బెజవాడ విమానాశ్రయంపై శీతకన్ను!
ABN, First Publish Date - 2023-06-11T01:17:55+05:30
అత్తమీద కోపం దుత్త మీద చూపించిందన్నట్టుంది విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై వైసీపీ సర్కార్ తీరు. అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందన్న కారణంతో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై ఉన్న శ్రద్ధలో కొద్దిపాటి కూడా విజయవాడ ఎయిర్‌పోర్టుపై పెట్టడం లేదు. ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వడం లేదు. కేంద్రమే అంతా ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ కూడా లేదు. దీంతో నవ్యాంధ్రకే గర్వకారణమైన విజయవాడ విమానాశ్రయం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
నిర్మాణం పూర్తయి.. ఆపరేషన్స్‌కు వేదిక కావాల్సిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు ఇప్పటికి సగం కూడా కాలేదు. కొంత కాలం కిందటి వరకు పనులు పరుగులు పెట్టినా.. ఈ పనులను పర్యవేక్షించే నాధుల్లేక నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ విమానాశ్రయం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమీక్ష చేయలేదు. దీంతో కాంట్రాక్టు సంస్థలో కూడా భయం కొరవడింది. గడువు ముగుస్తున్నా.. ఇంకా పనులు సాగే దశలోనే ఉన్నాయి.
టీడీపీ హయాంలో ఇలా...
టీడీపీ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ అభివృద్ధి పనుల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దృష్టి సారించేవారు. విజయవాడ ఎయిర్‌పోర్టులో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున 700 ఎకరాలను సమీకరించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండి యా (ఏఏఐ)కు అప్పగించారు. ఆ భూముల్లోనే రన్‌వే విస్తరణ, ఆఫ్రాన్ల నిర్మాణం, అదనపు పార్కింగ్ బేలు, అగ్నిమాపక స్టేషన్లు, సోలార్ ప్లాంట్, రోడ్ల విస్తరణ, కార్ల స్టాండ్, ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. కిందటి ప్రభుత్వ హయాంలో ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రతినెలా సమీక్షించేవారు. దీంతో పనుల్లో పురోగతి లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం ఉండేది. అంతకంటే పెద్దదైన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవటం లేదు.
కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. రూ.288 కోట్ల వ్యయంతో నాడు ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ పనులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ కారణంగా.. ఏడాది సమయంలో పూర్తి చేయటం జరిగింది. రూ.611 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు చేపడితే ఇప్పటి వరకు ఈ పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదు. విజయవాడలో ఇది పూర్తయితే.. రాష్ట్రంలోనే అత్యంత ప్రధానమైన విమానాశ్రయంగా మారుతుంది. వైసీపీ సర్కార్‌కు ఇది ఇష్టం లేనట్టుగా ఉంది. విశాఖను దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయానికి ఇచ్చిన ప్రాధాన్యత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవ్వటం లేదు.
ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రత్యేకతలు
గ్లాస్, స్టీల్ స్ట్రక్చర్‌లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు చేపడుతున్నారు. ఈ బిల్డింగ్‌కు సంబంధించి గత ప్రభుత్వం డిజైన్లను ఖరారు చేసింది. ఆ కక్షతో వైసీపీ ప్రభుత్వం బిల్డింగ్ నిర్మాణంపై శీతకన్ను వేసింది. ఈ బిల్డింగ్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రయాణికుల కోసం ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తారు. ఆధునిక బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టమ్, ఎరైవల్ బ్యాగేజీ క్లెయిమ్ క్లారోసోల్స్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డి స్‌ప్లే సిస్టమ్, కామన్ యూజ్ టెర్మినల్ ఎక్విప్‌మెంట్, చెక్ ఇన్ కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, కస్టమ్ కౌంటర్స్, గెస్ట్‌హౌస్ వంటివి ఏర్పాటు చేస్తారు. దీనికి అనుబంధంగా కొత్త ఆప్రాన్ ఉంటుంది. మూడు కోడ్ ఈ విమానాలు, ఆర్ కోడ్‌సీ విమానాలు పార్కింగ్ చేసుకునేలా ఆఫ్రాన్ ఉంటుంది.
Updated Date - 2023-06-11T01:17:55+05:30 IST