Nara Lokesh : అబ్బాయిలది బెయిల్ బతుకు
ABN, First Publish Date - 2023-06-02T04:14:58+05:30
‘బాబాయిని ఇద్దరు అబ్బాయిలు వేసేశారు. గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారు. సొంత పత్రిక, టీవీలో నారాసుర రక్తచరిత్ర అంటూ రాసుకున్నారు. హూ కిల్డ్ బాబాయ్? బాబాయిని ఎవరు చంపారు..? అబ్బాయిలే వేసేశారని సీబీఐ తేల్చింది. బాబాయి
బాబాయి హత్య కేసులో జగన్, అవినాశ్ జైలుకెళ్లడం ఖాయం
సీఎంను విచారించాలని సీబీఐ కోర్టుకు చెప్పగానే విమానంలో ఢిల్లీకి
కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం
కేసుల కోసం ఎంపీల తాకట్టు
మోటార్లకు మీటర్లు పెడితే పగలగొట్టండి
పాదయాత్రలో నారా లోకేశ్ ఫైర్
ప్రొద్దుటూరులో పోటెత్తిన జనం
అడుగడుగునా మంగళహారతులు
కడప, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ‘బాబాయిని ఇద్దరు అబ్బాయిలు వేసేశారు. గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారు. సొంత పత్రిక, టీవీలో నారాసుర రక్తచరిత్ర అంటూ రాసుకున్నారు. హూ కిల్డ్ బాబాయ్? బాబాయిని ఎవరు చంపారు..? అబ్బాయిలే వేసేశారని సీబీఐ తేల్చింది. బాబాయి హత్యలో జగన్ పాత్ర ఉందని కోర్టుకు చెప్పింది. ఆయన్ను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయనగానే అబ్బాయి హుష్ కాకి అంటూ ఢిల్లీ వెళ్లి పెద్దలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. కేసుల కోసం 22 మంది ఎంపీలను తాకట్టుపెట్టారు. అబ్బాయిలిద్దరివీ బెయిల్ బతుకులు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పైన దేవుడున్నాడని, బాబాయి హత్యలో ఇద్దరు అబ్బాయిలూ జైలుకెళ్లడం ఖాయమన్నారు. యువగళం 113వ రోజు పాదయాత్ర గురువారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. శివాలయం సెంటరులో జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు. లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ మాయమాటలు చెబుతూ రాష్ట్రాన్ని జీరో చేశాడని.. ప్రజలకు గుండుసున్నా చుట్టాడని ధ్వజమెత్తారు. ‘అందుకే జీరో జగన్ అని పేరు పెట్టాను. మహిళలను మాయ చేసి మోసం చేశాడు. సంపూర్ణ మద్యనిషేధం అంటూ జే బ్రాండ్స్, బూమ్‌బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్‌మెడల్‌లాంటి బ్రాండ్లు తెచ్చి మహిళల తాళ్లు తెంచుతున్నాడు. బీసీ, ఎస్సీ ఎస్టీ మహిళలకు పెన్షన్ అని మోసం చేశాడు. రైతులు కల్తీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులతో తీవ్రంగా నష్టపోతుంటే.. పుండు మీద కారం చల్లినట్లుగా వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడుతున్నాడు. మీటర్లు పెడితే వాటిని పగలగొట్టండి, మీకు టీడీపీ అండగా ఉంటుంది’ అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
మేనిఫెస్టోతో వైసీపీ మైండ్ బ్లాక్
యువగళంతో ప్రజల కష్టాలను కన్నీళ్లను దగ్గరుండి చూశాను. నేను చూసిన ప్రజల కష్టాలను చంద్రన్న దృష్టికి తీసుకెళ్లడంతో.. ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో ఆయన తెచ్చిన టీడీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ మైండ్ బ్లాక్ అయింది. వైసీపీ కుక్కలు వచ్చి రోడ్డుపైన మొరుగుతున్నాయి. మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి కింద రూ.18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1,500 చొప్పున 5 ఏళ్లకు రూ.90 వేలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15వేలు, దీపం పథకంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. జీరో జగన్ పిల్లల భవిష్యత్‌ను దెబ్బతీశారు. జాబ్ కేలెండరు ఇవ్వలేదు. 2.35 లక్షల ఉద్యోగాలు లేవు, గ్రూపు–2 లేదు, డీఎస్సీ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేశాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల మందికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేలు ఇస్తాం. పోలీసులకు దాచుకున్న జీపీఎస్ సైతం కొట్టేశాడు. మేమొస్తే పోలీసుల బకాయిలు చెల్లిస్తాం.
ఏం కామెడీ ఇది!
జీరో జగన్ కామెడీ చేస్తున్నాడు. లక్ష కోట్లు ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకున్నవాడు పేదవాడా? బెంగళూరులో 32 ఎకరాల్లో ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడా? హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ, వైజాగ్‌లో ప్యాలెస్‌లు కడుతున్నారు. సొంత టీవీ చానల్, పేపరు, పవర్‌ప్లాంటు ఉన్నాయి. ఈయన పేదవాడా..? ఒక్క బటన్ నొక్కి పది రూపాయలు మీ అకౌంటులో వేసి రెండో బటన్ ద్వారా కరెంటు చార్జీలు, బస్ చార్జీలు పెంచి తన అకౌంటులోకి లాగేసుకుంటున్నాడు. 2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడని రాచమల్లు శివప్రసాదరెడ్డిని ప్రజలు గెలిపించారు. అయితే గ్యాంబ్లింగ్, బెట్టింగ్, గుట్కా. మట్కా, దొంగనోట్లకు, ఇసుక రవాణాకు అడ్డాగా మార్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత కారుకు ఈఎంఐ కట్టలేనివాడు ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడు.
అడుగడుగునా బ్రహ్మరథం
113వ రోజు పాదయాత్ర బాస్ క్రికెట్ స్టేడియంలోని విడిది కేంద్రం ప్రారంభమైంది. బొల్లవరం, ఆర్ట్స్‌కాలేజీ, వన్‌టౌన్, అమ్మవారిశాల మీదుగా శివాలయంగడ్డ వరకు పాదయాత్రకు జనం పోటెత్తారు. మహిళలు హారతులు ఇచ్చి పూలు చల్లారు. పాదయాత్ర అంతా పూలవర్షం కురిపించారు. లోకేశ్ కోసం జనం ఎటుచూసినా మిద్దెలు మేడ లు ఎక్కి నిలబడ్డారు. గురువారం ఆయన 10.5 కి.మీ. నడిచారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాదయాత్ర 1456.6 కి.మీ సాగింది.
లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి
ప్రొద్దుటూరులో వైసీపీ కార్యకర్తల బరితెగింపు
వారికి వత్తాసు పలికిన పోలీసులపై లోకేశ్ ఫైర్
ప్రొద్దుటూరులో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌పై వైసీపీ మూకలు కోడిగుడ్లతో దాడి చేయడం గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శివాలయం సెంటరులో బహిరంగసభ అనంతరం ఆయన మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కొత్తపల్లి బైపాస్ మీదుగా కొత్తపల్లి పీఎన్‌ఆర్ ఎస్టేట్ వద్ద విడిదికేంద్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జనాలను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ కొత్తపల్లి రిలయన్స్ పెట్రోలుబంకు సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వైసీపీ కార్యకర్త లోకేశ్‌పై గుడ్డు విసిరారు. అది బద్వేలు టీడీపీ నేత రితీశ్‌కుమార్‌రెడ్డిని, లోకేశ్‌ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై సీఐ రాజారెడ్డిని లోకేశ్ ప్రశ్నించారు. మాపై దాడులు జరిగితే ఏం చేస్తున్నారని అడిగారు. మీరు ఫ్లెక్సీలు చించారంటూ సీఐ రాజారెడ్డి మాట్లాడడంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాదయాత్రకు అనుమతి తీసుకున్నాం. మూడ్రోజులుగా వైసీపీవారే రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడుతుంటే మీరేం చేస్తున్నారు? భద్రత కల్పించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా, మీ కథ తేలుస్తా’ అని హెచ్చరించారు. తర్వాత కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ అక్కడే కాసేపు బైఠాయించి రాత్రి 10.30 గంటలకు విడిది కేంద్రానికి చేరుకున్నారు.
Updated Date - 2023-06-02T04:14:58+05:30 IST