అతీగతీ లేని పెద్ద కొప్పెర్ల
ABN, First Publish Date - 2023-07-21T00:13:04+05:30
కోవెలకుంట్ల మండలంలో నిర్మిస్తున్న పెద్ద కొప్పెర్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. 2012లో శంకుస్థాపన చేసి రూ. 4.50 కోట్లు ఖర్చు చేసి.. ఇక ఆ తర్వాత పట్టించుకోలేదు.
11 సంత్సరాల కింద ఆగిపోయిన ఎత్తిపోతల పథకం
రూ.4.50 కోట్ల నిధులు వృఽథా
నీరుగారిన ప్రభుత్వ ఆశయం
కోవెలకుంట్ల, జూలై 20 : కోవెలకుంట్ల మండలంలో నిర్మిస్తున్న పెద్ద కొప్పెర్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. 2012లో శంకుస్థాపన చేసి రూ. 4.50 కోట్లు ఖర్చు చేసి.. ఇక ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇంతకూ ఈ ప్రాజెక్టు ఒకటి ఉందని, పనులు ఆగిపోయాయని ప్రభుత్వానికి గుర్తుందా? అనే సందేహాన్ని ప్రజలు వెలుబుచ్చుతున్నారు. ఇంత ఖర్చు చేసి.. ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని విమర్శిస్తున్నారు.
కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయి. కుందూనది ఆనుకొని పెద్దకొప్పెర్ల ఎత్తిపోతల పథకానికి 2012 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. పెద్దకొప్పెర్ల, కలుగొట్ల గ్రామాల్లోని 850 ఎకరాల మెట్ట పొలాలకు సాగునీరు అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించారు. మెట్ట రైతులు కరువు బారిన పడకుండా కుందూ నీటిని సద్వినియోగం చేసుకొని సాగు చేసుకునే విధంగా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.5.62 కోట్ల వ్యయంతో రైతులకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ రెండు గ్రామాల రైతులు వర్షాభావం వల్ల, చెంతనే కుందూనది ఉన్నా సాగునీరు అందకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. వీరికి సాగునీరు అందించి పొలాలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. కుందూ నది ఒడ్డున ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు మొదట అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి 2013 నాటికే ఈ పథకం పూర్తి కావాల్సి ఉంది. 11 సంవత్సరాలయినా నేటికీ పథకం అసంపూర్తిగానే ఉండిపోయింది. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.4.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులు వృథా కాగా రైతులకు సాగునీరు అందలేదు. పైపులైన్ పనులు 20 శాతం పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇంకా ఫేజ్-2 కింద పంపుహౌస్, పైపులైన్ పనులు పూర్తి కావాల్సి ఉంది. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టరుకు నోటీసులు పంపించారు. గతంలో అనేకసార్లు నోటీసులు పంపినా లెక్క చేయకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు.
పథకం పూర్తి చేసి ఆదుకోండి - తలారి బాల సుబ్బరాయుడు, రైతు, పెద్దకొప్పెర్ల గ్రామం.
ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఆదుకోవాలి. ఈ పథకం పూర్తయితే పెద్దకొప్పెర్ల, కలుగొట్ల గ్రామాల్లో కరువు కాటకాలు ఉండవు. సాగునీటితో గ్రామాలు కళకళలాడుతాయి. అధికారులు, నాయకులు పట్టించుకొని పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
పనులు త్వరగా పూర్తి చేయాలి - ఎర్రం సుబ్రహ్మణ్యం, రైతు, పెద్దకొప్పెర్ల గ్రామం
20 శాతం పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. వాటిని త్వరగా పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందుతుంది. అధికారులు, నాయకులు చొరవ తీసుకొని పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
పూర్తి వివరాలతో సమాచారం అందిస్తా :- నారాయణ రెడ్డి, ఎత్తిపోతల పథకం కోవెలకుంట్ల ఏఈ.
పెద్ద కొప్పెర్ల ఎత్తిపోతల పథకం పూర్తి వివరాలు నాకు తెలియదు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. త్వరలో పథకం గూర్చి పూర్తి సమాచారం అందిస్తా.
Updated Date - 2023-07-21T00:13:04+05:30 IST