్తి నుంచి ఒంగోలు వచ్చేలోపు నిత్యం లారీలు మరమ్మతులకు గురై రోడ్డుపై ఆపేస్తున్నారు. దీంతో రాకపోకలకు అడ్డంకిగా మారుతున్నాయి.
- ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్‌లో అనేక ప్రమాదాలు జరిగాయి.
- నిత్యం వందలాది లారీలు రద్దీగా ఉండే కర్నూలు రోడ్డుతో పాటు నగరంలోకి వస్తుండటంతో ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్నాయి.
పరిమితికి మించి రవాణా చేస్తే చర్యలు: డీటీసీ
పరిమితికి మించి రవాణా చేసే టిప్పర్లపై కేసులు నమోదు చేస్తామని డిప్యూటీ రవాణా శాఖ అధికారి శ్రీకృష్ణవేణి తెలిపారు. ముఖ్యంగా రామాయపట్నంకు రాళ్లు తరలించే లారీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను హెచ్చరించినట్లు తెలిపారు. చీమకుర్తిలో రెండు రోజుల్లో టిప్పర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. టిప్పర్లలో పరిమితికి మించి బరువు వేయకుండా, వాహన డాక్యుమెంట్లు డ్రైవర్ వద్ద ఉండాలన్నారు. డ్రైవర్లు 8 గంటలకు మించి పనిచేయకూడదని, లైసెన్స్‌లు ఉండాలన్నారు. అలా లేకుంటే ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2023-01-24T00:24:24+05:30 IST