ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సారీ.. సారొక్కరే

ABN, First Publish Date - 2023-08-02T23:56:43+05:30

సారీ.. సారొక్కరే

ఏకోపాధ్యాయులతో కుంటుబడుతున్న విద్య

పేద పిల్లలకు శాపంగా పాఠశాలల విలీనం

నిత్యం సందడిగా ఉండే తరగతి గదులు మూగబోయాయి. పిల్లలు, ఉపాధ్యాయులతో కళకళలాడే పాఠశాలలు మూతబడ్డాయి. ఉన్న స్కూళ్లను కూడా ఒక ఉపాధ్యాయుడితోనే నడిపిస్తున్నారు. దీని వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు స్కూళ్లను విలీనం చేయడంపై యావత్‌ విద్యార్థి, ఉపాధ్యాయ లోకం నిరసన గళమెత్తుతున్నా ప్రభుత్వాలకు మాత్రం పట్టడం లేదు.

కోడుమూరు(రూరల్‌), ఆగస్టు 2: మొన్నటి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాలలు కళకళలాడేవి. అయితే నేడు చాలా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు మరో చోటకు మారిపోయారు. పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు తగ్గిపోయారు. కొన్ని పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను నిర్వహిస్తుండగా, మరికొన్నింటిలో 1, 2 తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. గతేడాది జీవో 117 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలకు విలీనం చేశారు. దీంతో పాఠశాలలు మూగబోయాయి. మునుపటి మాదిరి పిల్లల సందడి కానరావడం లేదు. మిగిలిపోయిన విద్యార్థులకు తరగతి గదులు వినియోగించుకోగా మరికొన్ని గదులు మూతపడ్డాయి. మూతబడిన గదులు తాళాలు తెరుచుకునే భాగ్యం నోచుకోలేకపోతున్నాయి. ఇక ఈ ఏడాది జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో పలువురు ఉపాధ్యాయులు సాధారణ బదిలీ, పదోన్నతిపై వెళ్లారు. ప్రక్రియ అనంతరం పలు పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే మిగిలిపోయారు. దీంతో విద్యాభ్యాసం, పరీక్షలు, యాప్‌ల నమోదు, నాడు- నేడు పనుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సమావేశాలు అన్నింటిలోనూ ఏకపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మండలంలో కొన్ని పాఠశాలల స్థితిగతులపై ఆంధ్రజ్యోతి పరిశీలన చేసింది. అందులో వెలుగు చూసిన విషయాలు ఇవి..

ఎర్రదొడ్డి ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 105 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తుండగా ఈ ఏడాది ఇద్దరు బదిలీపై వెళ్లారు. విద్యార్థుల సంఖ్య మేరకు ముగ్గురిని కేటాయించాల్సి ఉంది. అయితే ఇటీవలి బదిలీల్లో ఖాళీ స్థానాలు కూడా భర్తీ కాలేదు. గ్రామస్థుల వినతి మేరకు ఒక ఉపాధ్యా యుడిని డిప్యుటేషన్‌పై పంపుతున్నట్లు ఎంఈవో అనంతలక్ష్మి తెలిపారు. అయితే ఇక్కడ మరో ఇద్దరి అవసరం ఉన్నా భర్తీ ప్రశ్నార్థకమే.

రామాపురం ప్రాథమిక పాఠశాల పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ సుమారు మూడేళ్లపాటు గుడిలో బడి నడిచింది. నిరుడు అద్దె ఇంట్లో ఏర్పాటు చేయగా యజమాని చేరిపోవడంతో ప్రస్తుతం షెడ్డులోకి మారింది. ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి మొత్తం 17 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు బదిలీ కాగా తిరిగి ఎవరూ చేరలేదు. పాఠశాలకు సొంత గదులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.

లద్దగిరి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయిని పని చేస్తున్నారు. గ్రామంలో ఉర్దూ ఉన్నత పాఠశాల లేకపోవడంతో కోడుమూరుకు వెళ్లే అవస్థలు పడలేక ఉర్దూ మీడియంలో 5వ తరగతి దాకా చదువుకుని, 6వ తరగతికి గ్రామంలోనే ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీషు మీడియాలలో చేరుతున్నారు. ఈ కారణంగా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

కోడుమూరు డిపెప్‌ ప్రాథమిక పాఠశాలకు 8 గదులు ఉన్నాయి. 253 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. విలీనం దెబ్బతో 1, 2 తరగతులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం 28 మంది విద్యార్థులకు ఒకరు బదిలీ కాగా ఒక్కరే మిగిలారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కళకళగా ఉన్న పాఠశాల తరగతుల విలీనం తర్వాత పలు గదులు మూతపడి బోసిపోయింది. ఒక గదిలో అంగన్‌వాడీ కేంద్రం నడుస్తోంది.

లద్దగిరి స్పెషల్‌ ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ 27 మంది విద్యార్థులు చదువుకుంటు న్నారు. ఒకరు ప్రసూతి సెలవులో ఉన్నందున 1, 2 తరగతులకు ఒక ఉపాధ్యాయిని పని చేస్తున్నారు. ఇక్కడ నాడు-నేడు కింద పనులు చేపట్టారు.

ఉపాధ్యాయులను కేటాయించాలి

మా గ్రామంలో 5వ తరగతి వరకు ఉంది. 105 మంది విద్యార్థులు చేరారు. గతంలో పని చేసిన ఇద్దరు టీచర్లు బదిలీ అయ్యారు. దీంతో ఒక్క సారు మాత్రమే మిగిలారు. ఒక గదిలో పాఠాలు చెబుతుంటే మరో గదిలో పిల్లలకు బోధన ఎలా?. 5 తరగతులకు ఒక్క సారు ఎలా చదువు చెప్పగలరు. అధికారులు ఇంకొకరిని కేటాయిస్తామంటున్నారు. పిల్లల సంఖ్యకు సరిపోయేలా ఉపాధ్యాయులను నియమించాలి.

-అయ్యన్న, ఎర్రదొడ్డి

పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి

ప్రాథమిక పాఠశాలలకు జీవో 117 గొడ్డలిపెట్టు వంటిది. పాలకులు పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు. ఇళ్లకు దూరంగా పాఠశాలలు ఉండడంతో చిన్న పిల్లలు మధ్యలోనే బడి మానుకుంటున్నారు. ఈ 2023-24 విద్యా సంవత్సరంలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు మళ్లారు. ప్రతి గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉండాలి. 3,4,5 తరగతుల విలీనం ఉపసంహరించుకోవాలి.

-తిమ్మన్న, ఎస్టీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Updated Date - 2023-08-02T23:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising