ఇదెక్కడి వ్యాపారం?
ABN, First Publish Date - 2023-09-04T23:53:10+05:30
ఇదెక్కడి వ్యాపారం?
కాంప్లెక్స్ కొంటేనే యూరియా!
కృత్రిమ కొరత సృష్టిస్తున్న కంపెనీలు, డీలర్లు
చోద్యం చూస్తున్న అధికారులు
బస్తాపై రూ.25-30 అదనంగా వసూలు
కీలక సమయంలో కొరత
ఆందోళనలో అన్నదాతలు
ఆదోని మండలం బస్సాపురం గ్రామానికి చెందిన రైతు నరసింహులు తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) కింద మూడు ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. పైరుకు యూరియా వేద్దామని ఆదోని పట్టణంలోని ఓ డీలర్ వద్దకు వెళ్లాడు. ఐదు బస్తాలు కావాలని అడిగాడు. అయితే ఐదు బస్తాలు కాంప్లెక్స్ కొంటేనే యూరియా ఇస్తామన్నారు. ఆదోని పట్టణంలోనే కాదు జిల్లా అంతటా ఇదే పరిస్థితి. ఇదెక్కడి న్యాయమని రైతులు ప్రశ్నిస్తుండగా కాంప్లెక్స్ అమ్మితేనే యూరియా ఇస్తామని కంపెనీలే అంటున్నాయని డీలర్లు చెబుతున్నారు. మార్కెట్‌లో ముందస్తుగా కృత్రిమ కొరత సృష్టించి, ఆ తర్వాత బస్తాకు రూ.25-30కు పైగా వసులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్బీకేల్లో సరిపడా యూరియా ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కాంప్లెక్స్ దొరకడం లేదు. మెజార్టీ ఆర్బీకేల్లో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ప్రైవేటు డీలర్లు, ఆర్బీకేల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.
కర్నూలు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఖరీఫ్ 4,21,560 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేస్తే వర్షాభావ పరిస్థితుల వల్ల 3,02,665 హెక్టార్లలో సాగు చేశారు. 71.8 శాతం సాగు చేశారని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా పత్తి 1,82,231 హెక్టార్లు, వేరుశనగ 38,979 హెక్టార్లు, మిరప 26,022 హెక్టార్లు, ఉల్లి 10,038 హెక్టార్లు సాగు చేశారు. ఎల్లెల్సీ, తుంగభద్ర నది నుంచి ఎత్తిపోతల ద్వారా 6,604 హెక్టార్లలో వరి పంటలు వేశారు. ఆగస్టులో జిల్లాలో 80 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబరులో వర్షాలు పడితే కొంతైనా గట్టెక్కుతామని, ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో పత్తి సాగు చేసిన రైతులు ఆశిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పైరకు అవసరమైన నత్రజని అందించే యూరియా వాడకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు అంటున్నారు. బోరుబావులు, ఎల్లెల్సీ, తుంగభద్ర నది ఎత్తిపోతలు వంటి నీటి వనరుల కింద సాగు చేసిన వరి, పత్తి, మిరప, ఉల్లి ఎదుగుదలకు యూరియా అవసరమని రైతులు పేర్కొంటున్నారు.
ఆర్బీకేల్లో నో స్టాక్!
జిల్లాలో 466 ఆర్బీకేల్లో 3,487.185 మెట్రిక్ టన్నులు (69,740 బస్తాలు) యూరియా స్టాక్ ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ఒక్కో ఆర్బీకేలో సగటున 7.5 మెట్రిక్ టన్నులు ఉంది. ఎక్కడ కూడా కొరత లేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అయితే.. మెజార్టీ ఆర్బీకేల్లో యూరియా లేదని స్థానిక ఆర్బీకే నిర్వాహకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. కౌతాళం మండలంలో ఆర్బీకేల్లో యూరియా ప్రైవేటు డీలర్లకు తరలివెళ్లిందనే ఆరోపణులు ఉన్నాయి. అక్కడి ఆర్బీకేల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని రైతులు సంఘాల నాయకులు అంటున్నారు.
యూరియాకు కాంప్టెక్స్ లింక్!
ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ ప్రాంతాల్లో దాదాపు 700 మంది వ్యవసాయ శాఖ అనుమతి పొందిన ప్రైవేటు ఎరువులు విక్రయ డీలర్లు ఉన్నారు. తాజాగా డీలర్ల వద్ద 10,420 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. అయితే.. వివిధ కంపెనీలు కాంప్టెక్స్ అమ్మితేనే యూరియా ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. కాంప్లెక్స్ తీసుకోకపోతే డీలర్లకు యూరియా సరఫరా చేయడం లేదు. చేసేది లేక కంపెనీలు చెప్పినట్లు ఒక బస్తా యూరియాకు ఒక బస్తా 20:20:0, 10:26:26 వంటి కాంప్లెక్స్ ఎరువు తీసుకుంటనే ఇస్తున్నామని ఓ డీలరు అన్నాడు. 45 కిలోల యూరియా బస్తా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266. అయితే.. యూరియా కోసం రూ.1,350-1,470 పెట్టి కాంప్లెక్స్ తీసుకోవాల్సి వస్తున్నదని అన్నదాతల ఆవేదన. లింక్ లేకుండా యూరియా ఇవ్వాలంటే బస్తాపై రూ.25-30లకు పైగా అదనంగా వసులు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అవసరం లేకపోయినా యూరియా కోసం కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నామని ఎమ్మిగనూరు మండలానికి చెందిన ఓ రైతులు వాపోయారు.
ఆర్బీకేల్లో యూరియా లేదంటున్నారు
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. 4 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో బ్యాడిగి మిరప, 2 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఈ సమయంలో పైరుకు యూరియా తప్పనిసరి. ప్రైవేటు డీలర్ల వద్దకు వెళితే కాంప్లెక్స్ తీసుకుంటేనే యూరియా ఇస్తామంటున్నారు. ఆర్బీకేలకు వెళితే యూరియా అయిపోయిందంటున్నారు. విధి లేక ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా కోసం అప్పు చేసి కాంప్లెక్స్ ఎరువు కొంటున్నారు.
- కురవ గాదిలింగ, హొళగుంద
Updated Date - 2023-09-04T23:53:16+05:30 IST