ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేషన్‌ మాఫియా

ABN, First Publish Date - 2023-10-14T00:02:24+05:30

పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టాయి. చౌక బియ్యం రుచి మరిగిన కొందరు అక్రమార్కులు అడ్డదారిలో రూ. కోట్లకు పడగలెత్తుతున్నారు.

పేదల బియ్యం... పెద్దలకు వరం

అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు

తెర వెనుక కీలక యువనేతలు

టన్నుల కొద్ది బియ్యం కర్ణాటకకు తరలింపు

ఆదోని, అక్టోబరు 13 : పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టాయి. చౌక బియ్యం రుచి మరిగిన కొందరు అక్రమార్కులు అడ్డదారిలో రూ. కోట్లకు పడగలెత్తుతున్నారు. ఎక్కడికక్కడ రేషన్‌ బియ్యాన్ని భారీ ఎత్తున సేకరించి నల్ల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. కట్టడి చేయాల్సిన కీలక శాఖ లోపాయికారి సహకారంతోనే ఈ వ్యవహారమంతా అడ్డూ అదుపు లేకుండా సాగుతోందనే విమర్శ ఉంది. ఆదోని డివిజన్‌ నుంచి నిత్యం టన్నుల కొద్ది బియ్యం అక్రమంగా కర్ణాటకకు తరలిపోతున్నాయి.

ఆదోని డివిజన్‌లోని పలు గ్రామాల నుంచి రేషన్‌ బియ్యం సేకరించి అక్రమంగా తరలిస్తున్నట్లు గత కొన్నేళ్లుగా అధికారులకు తెలుసు. ఇంటింటికీ ఎండీయూ వాహనాలతో నిత్యవసరాలు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడో ఒకచోట వాహనం నిలిపి సరుకులు అందిస్తూ తూకాల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 20 కేజీల బియ్యం తూకం వేసేటప్పుడు కేజీ నొక్కేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు రేషన్‌దారుల నుంచి బియ్యం కాస్త ఎక్కువ ధరకు కొని అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలా ఇస్తారు.. ఇలా తన్నుకు పోతారు..

ఆదోని పట్టణంలో శిరుగుప్ప టర్నింగ్‌లో, ఆస్పరి బైపాస్‌ సమీపంలో, ఏఎస్‌ఐ హాస్పిటల్‌ సమీపంలో రేషన్‌ బియ్యం అక్రమ నిలువ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని బస్తాలుగా మార్చి కర్ణాటకలోని మిల్లులకు తరలించి అక్కడ రిసైకిలింగ్‌ చేసి, దొడ్డిదారిన ఇతర ప్రాంతాలకు, ఆదోనికి తీసుకొచ్చి మసూరి బియ్యం అని విక్రయిస్తున్నారు. కొద్దిమంది పెద్ద ఎత్తున ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు, రాజకీయ నాయకుల అండతో ఈ బియ్యం మాఫియా నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ బియ్యానికి రూ.39.35 భరిస్తుంటే, ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముఠా, కార్డుదారుల నుంచి కేజీకి రూ.10 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేస్తోంది.

అన్నీ అక్కడికే.....

రేషన్‌ బియ్యం ఎక్కడ స్వాధీనం చేసుకున్నా, కర్ణాటక రాష్ట్రానికి వెళ్తున్నాయని అధికారుల విచారణలో తేలుతోంది. బియ్యం అక్రమ రవాణను అడ్డుకోడానికి ఆంఽధ్ర, కర్ణాటక మధ్య ఉన్న చెక్‌పోస్టు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాజకీయం అడ్డువస్తోంది.

రెండు రోజుల క్రితం హొళగుంద చెక్‌పోస్టు దగ్గర అక్రమంగా తరలిపోతున్న బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారుల తనిఖీలలో పట్టుకున్నారు. ఈ బియ్యం, మిని లారీ మంత్రి అనుచరులవని తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.

బుధవారం రాత్రి హొళగుంద చెక్‌పోస్టు దగ్గర తనిఖీలలో మరో రేషన్‌ బియ్యం లారీ దొరికినట్లు సమాచారం. దానివెంట ద్విచక్ర వాహనాల ద్వారా కొందరు విలేకరులు వెంబడించడంతో గమనించిన అధికారులు ఏమి చేయలేక 73 క్వింటాలు పట్టుబడినట్లు చూపించి చేతులు దులుపుకున్నారు. ఆదోని పట్టణానికి చెందిన గొల్ల రాజశేఖర్‌, హొళగుంద రైస్‌ మిల్లు యజమాని కాశీ విశ్వనాథ్‌ గౌడ్‌, డ్రైవర్‌ శివపై కేసులు నమోదు చేశారు.

ప్రతిరోజూ దాదాపు 25 నుంచి 30 టన్నుల రేషన్‌ బియ్యాన్ని ఆదోని పట్టణం నుంచి శిరుగుప్ప వైపునకు మినీ లారీలలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

అక్రమంగా వచ్చిన సొమ్ముతో తార్‌ జీపు కొనుగోలు...

ఆదోని పట్టణంలోని అధికార పార్టీకి చెందిన చిన్న బాసుకు మిత్రుడిగా చెలామణి అవుతున్న ఓ యువ నాయకుడు ఇటీవల రేషన్‌ బియ్యం నుంచి అక్రమంగా సంపాదించిన మొత్తంలో రూ.15 లక్షలు విలువ చేసే జీపును కొనుగోలు చేసినట్లు పట్టణ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే అధికారులు కూడా వారి వైపు చూడరన్నది బహిరంగంగా మాట్లాడుకోవడం గమనర్హం.

ఇప్పటి వరకు రేషన్‌ బియ్యం

స్వాధీనం చేసుకున్నవి...

2018లో 11 క్వింటాళ్లు

2019లో 111 క్వింటాళ్లు

2020లో 530 క్వింటాళ్లు

2021లో 1114 క్వింటాళ్లు

2022లొ 1281 క్వింటాళ్లు

2023లో ఇప్పటి వరకు 566 క్వింటాళ్లు

పట్టుకున్నారు.

Updated Date - 2023-10-14T00:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising