ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool District: మెతుకు లేని బతుకు

ABN, First Publish Date - 2023-01-23T02:12:44+05:30

రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. దశాబ్దాలుగా వ్యవసాయమే జీవనాధారం. కష్టపడి పనిచేయడం తప్ప మరో వృత్తి తెలియదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లాలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ

రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. దశాబ్దాలుగా వ్యవసాయమే జీవనాధారం. కష్టపడి పనిచేయడం తప్ప మరో వృత్తి తెలియదు. భారీ వర్షాలు, కల్తీ విత్తనాల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతినడంతో అన్నదాతలు అప్పులపాలయ్యారు. స్థానికంగా పనులు లేక బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. కర్నూలు జిల్లాలో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. చదువుకునే చిన్నారులు, వృద్ధులే ఉంటున్నారు. ఎవరిని కదిలించినా కష్టాలు, కన్నీటి వ్యథలు ఏ‘కరువు’ పెడుతున్నారు.

దుర్భరంగా మారిన అన్నదాతల జీవనం

భారీ వర్షాలు, కల్తీ విత్తనాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతినడంతో అప్పులపాలు

స్థానికంగా ఉపాధి లేక వలస బాట

కూలి పనులకు గుంటూరు, బెంగళూరుకు

నిర్మానుష్యంగా మారుతున్న గ్రామాలు

అక్కడక్కడా కొందరు చిన్నారులు, వృద్ధులు

నంద్యాల జిల్లాలోనూ కొన్నిచోట్ల వలసలు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

ఏ పల్లెకు వెళ్లినా తాళాలు వేసిన ఇళ్లు కనిపిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే బోసిపోయి ఉంటున్నాయి. అక్కడక్కడా కొందరు చిన్నారులు, వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. భారీ వర్షాలు, నాసిరకం విత్తనాలు, తెగుళ్లు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. కర్నూలు జిల్లాలో ప్రధానమైన పత్తి పంట ఈ ఏడాది దాదాపుగా దెబ్బతింది. మిర్చి పంట కూడా చేతికి రాలేదు. దీంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. సాగు పెట్టుబడికి చేసిన అప్పులే మిగిలాయి. దీనికితోడు ఊళ్లలో పనుల్లేక రైతన్నల బతుకు భారమైంది. ఉపాధి హామీ పథకం ఆదుకోలేదు. మట్టిని నమ్ముకున్న రైతులు.. ఆ రైతులను నమ్ముకున్న వ్యవసాయ కూలీలు మూటాముల్లె సర్దుకుని, పిల్లాజెల్లాతో గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వలస పోతున్నారు. ప్రతి రోజూ వలస దృశ్యాలు కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోనూ కొన్ని చోట్ల వలసలు వెళ్తున్నారు.

నట్టేట ముంచిన పత్తి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.65 లక్షల హెక్టార్లు కాగా 2022-23 ఖరీ్‌ఫలో 2,89,157 హెక్టార్లలో సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరాకు సగటున రూ.45 వేలు ప్రకారం రూ.3,253 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు కనిష్ఠంగా 8 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ఆశిస్తే ఒకట్రెండు క్వింటాళ్లు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం విత్తనాలు నట్టేట ముంచాయని రైతులు వాపోయారు. గుంటూరుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం ఉమ్మడి జిల్లాలో పత్తి పంటను పరిశీలించింది. ఎకరాకు క్వింటా కూడా దిగుబడిరాలేదని, పత్తి పంట దెబ్బతినడానికి అధిక వర్షాలు, తెగుళ్లు, నాసిరకం విత్తనాలు కారణమని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. కోసిగి మండలం అర్లబండ గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో 3-10వ తరగతుల వరకు 384 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులతో కలసి చాలా మంది విద్యార్థులు కూడా వలస వెళ్లారు. దీంతో శుక్రవారం 187 మంది విద్యార్థులే హాజరయ్యారు. 3వ తరగతిలో 65 మంది ఉండగా 36 మంది, 4వ తరగతిలో 78 మందికి 36 మంది, 5వ తరగతిలో 51 మందికి 19 మంది, 6వ తరగతిలో 50 మందికి 18 మంది, 7వ తరగతిలో 47 మందికి 18 మంది విద్యార్థులే హాజరయ్యారు. 48.61 శాతమే హాజరయ్యారు. సగానికి పైగా ఊరు వలస వెళ్లిందని, తల్లిదండ్రులతో పాటు విద్యార్థులూ వెళ్లడంతో హాజరు శాతం గణనీయంగా తగ్గిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలోనే వెనుకబడిన కోసిగి మండలంలో చిన్నారుల భవిషత్తును వలస అందకారంలోకి నెట్టేస్తుంది. కర్నూలు జిల్లాలో కరువు ప్రభావిత పశ్చిమ పల్లెల్లో ముప్పాతిక శాతం ఇదే పరిస్థితి ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

వలస బాటలో గ్రామాలు

కర్నూలు జిల్లా కోసిగి మండలం డి.బెళగల్‌ గ్రామంలో వెయ్యి గడపలు ఉన్నాయి. 75 శాతం రైతులు పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.45-50 వేలు ఖర్చు చేశారు. పంట దెబ్బతినడంతో ఎకరాకు క్వింటా కూడా దిగుబడి రాలేదు. 450కు పైగా కుటుంబాలు గుంటూరు జిల్లాలో మిరప కోతకు, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో భవన నిర్మాణ పనులకు వలస వెళ్లాయి.

కోసిగి మండలం అర్లబండ గ్రామంలో 550 కుటుంబాలు ఉంటే 350కి పైగా కుటుంబాలు సుగ్గికి (వలస) వెళ్లారని గ్రామస్థులు చెప్పారు.

మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో రెండు వేల గడపలు ఉన్నాయి. ఈ పల్లెలోనూ పత్తి, మిరప పంటలు రైతులను నిలువునా ముంచేశాయి. ఇప్పటికే 25 వాహనాల్లో (టెంపోలు) గుంటూరు జిల్లాలో మిరప కోత పనులకు వెళ్లారు. మరో వంద కుటుంబాలు రైలు బండెక్కి తిరుపతిలో భవన నిర్మాణ పనులకు వెళ్లాయి. మరో 250 కుటుంబాలు వలసకు సిద్ధమవుతున్నాయి.

పెద్దకడుబూరు మండలం కంబలదిన్నె గ్రామంలో 1200 పైగా కుటుంబాలు ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులు కూడా గుంటూరు జిల్లాలో మిరప పంట కోతకు, తెలంగాణలో పత్తి పంట తీసే పనులకు వలస వెళ్లారు. సంక్రాంతి పండుగ మరుసటి రోజే 14 వాహనాల్లో వలస వెళ్లారు. ఫిబ్రవరి ఒకటిన గ్రామంలో కొత్తగా నిర్మించిన బ్రహ్మయ్యస్వామి ఆలయం, ధ్వజస్తంభం ఆవిష్కరణ తరువాత ఊరంతా ఖాళీ అవుతుందని గ్రామస్థులు వివిరించారు. ఇన్ని కుటుంబాలు ఎన్నడూ వలస వెళ్లలేదని ఆ గ్రామానికి చెందిన సూరన్న వాపోయారు.

ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఇప్పటికే వేల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. ఏ పల్లెకు వెళ్లినా తాళం వేసిన ఇళ్లు, అరుగులపై వృద్ధులే కనిపిస్తున్నారు.

గోనెగండ్ల మండలంలో గత వారం రోజులుగా ప్రతి గ్రామం నుంచి వందలాది మంది వలసబాట పడుతున్నారు. గోనెగండ్ల, అలువాల, చిన్నమరివీడు, పెద్దనేలటూరు, కులుమాల, బైలుప్పల, అగ్రహారం, గంజహళ్లి తదితర గ్రామాల నుంచి వలస వెళ్తున్నారు. హెచ్‌.కైరవాడి ఎస్సీ కాలనీ నుంచి ఒకే రోజు 400 మంది గుంటూరు, రాజంపేటకు వెళ్లారు.

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని చెలిమిళ్ళ, మిట్టకందాల, రుద్రవరం, పాములపాడు తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మిరప పంటను కోసేందుకు వెళ్లారు.

అమ్మానాన్న గుర్తొస్తే ఏడుపొస్తుంది

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు సంగీత. కర్నూలు జిల్లా కోసిగి మండలం అర్లబండ గ్రామం. జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. వారి ఆలనాపాలనా సంగీతే చూస్తోంది. వారం రోజుల క్రితం వారి అమ్మానాన్నలు రిబాక, బజారి బెంగళూరుకు వలస వెళ్లారు. పిల్లలు చదువుకుంటున్నారని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లారు. అమ్మానాన్న ఇక్కడే ఉంటే బాగుండేదంటూ సంగీత కన్నీటి పర్యంతమైంది. అమ్మానాన్న ఎప్పుడొస్తారని తమ్ముడు అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదని వాపోయింది.

పరస్థలంలో ఎలా ఉన్నారో..!

రెండెకరాల్లో పత్తి పంట సాగు చేస్తే బస్తా కూడా రాలేదు. విత్తనాలు, ఎరువులు, మందులకు లక్ష రూపాయలు అప్పైంది. పంట పూర్తిగా దెబ్బతింది. ఊళ్లో పనుల్లేవు. బడికిపోయే పిల్లల్ని వెంటబెట్టుకుని నా నలుగురు కొడుకులు, కోడళ్లు కూలి పనులకు గుంటూరు వెళ్లారు. పరస్థలంలో ఎలా ఉన్నారో..! గుర్తుకొచ్చినప్పుడల్లా బాధేస్తుంది. ఊళ్లో ఎవరైనా పెడితే తింటా.. లేదంటే నీళ్లుతాగి పడుకుంటా.

- మాల లక్ష్మమ్మ, డి.బెళగల్‌,

కోసిగి మండలం, కర్నూలు జిల్లా

3 లక్షలు అప్పు చేశాం

మాకు ఎకరం పొలం ఉంది. మరో 3ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాం. రూ.3 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. కల్తీ విత్తనాల వల్ల పంట పాడైంది. కిలో పత్తి కూడా చేతికి రాలేదు. అప్పు తీర్చే మార్గం లేదు. మిరప. పత్తి పంటలు సర్వనాశనం చేశాయి. భార్య తాయమ్మ, కొడుకులు, కోడళ్లు, పిల్లలు వలస వెళ్లారు. మిరప పంట కోతకు గుంటూరు వెళ్లారు. ప్రమాదంలో నా కాలు విరిగిపోవడంతో ఇంటి దగ్గరే ఉన్నాను.

- బోయ మూతలవారి నాగన్న, కంబలదిన్నె గ్రామం, పెద్దకడుబూరు మండలం, కర్నూలు జిల్లా

ఎవరికీ ఈ కష్టాలు రావద్దు

మాకు రెండెకరాల పొలం ఉంది. పత్తి సాగు చేస్తే బస్తా కూడా ఇంటికి రాలేదు. విత్తనాలు నాణ్యమైనవి కాకపోవడంతో పంటంతా పాడైపోయింది. సాగుకు చేసిన అప్పులు తీర్చేందుకు కొడుకు, కోడళ్లు పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం కర్ణాటకకు వెళ్లారు. పిల్లలు ఒకచోట, మేమొకచోట బతుకుతున్నాం. ఫోన్లు లేకపోతే చచ్చినా తెలిసేది కాదేమో. పిల్లలు గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుందయ్యా. పగోడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు.

- ఖాసింబీ, డి.బెళగల్‌, కోసిగి మండలం, కర్నూలు జిల్లా

నలుగురు అన్నదమ్ములూ వలస

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కంబలదిన్నె గ్రామంలో తాళం వేసిన ఈ మేడ ఇల్లు కురవ బాలనాగన్నది. నలుగురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం. వీరికి ఐదు ఎకరాల పొలం ఉంది. పత్తి, మిరప సాగుకు రూ.3 లక్షలు ఖర్చు చేశారు. పంట పూర్తిగా దెబ్బతినడంతో భార్యాపిల్లలతో సహా నలుగురు అన్నదమ్ములూ ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వలస వెళ్లారు.

- బాలనాగన్న ఇల్లు, కంబలదిన్నె గ్రామం,

పెద్దకడుబూరు మండలం, కర్నూలు జిల్లా

పంటంతా దెబ్బతింది

మాకు ఎకరం పొలం ఉంది. వర్షాలు ఎక్కువగా పడి పంటంతా పాడైపోయింది. ఊరిలో చేయడానికి పనుల్లేవు. నా ఇద్దరు మనవళ్లు వారి భార్యాపిల్లలతో కలసి తిరుపతిలో భవన నిర్మాణ పనులకు వెళ్లారు. ఇలాంటి కష్టాలు మేమెన్నడూ చూడలేదు.

- ముగతి లక్ష్మమ్మ, కంబలదిన్నె, పెద్దకడుబూరు మండలం, కర్నూలు జిల్లా

Updated Date - 2023-01-23T09:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising