చిరు, తృణ ధాన్యాలు ఆరోగ్యానికి మేలు
ABN, First Publish Date - 2023-02-13T01:01:40+05:30
ఆరోగ్య సంరక్షణకు చిరు, తృణధాన్యాలను భోజనంలో భాగంగా చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్టలో ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉంగుటూరు, ఫిబ్రవరి 12 : ఆరోగ్య సంరక్షణకు చిరు, తృణధాన్యాలను భోజనంలో భాగంగా చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్టలో ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యంకోసం తగిన పాళ్లలో మిల్లెట్లను ఆహారంగా తీసుకోవటం ప్రజలు అలవాటుచేసుకోవాలన్నారు. ప్యాషన్‌కోసం పాలి్‌షచేసి పోషకాలన్నీ తీసేసిన బియ్యాన్ని ఆహారంగా తీసుకోవటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదన్నారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తిన్న రాగిముద్ద, నాటుకోడిపులుసు, రాగిజావను గుర్తుచేసుకున్నారు. దేశంలో చిరు, తృణధాన్యాల పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఈనేపధ్యంలో రైతులు చిరు, తృణ ధాన్యాల పంటల సాగువైపు దృష్టిసారించాలని వెంకయ్య సూచించారు.
శారీరక శ్రమతో సంపూర్ణ ఆరోగ్యం
ఆరోగ్యంపట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, శారీరక శ్రమతోపాటు మంచి ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవటం ద్వారా ఎలాంటి రోగాలు లేని సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణభారత్‌ట్ర్‌స్ట, రమేష్ హాస్పిటల్స్, సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్ట ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు - వైద్యపరిష్కారాల గురించి హైస్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో పొందుపరచటం ద్వారా చిన్నతనంనుంచే ఆరోగ్య పరిరక్షణ-వ్యాధుల నియంత్రణపట్ల వారికి అవగాహన, అప్రమత్తత ఏర్పడి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించటంలో కీలకపాత్ర పోషిస్తారన్నారు. ప్రస్తుతకాలంలో యువతలో సెల్‌పోన్ వాడకం మితిమీరిందని, మద్యపానం, ధూమపానం వలే యువత సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించకపోతే ఆరోగ్యసమస్యలతో సతమతమవక తప్పదని యువతను హెచ్చరించారు. శిబిరానికి వచ్చిన రోగులను పరామర్శించారు. ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, కనీస వ్యాయామం, సమయపాలనలేని, మితిమీరిన ఆహారపు అలవాట్లు, అనవసర ఆందోళనలు, కాలుష్య ప్రభావాలు తదితర కారణాల వల్ల 30ఏళ్లకే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటుకు దారితీయటం, 50ఏళ్లకే గుండె, కిడ్నీ, క్యాన్సర్, లివర్ సమస్యల బారినపడటం జరుగుతోందన్నారు. ఈనేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా వుండాలన్నారు.
వైద్యశిబిరంలో 420 మందికి ర్యాపిడ్ షుగర్, బీపీ, ఇసీజీ, ఎకో, ఎముకలదృఢత్వ పరీక్ష, కంటి, దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. శిబిరంలో గుండెవ్యాధి నిపుణులు డాక్టర్ రమే్‌షబాబుతోపాటు మెదడు, కీళ్లు, ఊపిరితిత్తులు, నరాలు, ఎముకలు, సాధారణ వ్యాధులకు సంబంధించిన ప్రముఖ వైద్యబృందం పాల్గొన్నారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరదేశి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
రామలింగేశ్వరుని దర్శించిన వెంకయ్య
పెనమలూరు : వెంకయ్యనాయుడు ఆదివారం యనమలకుదురు రామలింగేశ్వరుని దర్శించుకున్నారు. వెంకయ్యనాయుడుకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరామలింగేశ్వరస్వామి, పార్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. శివరాత్రి సందర్భంగా మహా సౌరయాగంలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడుకు ఆలయ పురోహితులు వేద ఆశీర్వాదం అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈవో గంగాధర్, సంగా నరసింహరావులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-13T01:01:44+05:30 IST