ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan : అమీతుమీయే!

ABN, First Publish Date - 2023-10-03T02:57:49+05:30

తాను సీఎం అవుతానా లేదా అన్నది ముఖ్యం కాదని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన..

నేను సీఎం కావడం ముఖ్యం కాదు: పవన్‌ కల్యాణ్‌

జనసేన-టీడీపీ కలిసి పోటీచేసి గెలవడమే లక్ష్యం

ఫలితాలొచ్చాక అధికారంపై మాట్లాడదాం

పదవిపై పంతాలొద్దు.. రాత్రికి రాత్రే అధికారం రాదు

20 ఏళ్లు కృషిచేస్తేనే మాయావతి సీఎం అయ్యారు

అన్ని వర్గాలను కలుపుకెళ్లాలి

ఒక్క సామాజికవర్గం మద్దతుతో అధికారం రాదు

జగన్‌ను మళ్లీ గెలిపిస్తే డ్రాక్యులాలా రక్తం తాగేస్తాడు

26 లక్షల దొంగ ఓట్లతో వైసీపీ రెడీ: జనసేనాని

మచిలీపట్నంలో కార్యకర్తలతో అంతర్గత భేటీ

మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి 26 లక్షల దొంగ ఓట్లను వైసీపీ దాచుకుంది. ఆ పార్టీ రక్తం మరిగి ఉంది. మళ్లీ గద్దెనెక్కితే ప్రజల భవిష్యత్‌ వేరేరకంగా ఉంటుంది.

- పవన్‌

మచిలీపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తాను సీఎం అవుతానా లేదా అన్నది ముఖ్యం కాదని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన.. టీడీపీ కలిసి పోటీచేసి గెలుపొందడమే ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు. ‘ఈసారి జరిగే ఎన్నికలు అమీతుమీ యుద్ధమే. మనమే గెలుస్తాం’ అని జనసైనికులకు భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో పార్టీ నాయకులతో ఆయన అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పోటీచేస్తాయని పునరుద్ఘాటించారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక అధికారం ఎవరికి అందుతుందనే అంశంపై మాట్లాడుకుందామని చెప్పారు. జనసైనికులు సీఎం పదవిపై పంతాలకు పోకుండా కలిసి సాగాలన్నారు. ఒక్క సామాజిక వర్గం మద్దతుతో అధికారం రాదన్న విషయం గ్రహించాలని సూచించారు. వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితే డ్రాకులా మాదిరిగా ప్రజల రక్తం తాగేస్తాడని హెచ్చరించారు. ఆయన వద్ద ప్రైవేటు సైన్యం ఉందని, గతంలో బెంగుళూరులో ఎస్‌ఐ స్థాయి అధికారిని కొట్టి స్టేషన్‌లో ఉంచిన ఘనత వారికుందన్నారు. ఇంకా ఏమన్నారంటే..

వ్యతిరేక ఓటు చీలకుండా..

జగన్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాం. స్థానిక ఎన్నికల సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన, టీడీపీ గ్రామాల్లో పోటీచేసి విజయం సాధించాయి. కులాన్ని కాంక్షించే వారు దేశ భవిష్యత్‌ను కాపాడలేరు. కుల మత ప్రస్తావన లేని పార్టీలనే ప్రజలు ఆదరిస్తారు. వైసీపీ ప్రభుత్వంలో 70 శాతం ఒక కులానికే న్యాయం జరుగుతోంది. నా స్నేహితుల్లో అన్ని సామాజికవర్గాల వారూ ఉన్నారు. కులాల మధ్య ఐక్యత అవసరం.

ఓడిపోయే పార్టీని తిట్టడమెందుకు?

మరో ఆరు నెలల్లో వైసీపీ ఓడిపోతుంది. కొండ అంచున నిలబడి పడిపోయే వారిని, ఐసీయూలో ఉన్న వారిని చూసి అయ్యో పాపం అంటాం తప్ప వారిని ద్వేషించడమో, తిట్టడమో చేయం. నాయకుడంటే ఆవేశానికి లోనుకాకుండా శంకరుడి మాదిరిగా గరళాన్ని గొంతులోనే ఉంచుకోవాలి. మాట ద్వారానే మంచితనం పెరుగుతుంది. కక్షసాధింపులకు దిగితే ఫలితాలు వేరుగా ఉంటాయి. 2008లో పార్టీ (ప్రజారాజ్యం) పెట్టినప్పుడు దూరంగా ఉన్న వారు మోసం చేయలేదు. దురాశకు పోయి దగ్గరున్న వారే ఇబ్బందుల పాల్జేశారు. పార్టీని నడపడం ఇలా కాదని చెప్పినా ఎవరూ నా మాట వినలేదు. పార్టీ నడపడానికి ఎవరినీ డబ్బు యాచించను. ఇప్పుడు 10 వేల కోట్లు, 20 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇచ్చినా తీసుకోను. పార్టీని నడిపేందుకే సినిమాలు తీస్తున్నా. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో జనసేన పాదముద్ర ఉంటుంది. పార్టీ టికెట్లు ఇచ్చేది నేను కాదు.. ఎవరికివ్వాలో ప్రజలే నిర్ణయిస్తారు.

నాలుక గీసుకోవడానికీ పనికిరావు..

మనకున్న ఆస్తులు దస్తావేజుల రూపంలో ఇంట్లో భద్రపరుచుకుంటాం. కానీ వైసీపీ ప్రభుత్వం దస్తావేజులు లేని రెవెన్యూను సృష్టిస్తోంది. ఆస్తుల జిరాక్స్‌ కాపీలు ఇస్తామని చెబుతోంది. అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు.

150 మంది నుంచి 6 లక్షల దాకా..

జనసేన 150 మంది క్రియాశీల సభ్యులతో ప్రారంభమై ఆరు లక్షల మంది సభ్యుల స్థాయికి ఎదిగింది. కేరళ నుంచీ ఢిల్లీ వరకు అనేకమంది నాతో మాట్లాడుతుంటారు. ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన టీఆర్‌ఎస్‌ తన పరిధిని విస్తరించుకుని బీఆర్‌ఎ్‌సగా మారింది. మనం కూడా అలా విస్తరించాలి.

మహాత్ముడి స్ఫూర్తితో ముందడుగు

దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో మహాత్మాగాంధీ పాత్ర స్ఫూర్తిదాయకమని, ప్రజలకు మంచి జరిగేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన ఆధ్వర్యంలో గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో సోమవారం జరిగాయి. పవన్‌ వారి చిత్రపటాలపై పూలుజల్లి నివాళులు అర్పించారు. వేదికపై అరగంటపాటు ధ్యానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో ప్రస్తుతం చంపేశారని, స్థానిక సంస్థలకు, ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి జైజవాన్‌, జైకిసాన్‌ అనే నినాదం ఇస్తే దేశమంతా పాటించిందన్నారు. ప్రస్తుతం పరిపాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ నిరసన తెలియజేసినవారిపై హత్య కేసులు పెడుతున్నారని తెలిపారు.

అధికారం రాత్రికి రాత్రే రాదు. యూపీలో 20 ఏళ్లు బీఎస్పీ కృషిచేస్తేనే మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పార్టీని ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లి అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తా.

ఆరు నెలల్లో అధికారం కోల్పోయే పార్టీని ఎందుకు తిట్టాలి? వైసీపీ నాయకులు నన్ను తిట్టినా సన్నాసి అని మాత్రమే సంబోధించా. ఇక నుంచీ ఇలాంటి పదాలు కూడా వాడను.

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - 2023-10-03T02:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising