యువగళం దెబ్బకు మంత్రులు అవుట్
ABN, First Publish Date - 2023-04-03T01:57:56+05:30
యువగళం పాదయాత్ర దెబ్బకు మంత్రులను మార్చే పనిలో సీఎం జగన్ ఉన్నారు. పాదయాత్ర చేపట్టిన 58 రోజులకే జగన్ కేబినెట్‌లో నలుగురు మంత్రులు ప్యాకప్ అంట.
58 రోజులకే నలుగురిని మార్చే పనిలో జగన్
400 రోజులు పూర్తయితే ఫ్యాన్ మసే
టీడీపీ గెలిచాక చేనేతలను ఆదుకుంటాం
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
శ్రీసత్యసాయి జిల్లా పాదయాత్రలో లోకేశ్
పుట్టపర్తి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘యువగళం పాదయాత్ర దెబ్బకు మంత్రులను మార్చే పనిలో సీఎం జగన్ ఉన్నారు. పాదయాత్ర చేపట్టిన 58 రోజులకే జగన్ కేబినెట్‌లో నలుగురు మంత్రులు ప్యాకప్ అంట. ఇక 400 రోజులు పూర్తయితే ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం పట్టుకుని సీఎం జగన్ వచ్చాడని, తాను అంబేడ్కర్ రాజ్యాంగం పట్టుకుని నడుస్తున్నానన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ముందు రాజారెడ్డి రాజ్యాంగం ఓడిపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ గిలగిలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లాలో 58వ రోజు యువగళం పాదయాత్రలో లోకేశ్ పాల్గొన్నారు. పాదయాత్రకు జనం పోటెత్తారు. ధర్మవరంలోని సీఎన్‌బీ క్యాంపు నుంచి బత్తలపల్లి మండలం ముష్టూరు విడిది కేంద్రం వరకు పాదయాత్ర 13.7 కిలోమీటర్లు సాగింది. దీంతో మొత్తం 745.8 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. బత్తలపల్లి బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. ‘‘జగన్‌రెడ్డి చేసేవి దొంగ పనులే. అందుకే ఆయనకు చోర్‌మోహన్ అని పేరు పెట్టాను. కోడికత్తి, బాబాయ్ గుండెపోటు అంటూ డ్రామాలు ఆడారు.
శ్రీకాళహస్తిలో బడాచోర్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మొన్న మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని చంద్రబాబు బలిదానం చేశారని విమర్శించారు. అయ్యా బడాచోర్ మధుసూదన్‌రెడ్డీ.. మీ అధ్యక్షుడు చోర్ మోహన్‌రెడ్డి సీఎం పదవి కోసం సొంత బాబాయ్‌ను నరబలి ఇచ్చాడు. ఇప్పుడేమో బాబాయ్ హత్య కేసులో సీబీఐ అవినాశ్‌రెడ్డిని పిలుస్తుంటే, జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. పోలీసులు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అలాంటి అధికారులపై ప్రత్యేక జ్యుడీషియల్ విచారణ వేసి, వారిని డిస్మిస్ చేసే వరకు వదిలిపెట్టం. పోలీసులకు జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన టీఏ, డీఏ, అరియర్స్ అందిస్తాం. టీడీపీ కార్యకర్తలు పార్టీని భుజస్కంధాలపై మోస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్రను చంపినా.. కార్యకర్తలు పార్టీ మారలేదు. పార్టీ మారాలని ఎంతోమందిని భయపెట్టినా పసుపు జెండాతోనే మా జీవితమని అనంత ప్రజలు నిలబడి స్ఫూర్తి నింపారు’’ అని లోకేశ్ అన్నారు.
చేనేత రంగాన్ని ఆదుకుంటాం
‘‘టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తుందని వలంటీర్లతో జగన్ ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే. టీడీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలంటే జగన్ తరం కాదు. అన్న క్యాంటీన్, సంక్రాంతి కానుక, పెళ్లి కానుక, రంజాన్ తోఫా, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య తదితర పథకాలు అందించిన ఘనత టీడీపీదే. టీడీపీ అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ లేకుండా చేస్తాం. యార్న్, కలర్‌పై సబ్సిడీ అందిస్తాం. చేనేత మగ్గానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. పట్టు రైతుల నుంచి చేనేత కార్మికుడి వరకు అన్ని వర్గాలను ఆదుకుంటాం. దేశంలోనే పట్టుకేంద్రంగా ప్రసిద్ధి చెందిన ధర్మవరంలో వైసీపీ పాలనలో 55 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేనేత రంగాన్ని ఆదుకుంటాం’’ అని లోకేశ్ అన్నారు.
వాల్మీకి, బోయలకు న్యాయం చేస్తాం
‘‘గత నాలుగేళ్లలో బీసీలకు అందాల్సిన 75,760 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించిన బీసీ ద్రోహి జగన్. వాల్మీకి, బోయలతో పాటు 26 వేలమంది బీసీలపై సర్కారు కేసులు నమోదు చేసి, వేధిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాల్మీకి, బోయల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుంది. బీసీలపై వైసీపీ సర్కారు పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం’’ అని అన్నారు.
కేటుగాడు కేతిరెడ్డి
‘‘ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నెంబర్ 1 కేటుగాడు. ఎమ్మెల్యే ప్రతిరోజూ గుడ్‌మార్నింగ్ పేరుతో తిరుగుతూ ఎక్కడెక్కడ ఖాళీ భూములున్నాయ్, ఎవరి స్థలం కబ్జా చేయాలని స్కెచ్ వేస్తారు. కబ్జాగ్యాంగ్‌ను రంగంలోకి దింపి స్థలాలను కొట్టేస్తారు. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 50 ఎకరాల భూమిని కొట్టేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ప్రతినెలా రూ.30 లక్షలు ఈయనకు వాటా వెళ్లాల్సిందే. ఎర్రగుట్టను మింగేసి ఫామ్‌హౌస్ కట్టారు. ఏకంగా 20 ఎకరాల భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు. ధర్మవరం చుట్టూ భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేశారు. ఫామ్‌హౌ్‌సలో రేసింగ్ ట్రాక్, గుర్రపుస్వారీ, చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి సామంతరాజులాగా వ్యవహరిస్తున్నారు. చెరువు కింద సాగుకు నీరివ్వకుండా బోటింగ్‌కు నీరు నిల్వ ఉంచి, రైతుల నోట్లో మట్టికొట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈయన అక్రమాలపై సిట్ వేసి, దోచుకున్న భూములను పేదలకు పంచుతాం’’ అని లోకేశ్ మండిపడ్డారు.
లోకేశ్‌పై ఎగిరిన పోలీసు డ్రోన్
పాదయాత్రలో లోకేశ్‌కు బత్తలపల్లిలో ఘనస్వాగతం లభించింది. అదే సమయంలో లోకేశ్‌పై పోలీసులు డ్రోన్ ఎగుర వేశారు. దీనిని గమనించిన ఆయన.. ‘అయ్యా జగన్! మీరు నన్ను చూడాలనుకుంటే యూట్యూబ్ లైవ్ లింక్ పంపిస్తా’ అంటూ డ్రోన్ ఎగురుతున్న వీడియోను విడుదల చేశారు. డ్రోన్ కనిపించేలా సెల్ఫీ దిగారు.
Updated Date - 2023-04-03T01:57:56+05:30 IST