గంగమ్మ ఒడి చేరిన గణనాథుడు
ABN, First Publish Date - 2023-09-22T23:52:15+05:30
ఆదోని పురవీధుల్లో గణనాథుడి నినాదాలు మిన్నంటాయి. భక్తజనం ఆధ్యాత్మికతతో పరవశించారు.
ఆదోనిలో ఘనంగా వినాయక నిమజ్జనం
ఎల్లెల్సీ కెనాల్ వద్ద భారీగా భక్తులు
ఎస్పీ పర్యవేక్షణలో భారీ బందోబస్తు
ఆదోని/ఆదోని(అగ్రికల్చర్), సెప్టెంబరు 22: ఆదోని పురవీధుల్లో గణనాథుడి నినాదాలు మిన్నంటాయి. భక్తజనం ఆధ్యాత్మికతతో పరవశించారు. శుక్రవారం వినాయక నిమజ్జన మహోత్సవం కన్నుల పండువగా సాగింది. చిన్న, పెద్ద అన్న భేదం లేకుండా పార్వతీ పుత్రుడికి తుది వీడ్కోలు పలికారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మహోత్సవం సాగింది. విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన వినాయకుడికి వీహెచ్‌పీ కమిటీ, పట్టణ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిపారు. ముందుగా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఎస్పీ శివనారాయణస్వామి, జయమనోజ్ రెడ్డి, గుడిసె కృష్ణమ్మతోపాటు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బసవన్నగౌడ్, కునిగిరి నీలకంఠ, వీహెచ్‌పీ నాయకులు విట్టా రమేష్, శ్రీకాంత్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, ఎగ్గాటి ప్రతాప్ వినాయకుడికి పూజలు చేశారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు సందీప్ రెడ్డి రూ.1,10 లక్షలకు వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. హుండీ వేలంపాటలో శ్రీకాంత్ రెడ్డి రూ.40,116 వేలకు దక్కించుకున్నారు. అనంతరం వీహెచ్‌పీ, వినాయక ఉత్సవ కమిటీ నాయకులు కునిగిరి నాగరాజు, శ్రీనివాసాచారి, నాగరాజ్ గౌడ్, పరియాన్ చిన్నబసప్ప, ఎండీ బసవరాజ స్వామి, దేవిశెట్టి ప్రకాష్, ఆదూరి విజయ్ కృష్ణ, సాయి జిందే, దేవిశెట్టి ప్రకాష్, గుడిసె శ్రీరాములు తదితరుల ఆధ్వర్యంలో వీహెచ్‌పీ కార్యాలయం నుంచి వినాయకుడిని ఎల్లెల్సీ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీనివాస భవన్ కూడలిలో పూజలు చేసిన అనంతరం చిన్నహరివాణం ఎల్లెల్సీకి నిమజ్జనానికి తరలించారు. ఎల్లెల్సీ వినాయక ఘాట్ వద్ద జెండాను ఆవిష్కరించి గంగమ్మకు పూజలు చేసి వినాయక నిమజ్జనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ వెంకటలక్ష్మి, కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంపీడీవో గీతావాణి పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T23:52:15+05:30 IST