చంద్రన్న కోసం కదిలిన దండు!
ABN, First Publish Date - 2023-09-27T23:47:35+05:30
తెలుగు తమ్ముళ్లు గేరు మార్చి సైకిల్ స్పీడు పెంచారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇప్పటిదాకా దీక్షలతో నిరసన తెలిపిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తు కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు.
మరిన్ని ఉద్యమాలకు కార్యాచరణ
2న నెల్లూరులో భారీస్థాయిలో శాంతి ర్యాలీ
వీఎస్‌యూలో ‘స్కిల్’ సెంటర్ సందర్శన
జనసైనికులతో దోస్తీ.. కలిసి పోరాడతామని స్పష్టం
జిల్లాలో కొనసాగుతున్న రిలే దీక్షలు
తెలుగు తమ్ముళ్లు గేరు మార్చి సైకిల్ స్పీడు పెంచారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇప్పటిదాకా దీక్షలతో నిరసన తెలిపిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తు కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. బుధవారం ఆ పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులంతా సమావేశమై అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరులో భారీస్థాయిలో శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించారు. అలాగే, వీఎస్‌యూలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడున్న పరికరాలను పరిశీలించడంతోపాటు సిబ్బందితో వివరాలు సేకరించారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాలు చూపినట్టు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే అధికార పార్టీ నేతల కళ్లకు మాత్రం కనిపించడం లేదా!? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించడంతోపాటు జనసైనికులతో కలిసి పోరుబాట సాగిస్తామని స్పష్టం చేశారు.
2న శాంతీయుత ర్యాలీ
టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం
నెల్లూరు (ఆంధ్రజ్యోతి) : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ వచ్చే నెల 2వ తేదీన నెల్లూరు నగరంలో భారీ శాంతీయుత ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు నిర్ణయించారు. ఈ ర్యాలీలో అన్ని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని తీర్మానించారు. బుధవారం నగరంలోని ఎన్టీఆర్ భవన్‌లో నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా నేతల సమావేశం జరగ్గా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యాచరణను అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. అలానే ఇప్పటికే జరుగుతున్న ఆందోళనలను మరింత ఉధృతంగా చేపట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు. బాబుతో నేను కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్, కంభం విజయరామిరెడ్డి, తాళ్లపాక రమే్‌షరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, కావలి ఇన్‌చార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొన్నారు.
బహిరంగా చర్చకు
మేం సిద్ధం.. మీరు సిద్ధమా!?
స్కిల్ డెవలప్మెంట్‌పై టీడీపీ నేతల సవాల్
వెంకటాచలం, సెప్టెంబరు 27 : ‘చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వీఎ్‌సయూలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు నిధులు సమకూరిన మాట వాస్తవం కదా!? ఈ సెంటర్‌కు అవసరమైన అన్ని రకాల పరికరాలు, ల్యాప్‌టా్‌పలు, ఇతర సదుపాయాలు కల్పించలేదా!? ఇప్పటికే నిరుద్యోగులు, విద్యార్థులు శిక్షణ పొంది ఉద్యోగావకాశాలు పొందలేదా!? జిల్లాలోని వైసీపీ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇవన్నీ కనిపించడం లేదా!? దీనిపై వైసీపీ నాయకులు బహిరంగా చర్చకు వస్తామంటే మేధావుల సమక్షంలో మీడియా ఆధ్వర్యంలో మేం చర్చకు సిద్ధం’ అంటూ టీడీపీ జిల్లా నేతలు సవాల్ విసిరారు. కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలోని స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను బుధవారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా నేతల బృందం ఆకస్మికంగా సందర్శించింది. అక్కడున్న ల్యాప్‌టా్‌పలు, పరికరాలు, ఇతర సామగ్రిని, నూతనంగా నిర్మించిన నైపుణ్యాభివృద్ధి భవనాన్ని వారు స్వయంగా పరిశీలించారు. ఎంత మంది శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందారో ఆ వివరాలు సేకరించారు. సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జే విజేత మాట్లాడుతూ వీఎ్‌సయూలో 2018లో సెంటర్ అనుమతికి ఆమోదం తెలపగా 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, కార్పొరేషన్ ద్వారానే 90 ల్యాప్‌టా్‌పలు, ఇతర పరికరాలు, ఇతర సదుపాయాలు సమకూరినట్టు తెలిపారు. వీటికి కావాల్సిన నిధులంతా ఆనాటి నుంచి నేటి వరకు వీఎ్‌సయూకు, ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదని, అంతా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే నిధులు సమకూరుతున్నట్లు ఆమె తెలిపారు. వర్సిటీతోపాటు కావలి పీజీ సెంటర్‌తోపాటు జిల్లాలో అనేక చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 500 మంది వరకు శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాలు పొందారని, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి వెలికి తీసేందుకు ఆ సెంటర్లు ఎంతోగానో దోహదపడుతున్నాయన్నారు. ఈ వర్సిటీని సందర్శించిన వారిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామానారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాశం సునీల్, కంభం విజయరామిరెడ్డి, తాళ్లపాక రమే్‌షరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఇతర నాయకులు నరసింహయాదవ్, మాలేపాటి సుబ్బానాయుడు, గుమ్మడి రాజాయాదవ్, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, తాళ్లపాక అనురాధ, తిరుమలనాయుడు తదితరులు ఉన్నారు.
తమ్ముళ్లు, జనసైనికులు జత కలిసే
జనసేన కార్యాలయానికి టీడీపీ నేతలు
ఇక కలిసే పోరాటాలు చేస్తామని స్పష్టం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), సెప్టెంబరు 27 : జన సైనికులతో తెలుగుతమ్ముళ్లు జతగట్టారు. బుధవారం సాయంత్రం నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి టీడీపీ ముఖ్యనాయకులు చేరుకుని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అనంతరం ఇరు పార్టీల నాయకులు విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రూ.6 లక్షల కోట్ల అవినీతి చేశారని చెప్పి నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ చివరకు కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లు రూ.375 కోట్లు అంటూ ఒక్కదానికీ ఆధారం చూపలేని స్థితిలో ఉన్నారన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో నిరూపించుకున్నారన్నారు. రాజమండ్రిలో చంద్రబాబును కలిసి బయటకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పడం గొప్ప విషయమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు టీడీపీ, జనసేనలు కలిసి పోరాటం చేస్తాయని, నియంత పాలనకు బుద్ధి చెప్పే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున నగరంలోని గాంధీవిగ్రహం వద్ద టీడీపీ జనసేనలు కలిసి శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నిరసనలో పాల్గొనాలని బీజేపీ, వామపక్షాలను కూడా పిలుస్తామని చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఇవాళ కలిసిన ఈ కలయిక రాజ్యాంగాన్ని నిలబెట్టే వరకు కలిసి పని చేస్తూ అధికారంలోకి వస్తామని తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైనాట్ 175 సరే, నో మోర్ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రజలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు టీడీపీతో కలిసి జనసేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కంభం విజయరామిరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, జనసేన పార్టీ నాయకులు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు, కొట్టే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గర్జించిన తెలుగు మహిళలు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా సామూహిక రిలే నిరాహార దీక్షలు జరిగాయి. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన రిలే నిరాహార దీక్షలో మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు కోసం మేముసైతం అంటూ తెలుగు మహిళలు గర్జించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్లకార్డులను తొక్కుతూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. కళ్లకు నల్లరిబ్బన్లతో గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల పట్ల కంసుడిలా తయారయ్యాడని తెలుగు మహిళలు విమర్శించారు. ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రజలు అనుభవిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో రామరాజ్యం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-27T23:47:35+05:30 IST