గొల్లపూడిలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2023-01-18T00:03:34+05:30
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్లో మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యాలయానికి పోలీసులు తాళాలు వేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ కార్యాలయానికి తాళం వేసిన పోలీసులు
వైసీపీ నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారని దేవినేని ఉమా ఆరోపణ
గొల్లపూడి, జనవరి 17: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్లో మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యాలయానికి పోలీసులు తాళాలు వేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పెద్దఎత్తున పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకొని పోలీసుల చర్యను నిరసిస్తూ నినాదాలు చేశారు. తాళం ఎందుకు వేశారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. వందల మంది పోలీసులు, తహసీల్దార్ శ్రీనివాస్ అక్కడకు చేరుకొని పార్టీ కార్యాలయానికి తాళం వేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం మాజీమంత్రి ఉమా మాట్లాడుతూ గత మూడు ఎన్నికల్లోను ఇక్కడ్నుంచే ప్రచారం నిర్వహించామన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఇక్కడి పార్టీ కార్యాలయాన్ని ఆధునీకరించి అందంగా తీర్చిదిద్ది ప్రారంభించి అక్కడే రక్తదానం, అన్నదానం చేద్దామనుకున్నామన్నారు. అది గిట్టని వైసీపీ నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారన్నారు. టీడీపీ కార్యాలయానికి భారీ ఎత్తున పోలీసులను, వారితో తహసీల్దార్‌ను పంపి పార్టీ కార్యాలయానికి తాళం వేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ప్రశాంతంగా ఉన్న గొల్లపూడిలో అల్లర్లు సృష్టించి 144 సెక్షన్ పెట్టి బుధవారం జరగాల్సిన ఎన్టీఆర్ వర్థంతిని జరగకుండా చేయాలని ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు కుట్రలు, కుయుక్తులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా 14 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఉన్న తాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితి గొల్లపూడిలో చూడలేదన్నారు. పట్టపగలే ఎమ్మెల్యే వసంత, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలు తన కార్యాలయాలకు తాళాలు వేసుకొని తహసీల్దార్, పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ కార్యాలయానికి తాళాలు వేయించడం అప్రజాస్వామికమన్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా అన్నదానం, రక్తదానం చేసి తీరుతామన్నారు. ప్రజాస్వామ్య విధానంలో వైసీపీ అకృత్యాలను తిప్పకొడతామన్నారు.
మేమే టీడీపీ కార్యాలయానికి ఇచ్చాం : శేషారత్నం
గొల్లపూడి పార్టీ కార్యాలయానికి తాళం వేయడం వెనుక ఉన్న అసలు సూత్రదారులు వేరుగా ఉన్నా పాత్రధారిగా ఉన్న స్థల యజమాని శేషారత్నం మీడియా ముందుకు వచ్చేలా వైసీపీ నేతలు చేశారు. ఆమె మాట్లాడుతూ తన కుమారులకు స్థలం రాసి ఇచ్చానని ఆ తర్వాత తామే టీడీపీ కార్యాలయానికి లీజుకు ఇచ్చామని, కొంత కాలంగా తనను కొడుకులు సరిగా చూడటం లేదని అసలు పట్టించుకోవడం లేదని అందుకే తన స్థలం తనకు ఇచ్చేయాలని అధికారులను కోరుతున్నట్టు పోలీసులు, అధికారులు వచ్చి ఇలా హడావిడి చేయడం సరికాదని తన స్థలం తనకు ఇస్తే తానను అక్కడే ఉంటానని శేషారత్నం చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-01-18T00:03:36+05:30 IST