పంచాయతీలను ఆదుకోండి
ABN, First Publish Date - 2023-05-02T00:53:39+05:30
15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చే సి ఆదుకోవాలని, చిన్న పంచాయతీల స్వావలంభన కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం నేతృత్వంలోని సర్పంచులు ఆందోళన బాట పట్టారు.
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చే సి ఆదుకోవాలని, చిన్న పంచాయతీల స్వావలంభన కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం నేతృత్వంలోని సర్పంచులు ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం సందర్భంగా సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు అంబేడ్కర్, మహత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీల్లో సమస్యలు, సవాళ్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ దిల్లీరావుకు వినతిపత్రం అందజేశారు. పార్టీలకతీతంగా సర్పంచులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అధికార పార్టీ సర్పంచులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కోశాధికారి వరి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవటం వల్ల పంచాయతీల మనుగడ కష్టంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,010 కోట్లు బాకీ పడిందన్నారు. ఇటీవల తాము ఢిల్లీ వెళ్లి కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిజారాజ్ సింగ్, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శులను కలిశామని, అసెంబ్లీ నివేదిక పంపిస్తే నిధులు విడుదల చేస్తామని వారు చెప్పారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల నిధులను ప్రభుత్వం ఇస్తోందని, ఈ నిధుల వినియోగం కూడా సర్పంచ్‌ల పరిధిలో జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
Updated Date - 2023-05-02T00:53:39+05:30 IST