పౌరాణిక ప్రేమ కథ
ABN, First Publish Date - 2023-03-21T23:23:54+05:30
కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు చూసేందుకు వింతగా ఉంటాయి.
నేటికీ కొట్టుకుంటూనే ఉన్నారు
కైరుప్పలలో నేడు పిడకల సమరం
ఏటా ఉగాది నాడు వేడుక
ఆదోని/ఆస్పరి, మార్చి 21:
కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు చూసేందుకు వింతగా ఉంటాయి. ఏన్నో ఏళ్లు గడిచినా జనాలు వాటిని పాటిస్తూనే ఉంటారు. పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉగాది సందర్భంగా కైరుప్పలలో పిడకల సమరం జరుగుతుంది. భద్రకాళిదేవి, వీరభద్ర స్వామి ఆలయం దగ్గరలో ఈ కార్యక్రమం పెద్దఎత్తున జరుగుతుంది. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ సమరం వెనుక ఓ ప్రేమ కథ దాగి ఉందని, అందులో భాగంగానే ఈ ఆచారం కొనసాగుతోందని పెద్దలు చెబుతుంటారు. ఇంతకీ ఆ ప్రేమ కథ ఏంటంటే...!
త్రేతా యుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే పెళ్లి విషయమై వీరభద్ర స్వామి ఆలస్యం చేస్తుంటారు. దీనిపై భద్రకాళి దేవి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేవతను వీరభద్ర స్వామి మోసం చేస్తున్నట్లుగా భావిస్తారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. వీరభద్రస్వామిని అవమానించాలని ప్రణాళిక వేసుకుంటారు. ఇందులో భాగంగానే పేడతో చేసిన పిడకలు ఆయన పైకి విసిరేయాలనుకుంటారు. ఈ విషయం ఇటు వైపు వీరభద్ర స్వామి భక్తులకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం వైపు వెళ్లొద్దని స్వామివారిని వేడుకుంటారు. ఎంతకూ వినిపించుకోని స్వామి అటు వైపుగా వెళ్తారు. వెంటనే అమ్మవారి భక్తులు పిడకలను స్వామి వారిపై విసిరేస్తారు. ఈ విషయం తెలిసిన వీరభద్రస్వామి భక్తులు కూడా పిడకలను అమ్మవారి భక్తుల మీదకు విసిరేస్తారు. దీంతో అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇరువర్గాల వారు ఇలా పిడకల సమరం కొనసాగిస్తారు. ఇప్పటికీ ఇదే ఆచారం కొనసాగుతోంది.
అయితే ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలసుస్తుంది. వెంటనే వచ్చి సమరం ఆపేలా చేస్తారు. దెబ్బ తగిలిన వారు భద్రకాళి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయాలకు వెళ్లి విభూతి రాసుకోవాలని ఆదేశిస్తాడు. ఆ తరువాత ఇద్దరి విగ్రహాలను ఒకే ఆలయంలో పెట్టి కళ్యాణం జరిపిస్తానని.. బ్రహ్మదేవుడు మాట ఇస్తాడు. అదే సమయంలో పూజలు చేసేందుకు కైరుప్పల గ్రామం పక్కన ఉన్న కారుమంచి గ్రామంలోని ఓ రెడ్ల కుటుంబానికి బాఽధ్యతలు అప్పగిస్తారు. ఇక అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు ఆలయానికి వెళ్లి స్వామివార్లను పూజిస్తారు. సమరం ముగిసిన తరువాత దెబ్బలు తగిలిన చోట విభూతి రాసుకుంటారు. ఈ నెల 24వ తేదీ తెల్లవారు జామున 4.05 గంటలకు భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామి వారికి కళ్యాణం చేస్తారు. 25వ తేదీ శనివారం హోమం, ప్రత్యేక పూజలు అనంతరం 5 గంటల సమయం సంధ్యా వేళలో రథోత్సవం జరుగుతుంది.
నేడు కైరుప్పలలో పిడకల సమరం....
వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కైరుప్పలలో గురువారం సాయంత్రం పిడకల సమరం జరగనుంది. ఇందు కోసం పిడకలను సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో వీటిని రాశులుగా పోసి ఉంచారు. మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్లు, చిన్నపల్లి, పుష్పాలదొడ్డి, యాటకల్లు, కలపరి, దొడగొండ, తురువగల్, అలారుదిన్నే, ముత్తకూరు గ్రామాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి వేలాది భక్తులు హాజరు కానున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్ల ఎస్సై వరప్రసాద్ తెలిపారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు, వీరభద్ర స్వామికి పిడకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
Updated Date - 2023-03-21T23:23:54+05:30 IST