మయూర వాహనంపై మల్లికార్జునుడు
ABN, First Publish Date - 2023-02-15T00:24:45+05:30
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూరవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వైభవంగా గ్రామోత్సవం
కాణిపాకం, టీటీడీ తరఫున పట్టువస్త్రాల సమర్పణ
నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున..
శ్రీశైలం, ఫిబ్రవరి 14: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూరవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో ముస్తాబైన మయూరవాహనంపై అధిష్టింపజేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించాక ఉత్సవ మూర్తులను ఆలయ రాజగోపురం నుంచి వెలుపలికి తీసుకొని వచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి క్షేత్రవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గంగాధర మండపం మీదుగా నంది మండపం వరకు తిరిగి అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం దాకా కొనసాగింది. మయూర వాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకున్నారు. గ్రామోత్సవంలో దేవస్థాన అధికారులు, ఆలయ అధికారులు, సిబ్బంది, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం రావణవాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం పర్యవేక్షకుడు కోదండపాణి వీరితో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి అధ్యక్షుడి సతీమణి వై.స్వర్ణలతారెడ్డి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.వీరబ్రహ్మం, వేదపండితులు మంగళవారం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతో వచ్చిన వీరికి ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్.లవన్న, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు సమర్పించారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున..
రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీశైల మల్లన్నకు బుధవారం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం ఆలయ రాజగోపురం వద్ద ప్రభుత్వ పట్టు వస్త్రాలకు అర్చకులు, వేదపండితులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు సమర్పిస్తారు.
Updated Date - 2023-02-15T00:24:49+05:30 IST