ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినుము.. కష్టాలు కనుము

ABN, First Publish Date - 2023-04-09T00:27:26+05:30

ఈ ఏడాది మినుము పంట కొనుగోలు ఒడిదొడుకులకు గురవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు మినుము కొనుగోలుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతంలో ఇబ్బడి ముబ్బడిగా మినుమును కొన్న ప్రైవేట్‌ వ్యాపారులు ఇప్పుడు ఆచీతూచి అడుగులు వేయడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

పొలంలో ఆరబెట్టిన మినుము
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తొలి రోజుల్లో క్వింటాలు రూ.7,800

ప్రస్తుత ం ధర రూ.7,300, అయినా కొనేవారు లేరు

మినుము పైపొట్టు ఊడితే రూ.2,000 తగ్గింపు

1.08 లక్షల హెక్టార్లలో సాగు, 2.16 లక్షల టన్నుల దిగుబడి

కొనేవారు లేక రైతుల దిగాలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఈ రబీ సీజన్‌లో జిల్లాలో 1.08 లక్షల హెక్టార్లలో మినుము సాగు జరిగింది. 2.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. మినుముతీత పనులు దాదాపు పూర్తయినా, రైతుల వద్ద ఉన్న మినుమును ఎంత ధరకు కొనుగోలు చేస్తారు, ఎప్పటికి కొనుగోలు పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మినుము కొనాలి. ప్రభుత్వం క్వింటాలు మినుము మద్దతు ధరను రూ.6,600గా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లోనే అంతకంటే అధిక ధర ఉంది. దీంతో మినుము కొనుగోలు వ్యవహారం పూర్తిగా ప్రైవేట్‌ వ్యాపారుల చేతుల్లో ఉంది.

ముందుకురాని వ్యాపారులు

రబీలో దాళ్వా పంటకు నీరివ్వకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా మినుము పంటను సాగు చేశారు. మినుముతీత పనులు ముమ్మరంగా సాగిన మార్చిలో పలుమార్లుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షాలు కురిశాయి. దీంతో మినుముతీత అనంతరం పనలపై ఉన్న పంట తడిచింది. పొలంలో లాగకుండా ఉన్న మినుము కాయలు తడిచిపోయాయి. పంటను కాపాడుకునేందుకు. రైతులు అష్టకష్టాలు పడి నూర్పిడి పనులు చేశారు. కొందరు రైతులు తమ ఇళ్ల వద్ద మినుము పంటను భద్రపరచగా, మరికొంతమంది పొలం వద్దనే ఆరబెట్టే పనులు చేస్తున్నారు. వర్షాలు కురవక ముందు క్వింటాలు మినుముకు రూ.7,800 వరకు ధర చెల్లించి వ్యాపారులు కొనేవారు. వర్షాల అనంతరం గింజల్లోని పప్పు లేత గులాబీ రంగుకు మారడంతో మినుమును కొనేందుకు ముందుకు రావట్లేదు.

పైపొట్టు ఊడితే..

మినుము కొనుగోలు సమయంలో వ్యాపారులు చిన్నపాటి నాపరాయి ముక్కతో గింజలను రుద్ది చూస్తారు. అనంతరం పొట్టు ఊడిన మినుము గింజలను, పప్పును అద్దంపై ఉంచి పరిశీలిస్తారు. ఈ సమయంలో మినుముపై ఉన్న పైపొట్టు ఊడినా, రంగుమారినట్లుగా కనిపించినా నాణ్యత లోపించినట్లుగా పరిగణిస్తారు. దీంతో మద్దతు ధరలో కోత పెడతారు. వర్షంలో తడిచిన మినుము పైపొట్టు ఊడిపోయే లక్షణంతో ఉంటుందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటాలు మినుముకు రూ.7,300 నుంచి రూ.7,400 వరకు ధర ఇస్తామని చెబుతున్నా మండల, జిల్లాస్థాయిలో ఉన్న వ్యాపారులు కొనేందుకు ముందుకు రావట్లేదు. వర్షాల తాకిడికి తడిచి కొంతమేర నాణ్యత దెబ్బతిన్న మినుముకు ఎంత ధర వస్తుందనే అంశంపైనా రైతుల్లో అనేక అనుమానాలున్నాయి.

చెన్నై, గుంటూరు, తెనాలి, వినుకొండ మార్కెట్‌కు..

జిల్లాలోని మినుము ఉత్పత్తులను అధికంగా తెనాలి, వినుకొండ, గుంటూరు, చెన్నై మార్కెట్‌లలో విక్రయిస్తారు. స్థానిక వ్యాపారులు మినుమును కొనే సమయంలోనే మార్కెట్‌ ధరకన్నా వంద రూపాయలు తక్కువకు కొంటారు. రెండుసార్లు జల్లెడ పట్టినందుకు, కాటా, రవాణా చార్జీల రూపంలో ఈ వంద రూపాయల ధరను తగ్గిస్తారు. ఈ మార్కెట్‌లలో రోజూ మధ్యాహ్నం 2 గంటలకు మినుము ధరను నిరయిస్తారు. జిల్లా నుంచి గుంటూరు, చెన్నై ప్రాంతాలకు మినుము లోడుతో లారీ వెళ్తే, నాణ్యతలో ఏదైనా తేడా జరిగి ధరను తగ్గిస్తే తమ పరిస్థితి ఏమిటనే అంశంపై స్పష్టత లేక వ్యాపారులు మినుము కొనడానికి ముందుకు రావట్లేదు. మచిలీపట్నం, చల్లపల్లి, గూడూరు, పామర్రు తదితర ప్రాంతాల్లో మినుము నూర్చినా కొనే నాథుడు లేక రైతులు దిగాలు పడుతున్నారు. ఈ ఏడాది ఎకరం మినుము సాగుకు రూ.30 వేల వరకు ఖర్చయిందని, మొక్క, పూత దశలో పురుగుమందుల పిచికారీ ఐదు విడతలుగా చేయాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. వర్షాల కారణంగా యంత్రాలతో మినుము కోత కోయిస్తే కనీసం ఎకరాకు క్వింటాలు మినుము పొలంలోనే పడిపోయాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు కోరితే జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా మినుము కొనుగోలు కేంద్రాలను తెరుస్తామని, అయితే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరనే ఈ కేంద్రాల్లో చెల్లించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-09T00:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising