కాలం చెల్లిన కాటాలు!
ABN, First Publish Date - 2023-06-26T02:08:45+05:30
పేదలకు బియ్యం, పంచదార, కందిపప్పు పంపిణీ చేసే తూనికలకు కాలం చెల్లినా కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కాలం చెల్లిన కాటాలను తూనికలు కొలతల శాఖాధికారులు తనిఖీ చేసి సర్టిఫికెట్లు మంజూరు చేయాల్సి ఉంది.
మచిలీపట్నం టౌన్, జూన్ 25 : పేదలకు బియ్యం, పంచదార, కందిపప్పు పంపిణీ చేసే తూనికలకు కాలం చెల్లినా కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కాలం చెల్లిన కాటాలను తూనికలు కొలతల శాఖాధికారులు తనిఖీ చేసి సర్టిఫికెట్లు మంజూరు చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ చేసే వాహనాల కాటాలను తనిఖీ చేయడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2021 నుంచి రేషన్ వ్యాన్లలో, డిపోల్లోని కాటాలను తనిఖీ చేసే నాధుడే లేడు. దీనివల్ల పేద ప్రజలు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రతి రేషన్ డీలర్, ప్రతి రేషన్ పంపిణీ చేసే వాహనంలోని కాటాలకు ఏడాదికి రూ.900 చెల్లించి కాటాలు తనిఖీ చేయించాల్సి ఉంది. దీనిపై సివిల్ సప్లయిస్ అధికారులు కానీ, తూనికలు కొలతల కంట్రోలర్ కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాటాల తనిఖీ లేకపోవడం వల్ల వల్ల కిలోకు 800 గ్రాములే తూగుతున్నాయని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లాలో 1059 చౌక డిపోలు, 336 రేషన్ పంపిణీ వాహనాలున్నాయి. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో 2021 చౌక డిపోలు, 530 రేషన్ పంపిణీ వాహనాలున్నాయి. కృష్ణాజిల్లాలో ఇటీవల 20 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 30 శాతం సీల్ వేయించుకున్నారు. గతంలో సీల్ వేయించుకునేందుకు రూ. 900 చెల్లించే వారు. ప్రభుత్వం వీరికి రూ. 600 రాయితీ ఇచ్చినా రూ. 300 చెల్లించేందుకు రేషన్ పంపిణీ వాహనదారులు వెనుకాడుతున్నారు.
తూనికలు కొలతల శాఖకు ఒక సవాల్..
రేషన్ షాపులో కాటాల తనిఖీకి కావలసిన వైర్లు, సీలుకు రూ. 300 మించి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దాంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జాప్యానికి ఇది కూడా ఒక కారణం. మచిలీపట్నం నగరం, అవనిగడ్డ, నాగాయలంక రేషన్ డీలర్ల వద్దకు తూనికల కొలతల శాఖ అధికారులు ఎవరూ వెళ్లలేదు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం : పార్వతి, డీఎ్‌సవో
రేషన్ డిపోల్లోని కాటాల తనిఖీకి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో కాటాలను సరి చేయించే ప్రక్రియ చేపట్టాం. డిపో డీలర్లు, రేషన్ పంపిణీ చేసే వాహనాల యజమానులు దీనిపై దృష్టి సారించకపోతే చర్యలు తీసుకుంటాం. దీనిపై జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ సూచనలు ఇచ్చారు.
డిపో, రేషన్ వాహనదారులకు సూచనలు ఇచ్చాం
ఈశ్వరరావు, తూనికలు కొలతల శాఖాధికారి, మచిలీపట్నం
రేషన్ డిపో డీలర్లకు, రేషన్ పంపిణీ చేసే వాహనదారులకు కాటాలను సరి చేయించుకోమని సూచనలు ఇచ్చాం. అయితే అందరూ రావడం లేదు. ఈ సమస్యను జేసీ దృష్టికి తీసుకుని వెళతాం.
Updated Date - 2023-06-26T02:08:45+05:30 IST