సమర నినాదం
ABN, First Publish Date - 2023-09-22T23:50:18+05:30
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు సమర నినాదం వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సంతకాలతో కూడిన ప్రతులు
కర్నూలు, సెప్టెంబరు 22, (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు సమర నినాదం వినిపిస్తున్నాయి. శుక్రవారం పదో రోజు జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కర్నూలు కృష్ణదేవరాయ సర్కిల్‌లో నియోజకవర్గం ఇన్‌చార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపిస్తున్న ఐదువేల సంతకాల ప్రతులను విడుదల చేశారు. దీక్షల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్, పార్టీ నాయకులు నాగరాజు యాదవ్, బొలెద్దుల రామకృష్ణ పాల్గొన్నారు. కోడు మూరులో ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. కోట్ల సర్కిల్‌లో కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు సోమేశ్వర సర్కిల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగించారు. టీడీపీ నాయకులు మిఠాయి నరసింహులు, రామదాసుగౌడు, దయాసాగర్, రంగస్వామిగౌడు, తురేగల్ నజీర్, దేవబెట్ట సోమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలూరులో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జయరాం, తెలుగు రైతు తాలుకా అధ్యక్షుడు కమ్మరిచేడు దేవేంద్రప్ప, మల్లయ్య ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కురువ సంఘం నాయకులు దీక్షలు చేపట్టారు. మంత్రాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కోసిగి మండలానికి చెందిన క్లస్టర్ ఇన్‌చార్జిలు, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు దీక్షల్లో కూర్చున్నారు. పత్తికొండలో జడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ దీక్షల్లో కూర్చున్నారు.
క్షమాపణ చెప్పాలి : బీటీ నాయుడు
చంద్రబాబుపై అక్రమంగా పెట్టిన కేసును ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని శాసనమండలి ఉప నాయకుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. శాసన మండలి రూల్ నెంబర్.341 కింద చంద్రబాబు అరెస్టుపై చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నోటీసు ఇచ్చామని, అయితే మండలి చైర్మన్ రాజు తమవిన్నపాన్ని తిరస్కరించారని తెలిపారు.
Updated Date - 2023-09-22T23:50:18+05:30 IST