ధాన్యం.. అయోమయం!
ABN, First Publish Date - 2023-02-15T00:48:26+05:30
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మొదటి విడత టార్గెట్ దాదాపు పూర్తవడంతో రెండో విడతలో మిగులు ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మిగులు ధాన్యం 1.50 టన్నుల కొనుగోలుపై అన్నదాతల అవస్థలు
కొనుగోళ్లకు అనుమతుల కోసం అధికారుల ప్రయత్నాలు
పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు నివేదించాలని నిర్ణయం
కొనుగోళ్లకు రూ.325 కోట్లు అవసరం
35 రోజులైనా పాత బకాయిలు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం
మళ్లీ కొనేందుకు సిద్ధపడుతుందా అని రైతుల అనుమానం
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మొదటి విడత టార్గెట్ దాదాపు పూర్తవడంతో రెండో విడతలో మిగులు ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఖరీఫ్ పంట కొనుగోళ్లలో అంచనాలు పూర్తయినా ఇంకా 1.5 లక్షల టన్నులు రైతుల వద్దే ఉండటంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో మార్చి నాటికి ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ అపరాజిత సింగ్, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు శ్రీధర్ మంగళవారం సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ను కలిసి మిగులు ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతి తీసుకోవాలనుకున్నారు.
ఆంఽధ్రజ్యోతి-మచిలీపట్నం : ఖరీఫ్ సీజన్ వరికుప్ప నూర్పిళ్లు, ధాన్యం విక్రయాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఖరీఫ్ సీజన్‌లో కోతకోసిన పంటను వెంటనే విక్రయించకుండా కుప్పలుగా వేస్తారు. రబీ సీజన్‌లో పొలంలో మినుము విత్తుతారు. మినుము పంటకోతకు వచ్చిన సమయంలోనే వరికుప్ప నూర్పిళ్లు చేస్తారు. దీంతో ధాన్యం కొనుగోలు వ్యవహారం మార్చి నెలాఖరు వరకు కొనసాగుతుంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 4.21 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ధాన్యం దిగుబడి 9.60 లక్షల టన్నులు వస్తుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా వేశారు. పౌరసరఫరాలశాఖ ద్వారా తొలి విడతగా 5.06 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 4.10 లక్షల టన్నులకుపైగా ధాన్యం ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేశారు. లక్ష్యం దాదాపుగా పూర్తికావడంతో వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లను దాదాపుగా నిలిపేశారు. ఈ లోగానే సర్వర్‌ను నిలిపివేశారని, ధాన్యం కొనుగోలుకు వీలులేదని మిల్లర్లు చెబుతుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. దీంతో రైతులు తమ వద్ద ఇంకా ధాన్యం ఉందని, కొనుగోలు చేయాలని ఆర్‌బీకేలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రైతుల నుంచి శాసనసభ్యులపై ఒత్తిడి అధికమవుతోంది. దీంతో అధికారులు 1.50 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ నుంచి ఆనుమతులు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలుకు అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
రూ.325 కోట్లు కావాలి
జిల్లాలో మిగులు ధాన్యం 1.50 లక్షల టన్నులుంది. దీన్ని సేకరించాలంటే రూ.300 కోట్లు కావాలి. ధాన్యం రవాణా, కూలి, సంచుల కొనుగోలు కోసం మరో రూ.25 కోట్లు కావాలి. ఇంత మొత్తంలో నగదు సమకూర్చుకున్న తరువాతనే ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. పాత బకాయిలు చెల్లించకే 35 రోజులైంది. ఈ క్రమంలో ప్రభుత్వం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎన్నిరోజుల్లో పడుతుంది? అనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది.
Updated Date - 2023-02-15T00:48:29+05:30 IST