తొలి సాయుధ పోరాట యోధుడు
ABN, First Publish Date - 2023-02-21T23:47:15+05:30
బ్రిటీషు పాలనపై రాయలసీమలో సాయుధ పోరాటం చేసిన తొలి స్వాతంత్ర సమరయోధుడు రేనాటి పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయనను 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్లలోని ట్రెజరీ సమీపంలో ఉన్న జుర్రేటి వాగు వద్ద బ్రిటీషు వారు ఉరి తీశారు.
- ప్రజల మద్దతుతో బ్రిటీషు పాలకులపై తిరగబడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
నేడు 176వ వర్ధంతి
ఉయ్యాలవాడ, ఫిబ్రవరి 21: బ్రిటీషు పాలనపై రాయలసీమలో సాయుధ పోరాటం చేసిన తొలి స్వాతంత్ర సమరయోధుడు రేనాటి పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయనను 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్లలోని ట్రెజరీ సమీపంలో ఉన్న జుర్రేటి వాగు వద్ద బ్రిటీషు వారు ఉరి తీశారు. నేడు నరసింహారెడ్డి 176వ వర్ధంతి.
నరసింహారెడ్డి 1806 నవంబరు 24న పెద్దమల్లారెడ్డి, నీలమ్మల దంపతులకు రూపనగుడి గ్రామంలో జన్మించాడు. అప్పటి నొస్సం జమీందారు చెంచు మల్లారెడ్డికి మనవడు. ఆయనకు కుమారులు లేనందున కుమార్తె కొడుకు(మనవడు) అయిన నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. వారసత్వంగా 70 గ్రామాలకు పాలెగాడిగా నరసింహారెడ్డి ఉండేవాడు. 1842లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వం పాలెగాళ్ల వ్యవస్థను రద్దుచేసి నరసింహరెడ్డి దత్తత గ్రామాలను స్వాధీనం చేసుకొని చెంచు మల్లారెడ్డికి ప్రతి నెల రూ. 11 భరణం ఇవ్వడం మొదలు పెట్టింది. దీనితో నరసింహరెడ్డి ఆగ్రహించి తిరుగుబాటు చేశాడు. 1846లో ఆయన తనకు రావలసిన భరణం కోసం అనుచరుడ్ని కోవెలకుంట్లలోని తహసీల్దారు కార్యాలయానికి పంపించాడు. అక్కడి తహసీల్దారు భరణం ఇవ్వకుండా నరసింహరెడ్డి అనుచరుడ్ని అవమానించి పంపాడు. దీంతో నరసింహరెడ్డి 1846 జూలై 10న తహసీల్దారును చంపుతున్నట్లు తన గ్రామాల్లో చాటింపి వేయించాడు. ప్రజలు చూస్తుండగా కోవెలకుంట్ల తహసీల్దారును నరికి వేసి ట్రెజరీలోని ఖజానాను కొల్లగొట్టి ఆ ప్రాంత ప్రజలకు పంచేశాడు. నరసింహరెడ్డి గిద్దలూరు ప్రాంతంలోని జగన్నాథ గట్టుపై ఉన్నట్లు గుర్తించి బ్రిటీషు సైన్యం చుట్టుముట్టు 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్లలోని జుర్రెట్టి వాగు వద్ద ఉరి తీసింది. అతని తలను 30 ఏళ్ల పాటు ఊరి వాకిలికి వేలాడదీశారు.
నరసింహరెడ్డికి గుర్తింపు ఏది..?
ప్రథమ సాంతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆయన వర్థంతిని అధికారికంగా ప్రకటించ లేదు. కోవెలకుంట్లలోని కుందూ నది ఒడ్డున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డిల విగ్రహల ఏర్పాటుకు 2018లో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రయత్నించారు. కానీ పాలకులు పట్టించుకోలేదు. నరసింహరెడ్డి వంశస్థుల ఆర్థిక సహకారంతో రేనాటి సూర్యచంద్రుల కమిటీ సభ్యులు రూ. 11 లక్షలతో నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి విగ్రహాలను కృష్ణతేజ ఫంక్షన హాలు ఆవరణలో ఉంచారు. అప్పటి నుంచి అవి ఆవిష్కరణకు నోచుకోలేదు.
Updated Date - 2023-02-21T23:47:17+05:30 IST