ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎవరి దారి వారిదే

ABN, First Publish Date - 2023-06-26T00:03:11+05:30

క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటికీ డిగ్రీ కళాశాలలు మాత్రం సొంత అజెండాతోనే నడుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టాలెక్కని క్లస్టర్‌ యూనివర్సిటీ పాలన

సొంత అజెండాతో ప్రిన్సిపాళ్ల ఇష్టారాజ్యం..

చర్యలకు సిద్ధమైనా ఉన్నత విద్యాశాఖ అధికారులు

తరగతుల పని తీరుపై పర్యవేక్షణలో ఉపకులపతి

కర్నూలు(అర్బన్‌) జూన్‌ 25

క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటికీ డిగ్రీ కళాశాలలు మాత్రం సొంత అజెండాతోనే నడుస్తున్నాయి. ప్రిన్సిపాళ్లు ఎవరిదారిన వాళ్లు కాలేజీలను నడుపుతున్నారు. ఈ యూరివర్సిటీలో భాగమైన కాలేజీల పాలనా విషయాల్లో సమన్వయం లేదు. క్లస్టర్‌ పని విధానం పట్టాలు ఎక్కలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉపకులపతి, రిజిస్ర్టార్‌, ప్రిన్సిపాళ్లలో ఎవరూ మరొకరి మాట వినడం లేదు. ఏ నిబంధనలు అమలులోకి రావడం లేదు. పైగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అధ్యాపకులు గ్రూపులుగా విడిపోయారు. ప్రిన్సిపాళ్ల మీద విద్యార్థుల ఫిర్యాదులు పెరిగిపోయాయి. వివాదాలు ఇన్ని జరుగుతున్నాయిగాని.. క్లస్టర్‌ యూనివర్సిటీకి ఒక సొంత గది లేదు.. ఒక టేబుల్‌, కుర్చీ కూడా లేవు. ఈ రెండేళ్లుగా క్లస్టర్‌ యూనివర్సిటీ చుట్టూ వివాదాలకు మాత్రం అంతులేదు.

ఏపీ రెసిడెన్షియల్‌ కింద సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాల, అటానమస్‌ కింద కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ఉన్నత విద్యాశాఖ పరిధిలో కొనసాగిన ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ పెత్తనమే కొనసాగిస్తూ వచ్చారు. క్లస్టర్‌ యూనివర్సిటీలో విలీనమైనప్పటికీ నిబంధనలు పాటించకపోవడంపై సంజాయిషీ కోరుతూ జారీ చేసిన మెమోలను సైతం బుట్టదాఖలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధ్యాపకులు సైతం వర్గాలుగా విడిపోయారు. ప్రిన్సిపాళ్ల వేధింపులపై వర్సిటీ అధికారుల వద్ద ఫిర్యాదులతో క్యూకట్టారు. ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులను హైకోర్టులో దాఖలు చేయడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఓ ప్రిన్సిపాల్‌ను నెల్లూరు జిల్లాకు బదిలీ చేసింది. మరో ప్రిన్సిపాల్‌పై విచారణకు ఆదేశించింది.

వర్శిటీ తీరు ఇలా..

క్లస్టర్‌ యూనివర్సిటీ తరగతులు 2022 ఆగస్టు విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీకి అనుబంధంగా బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాల, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలను క్లస్టర్‌ కిందకు చేర్చారు. దశాబ్ద కాలంగా స్వయంప్రతిపత్తితో నడిచిన ఈ కళాశాలల ప్రిన్సిపాళ్లు సొంత అజెండాతో కొనసాగారు. ఈ క్రమంలో కస్టర్‌ యూనివర్సిటీ ఉపకులపతికి వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులతో అంతర్గత రాజకీయాలకు తెరలేపారు. ఉపకులపతి, రిజిస్ట్రార్‌ వేధింపులకు గురి చేస్తున్నారంటూ డిసెంబరులో ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విద్యాశాఖ కమిషనర్‌, ఉపకులపతిపై హైకోర్టులో కేసు వేయడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించారు. కేవీఆర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వ్యవహారం తీరు వివాదాస్పదంగా మారడంతో కళాశాలల్లో తరగతుల పని తీరు గాడి తప్పిందనే విమర్శలున్నాయి. అధ్యాపకులు తరగతులను వదిలి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే విద్యార్ధుల ఫిర్యాదులపై సంజాయిషీ కోరినా స్పందన లేకుండా పోయింది. స్వయంగా ఉపకులపతి కేవీఆర్‌ కళాశాలలో పర్యవేక్షణకు వెళ్లినప్పుడు ఖాళీ తరగతులను చూసి అధ్యాపకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవీఆర్‌ ప్రిన్సిపాల్‌ సొంత అజెండా..

కేవీఆర్‌ క్లస్టర్‌ కిందకు వచ్చినా అటానమస్‌ పేరుతో ఆ కాలేజీలో సొంత అజెండానే నడుస్తోంది. 2021-22 విద్యా సంవత్సరంలో 58 మంది విద్యార్థినులు పీజీలో చేరినట్లు క్లస్టర్‌ వర్శిటీకి వివరాలు పంపారు. ఒకటో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు విడుదలైనప్పుడు విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ అఽధికారులు అనుమానించారు. దీనిపై ఆర్జేడీ స్థాయిలో విచారణ చేపట్టారు. అనధికారికంగా 36 మందికి అడ్మిషన్లు కల్పించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి నివేదిక అందజేసింది. ఈ అంశంపై అప్పట్లో స్పందించిన ప్రిన్సిపాల్‌.. కొందరు అధ్యాపకులు తనకు తెలియకుండా ప్రవేశాలు కల్పించి ఉంటారని, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని కోరినట్లు గతంలో ప్రచారం జరిగింది. మరో వైపు ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు దిశా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే అనారోగ్యంతో ఇంటి వద్ద ఉన్నా బలవంతంగా వసతి గృహం ఫీజులు వసూలు చేస్తున్నారని ఉపకులపతికి విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి.

ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో..

ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఉపకులపతిని లెక్కచేయని పరిస్థితి ఉండేది. పాలనాపరమైన పలు అంశాలలో ఆధిపత్యం కొనసాగించేలా వ్యవహరించేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఫైళ్లలో ఉపకులపతి సంతకం చేయాల్సి ఉండగా ప్రిన్సిపాల్‌ చేయడంతో విద్యాశాఖ అధికారులు ఆమెను అనేక సార్లు మందలించినట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్‌ను నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీ చేశారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ జిల్లా అర్‌జేడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నూలు నుంచి నేటి వరకు ప్రిన్సిపాల్‌ రిలీవ్‌ కాకపోవడంతో మరో అధ్యాపకుడికి ప్రిన్సిపాల్‌ బాధ్యతలు అప్పగించారు. ఉపకులపతి సాయిగోపాల్‌, రిజిస్ట్రార్‌ శ్రీనివాసులు ఉద్దేశపూర్వకంగా తనను వేధిస్తున్నాంటూ ప్రిన్సిపాల్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చేసిన ఫిర్యాదుపై ఆగ్రహించిన ఉన్నత విద్యామండలి ఆమెను బదిలీ చేసింది. తనను ఎలా బదిలీ చేస్తారో చెప్పాలంటూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విద్యాశాఖ కమిషనర్‌, క్లస్టర్‌ వర్సిటీ ఉపకులపతిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆగ్రహంతో ఉన్నారు.

2010లోనే క్లస్టర్‌ యూనివర్సిటీ దిశగా...

క్లస్టర్‌ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపాదనలు 2010లోనే సిద్ధమయ్యాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా 2016లో నిధులు కేటాయించింది. 2018లో కేవీఆర్‌, సిల్వర్‌ జూబ్లీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల్లో భవన నిర్మాణాల కోసం ‘‘రూసా’’ గ్రాంట్స్‌ కింద రూ. 55 కోట్లు కేటాయించింది. వీటితో ఆ కళాశాలల్లో బోధనకు అవసరమైన భవనాల నిర్మాణ పనులు చేపట్టారు. దేశంలో 3వ క్లస్టర్‌ యూనివర్సిటీని కర్నూలులో 2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020-21లో విద్యా సంవత్సరంలో సిల్వర్‌జూబ్లీ కళాశాలలోనే తరగతులు ప్రారంభమయ్యాయి. పర్యవేక్షణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం జగన్నాథగట్టుపై 50 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ, రూ.88 కోట్ల నిధులను మంజూరు చేసింది. గత జనవరి 10న క్లస్టర్‌ యూనివర్సిటీ సొంత భవనాల నిర్మాణానికి రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు.

నియామకాలు గాలిలోనే..

యూనివర్సిటీ అవిర్భవించి రెండేళ్లు పూర్తయింది. ఇంత వరకు సిబ్బంది లేరు. సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో తాత్కాలికంగా క్లస్టర్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సొంత భవనం, సిబ్బంది నియామకాలు లేవు. తాత్కాలిక యూనివర్సిటీలో ఉపకులపతి, రిజిస్ట్రార్‌ మాత్రమే కార్యాలయానికి పరిమితమయ్యారు. మూడు కళాశాలల నుంచి కొంత మంది అధ్యాపకులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించారు. ఈ క్రమంలో క్లస్టర్‌ యూనివర్సిటీకి 92 మంది నాన్‌ టీచింగ్‌, 42 మంది ఫ్యాకల్టీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం వద్ద ఈ దస్త్రం మగ్గుతోంది..

గాడిలో పెడతాం

డిగ్రీ కళాశాలలను గాడిలో పెడతాం. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించాం. తరగతుల్లో అధ్యాపకులు లేకపోతే మందలించి మరోసారి పని వేళల్లో బయట ఉంటే చర్యలు తప్పని హెచ్చరించాం. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడుతున్నాం.

- ప్రొఫెసర్‌ డీవీఆర్‌ సాయి గోపాల్‌, ఉపకులపతి, క్లస్టర్‌ యూనివర్సిటీ, కర్నూలు

ప్రిన్సిపాల్‌ మెడికల్‌ లీవ్‌లో వెళ్లారు

బదిలీ అయిన ప్రిన్సిపాల్‌ మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. బదిలీపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఇటివలే అధికారులు ప్రిన్సిపాల్‌ను విచారించారు. క్లస్టర్‌ యూనివర్సిటీ అఽధికారుల వద్ద రిపోర్టు చేసుకోకపోవడమే వివాదంగా మారినట్లు ఉంది. ఫిజిక్స్‌ లెక్చరర్‌గా కొనసాగుతున్న నాకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.

- ప్రొఫెసర్‌ హేమంత్‌, ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాల, కర్నూలు

హాస్టల్‌లో లేకున్నా ఫీజులు చెల్లించాలా?

హాస్టల్‌లో లేకున్నా, మెస్‌లో అన్నం తినకున్నా ఫీజులు వసూలు చేస్తున్నారు. హాస్టల్‌లో హాజరయినట్లు రికార్డులో నమోదు చేస్తారు. ఇదేం పద్ధతి. విద్యార్థినులకు మంచి ఆహారం కూడా అందించడం లేదు. పెట్టిందే తినాలని తెగేసి చెబుతున్నారు. కళాశాలలో ఓ డ్రైవర్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి.

- అబ్దుల్లా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సెక్రటరీ

Updated Date - 2023-06-26T00:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising