రాష్ట్రంలో అరాచక పాలన: టీడీపీ
ABN, First Publish Date - 2023-09-26T00:02:51+05:30
వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.
డోన్, సెప్టెంబరు 25: వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సోమవారంటీడీపీ ఆధ్వర్యంలో బాబుతో మేము నిరాహార దీక్ష చేపట్టారు. బేతంచెర్ల క్లస్టర్ టీడీపీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ దోపిడీ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. వైసీపీ అవినీతి అక్రమాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే జీర్ణించుకోలేక ఆయనపై అక్రమ కేసులతో జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు ప్రజల ఆశీస్సులతో బయటకు వస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు మనమంతా అండగా నిలిచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామ న్నారు. అనంతరం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, షేక్షావలి చౌదరి రామ్మూర్తి, పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్‌ఎండీ రఫీ, గోవిందరెడ్డి పాల్గొన్నారు.
బనగానపల్లె: నవ్యాంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం రాక్షసపాలన సాగిస్తోందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ విమర్శించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు బీసీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో టీడీపీ తెలుగు మహిళలు సోమవారం బనగానపల్లె పట్టణంలో నిరసన దీక్షలో పాల్గొన్నారు. బాబుగారితో మేము సైతం అంటూ బీసీ ఇందిరమ్మతో పాటు పలువురు మహిళలు సంతకాలు చేశారు. బీసీ ఇందిరమ్మ మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి మహిళ ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని, సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు.. దీక్షలో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ, ఇతర మహిళలలకు బనగానపల్లె పట్టణ ఉసర్పంచ్ బురానుద్దీన్ సతీమణి ఫరీదాబేగం, లక్ష్మీనారాయణమ్మ, శివమ్మతో పాటు పలువురు మహిళలు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. అలాగే పలువురు టీడీపీ నాయకులు బీసీ ఇందిరమ్మ, ఇతర మహిళలు చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.
దొర్నిపాడు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా విడుదల కావాలని రామచంద్రాపురం గ్రామంలోని రామాలయం గుడిలో టీడీపీ నాయకులు ఎలిషబాబు, వేమూరి బాలకృష్ణ, బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ ఓర్వలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తఽథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బెజవాడ సాంబయ్య, సంజీవ, పుల్లయ్య, మద్దినేని వెంకటేశ్వర్లు, గడ్డం సత్యనారాయణ, మహిళలు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతిపత్రం
బేతంచెర్ల: టీడీపీ అధినేత చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని కోరుతూ సోమవారం నంద్యాల కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్‌కు వినతి పత్రం అందజేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, అలాగే అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా తమ విధులను సక్రమంగా నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దామోదరం నాగశేషులు, ప్రధాన కార్యదర్శి రాజారావు, ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రూబెన్, మేకల నాగరాజు తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-09-26T00:02:51+05:30 IST