పార్శిళ్లు వెనక్కి..
ABN, First Publish Date - 2023-06-07T01:00:37+05:30
గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు రావులపాలెం వెళ్లొస్తూ కోడిగుడ్లను కొనుగోలు చేసి విజయవాడ పీఎన్‌బీఎస్‌లోని బుకింగ్ పాయింట్‌లో గుంటూరు డెలివరీకి నమోదు చేశాడు. వారం రోజులైనా ఆ కోడిగుడ్లు స్టోర్ రూమ్‌లోనే ఉండిపోయాయి. వాకబు కోసం ఆయన విజయవాడ రాగా, కోడిగుడ్ల బాక్స్ పార్శిల్ స్టోర్‌లో కనిపించింది. పార్శిల్ ఎందుకు డెలివరీ పంపించలేదని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే, వారు మర్యాదగా సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తన బంధువులకు ఆర్టీసీ కార్గో ద్వారా మామిడికాయలు పంపిస్తే అవి మూడు రోజులైనా చేరలేదు. ఆ తర్వాత చేరిన మామిడికాయలు కుళ్లిపోయి కనిపించాయి. ఇలాంటివి రోజూ అధిక సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. అత్యవసరంగా పంపించాల్సిన మందులు సకాలంలో చేరకపోవటంతో బుక్ చేసినవారు స్టోర్ రూమ్‌లోకి వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కూరగాయలు, పండ్లు వంటివి డెలివరీ చేసేవారు వాటిపై ఆశలు వదులుకోవటమే అన్నట్టుంది పరిస్థితి.
వెనక్కి తీసేసుకుంటున్న వినియోగదారులు
దురుసుగా ప్రవర్తిస్తున్న సిబ్బంది
వెతుక్కుని పార్శిళ్లు తీసుకెళ్లిపోతున్న కస్టమర్లు
ఆర్టీసీ కార్గోకు ఓ దండమంటూ ఆగ్రహం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కార్గో సేవలను భ్రష్టు పట్టించిన కాంట్రాక్టు సంస్థ ఎస్‌పీవీ నిర్వాకంపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఇదేం ఖర్మ.. అనుకుంటూ నిరాశతో తమ పార్శిళ్లను వెతుక్కుని మరీ ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. బుకింగ్ చేసిన ప్రతి పార్శిల్‌కు కస్టమర్ల నుంచి డబ్బు తీసుకుంటున్న కాంట్రాక్టు సంస్థ పార్శిళ్లను బస్సుల్లో వేసే విషయంలో అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. కాంట్రాక్టు సంస్థ నిర్వాకాన్ని బాగా వంట బట్టించుకున్న హమాలీలు కూడా పనిచేయటం మానేశారు. కాంట్రాక్టు సంస్థ బాధ్యతగా లేకున్నా హమాలీలు తెలుసుకుని పార్శిళ్లను ఆయా బస్సుల్లో వేయించాల్సి ఉంటుంది. అలా జరగట్లేదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు స్వచ్ఛందంగా తమంతట తాము వచ్చి బస్సుల్లో తమ పార్శిళ్లు వేసుకుని వెళ్తున్నారు. కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, హమాలీల అలక్ష్యం కారణంగా పార్శిళ్లు భారీగా పేరుకుపోతున్నాయి.
కొరియర్ విభాగంలోనూ ఇంతే..
ఆర్టీసీ కార్గో విభాగం పక్కనే ఆర్టీసీ కొరియర్ విభాగం కూడా ఉంది. చిన్నచిన్న కవర్ల రవాణాకు ఇది పనిచేస్తుంది. ఇక్కడ కూడా ముగ్గురు పనిచేయాల్సిన చోట ఇద్దరే ఉంటున్నారు. ఒక్క కంప్యూటర్‌పైనే వర్క్ నడుస్తోంది. దీంతో ఈ విభాగం దగ్గర కూడా కస్టమర్లు కవర్లు తీసుకోవటానికి వేచి ఉండాల్సిన పరిస్థితి.
ఆర్టీసీ కార్గోకు ఓ దండం
ఆర్టీసీ కార్గోకు ఒక దండం. బుద్ధి తక్కువై ఆర్టీసీని ఆశ్రయించాను. గుంటూరుకు కోడిగుట్ల పార్శిళ్లను బుక్ చేస్తే వారమైనా చేరలేదు. మళ్లీ దానిని వాకబు చేయడం కోసం నేను విజయవాడ రావాల్సి వచ్చింది. సిబ్బంది చిరాకు పడుతున్నారు. నేనే వెతుక్కుని గుర్తించాను. ఎందుకు పంపలేదని ప్రశ్నిస్తే నా మీద దురుసుగా వ్యవహరించారు. పోనీ ఎప్పుడు పంపుతావో అదైనా చెప్పు అంటే సమాధానం లేదు. దీంతో నేను నా బుకింగ్‌ను రద్దు చేసుకున్నాను. నా వెంటే తీసుకెళ్తున్నాను. ఇంతటి అధ్వానమైన కార్గోను ఎప్పుడూ చూడలేదు. - సుధీర్, కస్టమర్
Updated Date - 2023-06-07T01:00:37+05:30 IST