రౌడీగ్యాంగ్
ABN, First Publish Date - 2023-08-18T00:55:47+05:30
గ్యాంగ్‌వార్‌లో ప్రధాన పాత్ర పోషించి బీభత్సం సృష్టించిన ఓ రౌడీషీటర్‌కు అనుచరులుగా వ్యవహరిస్తున్న కొందరు తాడిగడపలో వీరంగం సృష్టిస్తున్నారు. గంజాయి తాగి రోడ్డుపై వచ్చిపోయే వారిని డబ్బు కోసం బెదిరిస్తున్నారు. ఇవ్వని వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలా ఓ యువకుడ్ని బెదిరిస్తుండగా, అడ్డు వెళ్లిన మరో యువకుడి ప్రాణాలు తీసిన ఘటన తాడిగడప డొంక రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది.
గంజాయి మత్తులో రోడ్లపై హల్‌చల్
డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులు
ఇదేమని ప్రశ్నించిన యువకుడిపై దాడి
అందరూ చూస్తుండగానే దారుణ హత్య
విజయవాడ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : యనమలకుదురులోని తాడిగడప డొంక రోడ్డుకు చెందిన షేక్ రఫీ (33) లబ్బీపేటలో ఉన్న వాకీటాకీ మొబైల్ షోరూంలో సెల్‌ఫోన్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం షాపునకు వెళ్లిన రఫీ మధ్యాహ్నం రెండు గంటలకు భోజనానికి వచ్చాడు. 3.30 గంటలకు డొంకరోడ్డులోని హ్యాపీబార్ ఎదురుగా ఉన్న మోడ్రన్ చికెన్ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ స్నేహితులు ఇమ్రాన్, షాబు, సొహైల్‌తో కలిసి గడిపాడు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న మసీదులో నమాజ్ చేసుకోవడానికి బయల్దేరాడు. కాగా, అక్కడి మూడు రోడ్ల కూడలిలో ఎల్లారెడ్డి, అనిల్, డాన్‌బాషా అనే ముగ్గురు యువకులు నడకుదుటి నాగరాజు అనే వ్యక్తితో గంజాయి మత్తులో గొడవ పడుతున్నారు. మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలంటూ బెదిరిస్తుండటంతో నాగరాజు అటుగా వెళ్తున్న రఫీని పిలిచాడు. నాగరాజును ఎందుకు కొడుతున్నారని రఫీ అడ్డుకున్నాడు. దీంతో ఆ ముగ్గురు కలిసి రఫీపై తిరగబడ్డారు. స్థానికులు పెద్దసంఖ్యలో రావడంతో గంజాయి బ్యాచ్ అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం రాత్రి 10 గంటలకు రఫీ తన స్నేహితులతో కలిసి చికెన్ షాపు వద్దకు చేరుకున్నాడు. విషయ తెలుసుకున్న ఎల్లారెడ్డి, అనిల్, డాన్‌బాషా మరికొంతమందిని తీసుకుని ఆటోలు, మోటారు సైకిళ్ల వచ్చి రఫీపై దాడికి దిగారు. కింద పడేసి కాళ్లతో ఇష్టానుసారంగా కొట్టారు. ఎల్లారెడ్డి తన వద్ద ఉన్న కత్తితో రఫీ ఛాతీపై పొడిచి పరారయ్యాడు. దీంతో స్నేహితులు రఫీని కానూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రఫీ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రఫీ తండ్రి కరీముల్లా ఇచ్చిన ఫిర్యాదుపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రఫీ మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు.
పోలీసులు అప్పుడే పట్టుకుని ఉంటే..
హ్యాపీబార్ వద్ద ఉన్న మూడు రోడ్ల జంక్షన్ వద్ద గొడవ జరుగుతుండగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీట్ పోలీసులు ఈ ప్రదేశానికి వచ్చి అసలు ఏం జరిగిందని రఫీని విచారించారని చెబుతున్నారు. అప్పటికి కొంతదూరాన నిందితులు ఎల్లారెడ్డి, అనిల్, డాన్‌బాషా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పుడే ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఉంటే రఫీ ప్రాణం నిలబడేదని అంటున్నారు. రఫీకి అక్క, చెల్లి ఉన్నారు. అక్కకు వివాహమైంది. చెల్లెలికి పెళ్లి చేయడానికి రఫీ కష్టపడుతున్నాడు.
రౌడీషీటర్‌కు అనుచరులుగా ఉంటూ...
ఎల్లారెడ్డి, అనిల్, డాన్‌బాషా... రఫీపై దాడి చేసిన వారిలో ఈ ముగ్గురు ముఖ్యులు. ఇందులో డాన్‌బాషా అనే యువకుడు డొంకరోడ్డులో 2020, మే 30వ తేదీన జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఉన్నాడు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ వెంట నడుస్తున్నాడు. ఈ వార్ జరిగాక ఆ రౌడీషీటర్ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్నప్పటికీ అతడితో పాటు అనుచరులు చెలరేగిపోతున్నారు.
Updated Date - 2023-08-18T00:55:47+05:30 IST