బటన్ నొక్కితే చెరువులు నిండుతాయా?
ABN, First Publish Date - 2023-09-22T00:24:11+05:30
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బటన్ నొక్కితే హంద్రీ నీవా నీటితో చెరువులు నిండుతాయా?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య
పత్తికొండ టౌన్, సెప్టెంబరు 21: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బటన్ నొక్కితే హంద్రీ నీవా నీటితో చెరువులు నిండుతాయా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య ప్రశ్నించారు. గురువారం పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పత్తికొండ, తుగ్గలి మండలాల్లోని చెరువులను సీపీఐ, రైతు సంఘం బృందం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఈ నెల 18న సీఎం జగన్ లక్కసాగరం పంప్‌హౌస్ దగ్గర 75 చెరువులకు హంద్రీ నీవా జలాలను వదులుతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారని, అయితే తుగ్గలి మండలంలో బొందిమడుగుల చెరువుకు తప్ప.. తుగ్గలి, పత్తికొండ మండలాల్లో మరొక్క చెరువుకు నీరు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. పైపులైన్ పనులు పూర్తి కాకుండా చెరువులకు నీరు ఇస్తామని అనడమంటే వంచించడమే అన్నారు. బొందిమడుగుల చెరువు వరకే పైపులైన్ నిర్మాణ పనులు జరిగాయని, అక్కడి నుంచి ముక్కెల్ల, సందోలి, పత్తికొండ, తుగ్గలి మండలంలో రాంపల్లి, చెన్నంపల్లి, పగిడిరాయి, జొన్నగిరి, రాతన చెరువులకు నీళ్లు మళ్లించే పైపులైన్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని తెలిపారు. సీఎం జగన్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, శ్రీశైలంలో 834 అడుగులు నీటి మట్టం ఉంటే హంద్రీనీవా ప్రాజెక్టుకు నీరు ఎత్తిపోసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నబీ రసూల్, పత్తికొండ, తుగ్గలి మండల కార్యదర్శులు రాజా సాహెబ్, సుల్తాన్, డీహెచ్‌డీఎస్ రాష్ట్ర నాయకుడు గురుదాస్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కారన్న, సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజినేయులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:24:11+05:30 IST