ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఇద్దరి కోసం..!

ABN, First Publish Date - 2023-02-25T23:54:50+05:30

అధికార పార్టీ ప్రయత్నమంతా ఆ ఇద్దరి విత్‌ డ్రా కోసమే.. ఇందుకు ఏకంగా ఓ ఇద్దరు మంత్రులే రంగంలోకి దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంలోకి మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏకగ్రీవం దిశగా కసరత్తు

ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కీలక సమావేశం

అజ్ఞాతంలో స్వతంత్ర అభ్యర్థులు

విత్‌డ్రాకు రేపు సాయంత్రం 3 గంటల వరకు గడువు

త్రిముఖ పోటీ తప్పదన్నట్టుగా పరిస్థితులు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి):

అధికార పార్టీ ప్రయత్నమంతా ఆ ఇద్దరి విత్‌ డ్రా కోసమే.. ఇందుకు ఏకంగా ఓ ఇద్దరు మంత్రులే రంగంలోకి దిగారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మాదిరిగానే కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా ఏకగ్రీవం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు స్వతంత్రుల్లో ఒకరి నామినేషన్‌ తిరస్కరించేలా చేయడంలో సఫలమయ్యారు. మరో ఇద్దరిని ఎలాగైనా ఉపసంహరింపజేయాలని పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగానే రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు శనివారం ఎమ్మెల్యే కాటసాని ఇంట్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తాయని ముందే ఉహించిన స్వతంత్ర అభ్యర్థులు భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా కీలకమైన నామినేషన్‌ స్వీకరణ, పరిశీలన ఘట్టం ముగిసింది. ఈ నెల 27న విత్‌డ్రాలకు ఆఖరి రోజు. ఆ రోజు సాయంత్రం 3 గంటల తరువాత బరిలో ఉన్నది ఎవరో.. పోరు నుంచి తప్పుకున్నది ఎవరో తేలనుంది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన జాబితా ప్రకారం 1,178 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,022 మందికి పైగా ఓటర్లు వైసీపీకి చెందిన వారే. ఎవరూ పోటీ చేయరు.. ఏకగ్రీవమవుతుందని నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకు వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు భావించారు. ఆదోనికి చెందిన ఏపీ వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. చివరి రోజు మధ్యాహ్నం తరువాత రాజకీయ ముఖ్య నాయకుల ఊహకు అందని రీతిలో టీడీపీ సహకారం, మద్దతుతో ఏపీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, బేతంచర్ల మండలం అంబాపురం సర్పంచ్‌ కె.శ్రీనివాసులు యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు, ఓర్వకల్లు మండలం గుట్టపాడు సర్పంచ్‌ ఎన్‌.మోహన్‌రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం మోత్కులపల్లి సర్పంచ్‌ భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డిలు నామినేషన్లు వేశారు. రాత్రికి రాత్రి వ్యూహాలకు పదును పెట్టి కె.శ్రీనివాసులు నామినేషన్‌ ఒక్కటే తిరస్కరించేలా చేయడంలో సఫలమయ్యారు. భూమా వేణుగోపాల్‌రెడ్డి, నర్ల మోహన్‌రెడ్డిలను ఈ నెల 27వ తేదీ సాయంత్రంలోగా ఎలాగైనా విత్‌డ్రా చేయించి ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది.

రంగంలోకి దిగిన మంత్రులు

రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు స్థానాల్లో వైసీపీ విజయం సాధించే సంఖ్యా బలం ఉంది. టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఒక్క నామినేషన్‌తో నాలుగు స్థానాలు ఏకగ్రీవం చేసుకుంటామని వైసీపీ నేతలు భావించారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ టీడీపీ మద్దతుతో స్వతంత్రులు బరిలోకి దిగారు. వైసీపీ నాయకులు కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించేలా చేసి ఏకగ్రీవం వేసుకున్నారు. కర్నూలులో కూడా అవే ఎత్తులు వేసినా స్వతంత్రులు ముగ్గురు ఉండడంతో వారి పాచికలు పారలేదు. ఒకరి నామినేషన్‌ తిరస్కరించినా ఇద్దరు నామినేషన్లకు ఆర్‌ఓ ఆమోదం తెలిపారు. దీంతో ఆ ఇద్దరితో కూడా విత్‌డ్రా చేయించడానికి రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు రంగంలోకి దిగారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఇంట్లో రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి పాత్రికేయులు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను కూడా పిలవలేదు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏకగ్రీవం కోసమే చర్చ జరిగింది. 1,178 ఓట్లకు గాను 1,022 మందికి పైగా ఓటర్లు వైసీపీకి చెందిన వారే ఉన్నా వారు ఏధైర్యంతో నామినేషన్‌ వేశారో ఓ పరిశీలించాలని మంత్రులు ఎమ్మెల్యేలకు సూచించినట్టు సమాచారం. ఏదేమైనా 27వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా ఆ ఇద్దరు విత్‌డ్రా చేసుకునేలా చూడాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అదే క్రమంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వైసీపీ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు. కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు విభేదాలు వీడి సమన్వయంతో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని.. పట్టింపులకు పోయి పార్టీకి నష్టం చేస్తామంటే అధిష్టానం చూస్తూ కూర్చోదని మంత్రి బుగ్గన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే చివరి ఎన్నికలు ఇవే కావడంతో ఏ తేడా వచ్చినా పార్టీపై ప్రభావం పడుతుందని మంత్రులు గట్టి వార్నింగ్‌ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం.

స్వతంత్రులు ఎక్కడ..?

స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన సర్పంచులు నర్ల మోహన్‌రెడ్డి, భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డిలను విత్‌డ్రా చేయించడానికి ఓ వైపు అధికార వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులోభాగంగానే అధికారులను రంగంలోకి దింపినట్లు సమాచారం. పోలీస్‌ అధికారులు కూడా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు చేసినట్లు సమాచారం. ఇది ముందే ఉహించిన వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలు సెల్‌ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నామినేషన్లు వేసినా.. వారికి టీడీపీ మద్దతు ఉన్నట్లు సమాచారం. ఇద్దరు ఒకే చోట ఉంటే టెక్నాలజీ ద్వారా గుర్తించి పోలీసుల సహకారంతో తీసుకెళ్లి విత్‌డ్రా చేయించే అవకాశం ఉందని గుర్తించి ఇద్దరు చెరో ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత జిల్లాలకు వస్తారని సమాచారం. ఏకగ్రీవాన్ని అధికార పార్టీలోని కొందరు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-25T23:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising