నేతల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ
ABN, First Publish Date - 2023-07-21T03:24:11+05:30
నియోజకవర్గ ఇన్‌చార్జి నుంచి గ్రామంలో బూత్‌స్థాయి కన్వీనర్ వరకూ పార్టీలో ఎవరి పనితీరు ఎలా ఉందో నిత్యం పర్యవేక్షించే ఒక కొత్త వ్యవస్థను టీడీపీ రూపొందించింది.
ఎన్నికల ముందు టీడీపీలో కొత్త వ్యవస్థ
15 నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రజంటేషన్
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ఇన్‌చార్జి నుంచి గ్రామంలో బూత్‌స్థాయి కన్వీనర్ వరకూ పార్టీలో ఎవరి పనితీరు ఎలా ఉందో నిత్యం పర్యవేక్షించే ఒక కొత్త వ్యవస్థను టీడీపీ రూపొందించింది. ఎన్నికల ముందు తమ సంస్థాగత యంత్రాంగాన్ని.. వివిధ కమిటీల్లో నేతల పనితీరును మెరుగుపరచి.. సమరానికి సన్నద్ధం చేసే ఉద్దేశంతో దీనిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధం చేయించారు. గురువారమిక్కడ తన నివాసంలో పార్టీ సీనియర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యవస్థ గురించి వారికి వివరించారు. నమూనాగా 15 నియోజకవర్గాలకు సంబంధించి రూపొందించిన నివేదికలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణకు కొన్ని సర్వే బృందాలను అధినాయకత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ బృందాలు పంపే సమాచారంతోపాటు వేరే మార్గాల ద్వారా కూడా వివరాలు తెప్పించుకుంటోంది. దాన్ని విశ్లేషించి నివేదికల తయారీకి టెక్నాలజీని వాడుతున్నారు.
మానవ ప్రమేయం లేకుండానే ఈ టెక్నాలజీ నెలవారీ పనితీరు నివేదికలు రూపొందిస్తుంది. నియోజకవర్గ ఇన్‌చార్జి, మండల పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్‌చార్జి, యూనిట్ ఇన్‌చార్జి, బూత్ కమిటీ కన్వీనర్ తదితరుల పనితీరుపై రిపోర్టులు వెలువడుతాయి. దీనివల్ల ఎన్నికల ముందు పార్టీ కమిటీల పనితీరు మెరుగుపడుతుందని, లోపం ఉంటే దిద్దుకోవడానికి వీలుపడుతుందని నాయకత్వం ఆశిస్తోంది. గత మూడు ఎన్నికల్లో వివిధ బూత్‌లు, యూనిట్లు, క్లస్టర్లు, మండలాల పరిధిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా లెక్కలు తయారు చేశారు. వీటిని ఆయా కమిటీలకు పంపి ఈసారి అక్కడ టీడీపీకి ఓట్లు పెరగడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కొద్దిరోజుల్లో 175 నియోజకవర్గాల నివేదికలు తయారవుతాయని చంద్రబాబు చెప్పారు. కాగా, పోల్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా చేసి మంచి మెజారిటీలు సాధించుకోవడం కోసం ఈ వ్యవస్థను తయారు చేసినట్లు పార్టీనేత నిమ్మల రామానాయుడు చెప్పారు.
రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి మార్పు
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిని టీడీపీ మార్చివేసింది. కొత్తగా బొడ్డు వెంకటరమణను ఇన్‌చార్జిగా నియమిస్తూ శుక్రవారం ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దివంగత ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావుకు వెంకట రమణ కుమారుడు. గతంలో ఈ నియోజకవర్గానికి టీడీపీ తరఫున వెంకటేశ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గ బాధ్యతలు వదిలేశారు. తర్వాత వాటిని తీసుకోవడానికి మళ్లీ ముందుకు వచ్చారు. కాని ఆయన పనితీరు ఆశించిన స్ధాయిలో లేదన్న అభిప్రాయంతో ఈ మార్పు చేశారు. వేమూరు, నందిగామ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జులు నక్కా ఆనందబాబు, తంగిరాల సౌమ్యను కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ రెండు నియోజకవర్గాల నేతలతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.
Updated Date - 2023-07-21T03:24:11+05:30 IST