ఈపంట నమోదు చేయలేం!
ABN, First Publish Date - 2023-08-04T00:36:47+05:30
.క్షేత్రస్థాయిలో ఈ పంట నమోదు కష్టతరంగా ఉంటోంది.. ఫొటో క్యాప్చర్ చేయడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి..
మహిళలకు మాన, ప్రాణ రక్షణలేదు
ఎంఏవోల లక్ష్యాల కేటాయింపుతో పనిఒత్తిడి
నెల్లూరులో వీఏఏల ఆందోళన
నెల్లూరు (వ్యవసాయం), ఆగష్టు 3 : .క్షేత్రస్థాయిలో ఈ పంట నమోదు కష్టతరంగా ఉంటోంది.. ఫొటో క్యాప్చర్ చేయడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి.. పొలాల్లో విషపురుగులతో భయాందోళన నెలకొంది.’అంటూ గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సహాయకుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం ఎదుట జిల్లాలోని వీఏఏలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వీఏఏలు మాట్లాడుతూ ఈపంట నమోదు గతం కంటే ఈసారి భిన్నంగా ఉందని జియోఫెన్సింగ్ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందిగా మారిందని ఆవేదన చెందారు. ప్రతి సర్వే నెంబరుకు వెళ్లనిదే పంట నమోదు కావడం లేదని, ఒక్కోసారి సర్వేనెంబరు వద్దకు వెళ్లినా సాంకేతిక లోపాల వల్ల పంట నమోదు కావడం లేదని తెలిపారు. పొలం గట్లపై నడవలేని పరిస్థితి నెలకొంటోందని, జియోఫెన్సింగ్ లొకేషన్ పొలాల మధ్య, కాలువలు, ముళ్ల పొదల్లో చూపిస్తోందని చెప్పారు. రోజులో 10-20 ఎకరాలు మాత్రమే చేయగలుగుతున్నామని, వ్యవసాయాధికారులు మాత్రం 60-70 ఎకరాలు చేయాలని లేదంటే మెమోలు జారీ చేస్తున్నారని వాపోయారు. ఈ పంట నమోదుతో మహిళలకు మాన, ప్రాణ సంరక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని కాబట్టి గత రబీ సీజన్లో ఉన్న విధానాన్నే అమలు చేయాలని లేదంటే జియోఫెన్సింగ్ 500 మీటర్ల పరిధి ఇవ్వాలని అధికారులను కోరారు. అదేవిధంగా ఈపంట నమోదులో గ్రామ రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి లేకపోవడంతో క్యాంపు కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడడతానని హామీ ఇచ్చారు.
=========
Updated Date - 2023-08-04T00:36:47+05:30 IST