సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2023-08-02T00:34:03+05:30
సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్యం కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు.
తిరువూరు, ఆగస్టు 1: సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్యం కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. కార్యాలయం ఎదుట ఎవరినీ లోపలకు వెళ్లకుండా ధర్నా నిర్వహించారు. సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగుసంవత్సరాలు గడిచినా దాని ఊసే ఎత్తటం లేద న్నారు. అలాగే కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా నెలవారీ వేతనాలు సక్రమంగా ఇవ్వటం లేదని విమర్శించారు. గతంలో పలు మార్లు ఆందోళనలు చేసినా అధికారులు, పాలకుల్లో స్పందన కనిపించలేదన్నారు. ఈనెల 15వ తేదీలోగా తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళతామని కార్మికులు హెచ్చరించారు. సీఐటీయూ మండల కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు మోదుగు సురేష్, నాగరాజు, రమణ, సామ్రాజ్యం, నరసింహారావు, కృష్ణవేణి, బుదేమ్మ, తదితరులు పాల్గొన్నారు.
నందిగామలో..
కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుం దని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి కటారపు గోపాల్ విమర్శించారు. మునిసిపల్ కార్యాలయంవద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ డాక్టర్ జయరామ్‌కు అందజేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సయ్యద్ ఖాసిం, కార్మిక సంఘం నాయకులు సలికేటి నరేష్, సైదా, మాణిక్యం, పుల్లయ్య, సతీష్ పాల్గొన్నారు.
జగ్గయ్యపేటలో..
కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్‌లో నిరసన తెలిపారు. కార్మికులకు పదవీ విరమణ బెనిఫిట్స్ కల్పిం చాలని, కార్మికులందరికి ప్రమాద బీమా సౌకర్యం, హెల్త్ అలవెన్స్‌లు ఇవ్వా లని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి గౌస్‌మియా, ఎస్. రామనాథం, పి.ఎలకమ్మ, బుజ్జి, మార్తమ్మ, నరసింహారావు, సమాధానం, చందామణి, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
కొండపల్లి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఎం.మహేష్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ కొండపల్లి పురపాలక సంఘం కార్యాలయం ఎదుట మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ ప్రతి బుధవారం ఓ పూట కార్మికులు సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ వర్కర్స్‌కి హెల్త్ అలవెన్స్‌లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సురేష్, లక్ష్మయ్య, సింహాచలం, రమణ, నూకలు, అప్పలమ్మ, నూకరత్నం, శివమ్మ సరిత పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:34:03+05:30 IST