శిథిలావస్థలో పశువైద్యశాల
ABN, First Publish Date - 2023-08-22T01:48:07+05:30
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా త్రిపురాంతకం పశువైద్యశాల పరిస్థితి ఉంది. మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు సొంత భవనం లేక 30 ఏళ్లగా కునారిల్లుతోంది.
త్రిపురాంతకం, ఆగస్టు 21: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా త్రిపురాంతకం పశువైద్యశాల పరిస్థితి ఉంది. మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు సొంత భవనం లేక 30 ఏళ్లగా కునారిల్లుతోంది. ఎన్నెస్పీ కాలనీలోని చిన్న రేకుల షెడ్డులో దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఆ రేకులషెడ్డు సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించడంతో ప్రస్తుతం పూర్తిగా శిధిలావస్థకు చేరింది. పైకప్పు రేకులన్నీ పగిలిపోయాయి. ప్రస్తుతం ఎండకు ఎండ, వర్షానికి వర్షం అన్న ట్లుగా తయారైంది. వర్షం పడినపుడల్లా వర్షపునీళ్లు కారుతూ వైద్యశాలలోని సామాగ్రి, మందులు అన్నీ తడిసిపోతున్నాయి. గోడలు కూడా పూర్తిగా పగుళ్లిచ్చాయి. పడిపోయే స్థితికి చేరాయి. విరిగిన తలుపులు, చెదలు పట్టిన కిటికీలతో ఆ పశువైద్యశాల అధ్వానంగా తయారైంది. కనీస వసతులు కూడా లేక పశువైద్యులు, సిబ్బంది తీవ్రంగా పడుతున్నారు. కూర్చునేందుకు కుర్చీలు వేసే స్థలం లేదు. మరుగుదొడ్లు లేవు. దీంతో గత టీడీపీ హయాంలో నూతన పశువైద్యశాల నిర్మాణానికి రూ. 80 లక్షలు మంజూరయ్యాయి. అప్పట్లో స్థలం లేకపోవడంతో అ నిధులు వెనక్కు వెళ్లాయి. అనంతరం వైద్యుల విన్నపాలతో వైద్యశాల నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ 50 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వంలో నూతన వైద్యశాల భవనం నిర్మించేందుకు నిధుల కోసం పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదించినా నిధులు మాత్రం మంజూరు కాలేదు. దీంతో ఎప్పుడు కూలుతుందో తెలియని రేకులషెడ్డులో వైద్యులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన సొంత వైద్యశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిన అవసం ఉంది.
Updated Date - 2023-08-22T01:48:07+05:30 IST