వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోంది
ABN, First Publish Date - 2023-02-21T03:43:39+05:30
వైసీపీపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రమవుతోంది. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న లుకలుకలేవీ మా పార్టీని గెలిపించవు. ప్రజల్లో వచ్చిన విప్లవాన్ని చూసైనా మా విధానాలను మార్చుకోవాలి.
కన్నా టీడీపీలో చేరడం అధికారపక్షానికి దెబ్బే
వివేకా హత్యపై ప్రజల అనుమానం నిజమైతే ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది: ఎంపీ రఘురామరాజు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత తీవ్రమవుతోంది. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న లుకలుకలేవీ మా పార్టీని గెలిపించవు. ప్రజల్లో వచ్చిన విప్లవాన్ని చూసైనా మా విధానాలను మార్చుకోవాలి. లేకుంటే ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలిపినా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తారు. ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కన పెట్టి, ముందు మనం మన పార్టీలోని లుకలుకలను సరి చేసుకోవాలి’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసి అధికార పార్టీలో కాకుండా ప్రతిపక్ష టీడీపీలో చేరడం మా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. రాష్ట్ర రాజకీయాల్లో కన్నా పెద్ద నాయకుడు. బీజేపీ నుంచి మరి కొంతమంది జిల్లా అధ్యక్షులు టీడీపీలో చేరనున్నట్లు ఆయన పేర్కొనడం సంచలనమే. రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నట్లుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండి ఉంటే, రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేసింది ఎవరన్నది ఇప్పటికే ఆధారాలు లభించాయి. హత్యకు సూత్రధారులు ఎవరన్నదే తెలియాల్సి ఉంది. హంతకులు డబ్బు కోసమే వివేకాను హత్య చేసినట్లు అంగీకరించారు. అయితే.. ఆ డబ్బు సమకూర్చింది ఎవరన్నది తెలియాల్సి ఉంది. సినీ హీరో నందమూరి తారకరత్న పిన్నవయసులోనే అందరికీ దూరం కావడం అత్యంత విషాదకరం. తారకరత్న పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబుతో, మా పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు అభినందనీయం. తారకరత్న మరణం విషయంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు జుగుస్సాకరంగా ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో గతంలో ఐదవ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు రెండవ స్థానానికి ఎగబాకడం ద్వారా విద్యావ్యవస్థలో మరింతగా దిగజారి పోయినట్లు స్పష్టమవుతోంది. ఏయూ వీసీని తక్షణమే సస్పెండ్ చేయాలి’’ అని రఘురామరాజు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-02-21T03:43:40+05:30 IST