టీడీపీ శ్రేణులే టార్గెట్‌గా రౌడీయిజం
ABN, First Publish Date - 2023-02-21T01:17:57+05:30
ప్రశాంతమైన గన్నవరాన్ని రణరంగంగా మార్చారు. పక్కా వ్యూహరచనతో భయభ్రాంతులకు గురిచేశారు. కర్రలు, రాడ్లతో రౌడీల్లా తిరుగుతూ నానా బీభత్సాన్ని సృష్టించారు. అడ్డొచ్చిన వారిని కొట్టారు. టీడీపీ నాయకుల కార్లను తగలబెట్టారు. సోమవారం 5 గంటల పాటు గన్నవరంలో వైసీపీ నాయకులు చేసిన ఈ రౌడీయిజం స్థానికులను భయాందోళనలోకి నెట్టింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ డైరెక్షన్‌లో టీడీపీ నాయకులే టార్గెట్‌గా ఈ దాడులు జరగ్గా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించి చూస్తూ ఉండిపోయారు.
ప్రశాంతమైన గన్నవరంలో రణరంగం
ఐదు గంటలకుపైగా విధ్వంసకాండ
ఆది నుంచి టీడీపీకి పెట్టని కోట
ఈసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ అరాచకం
కార్యాలయ విధ్వంసం.. కార్లు దహనం
బోడె అరెస్టు.. వివిధ స్టేషన్లకు తరలింపు
టీడీపీ నేత పట్టాభిని తీసుకెళ్లిన పోలీసులు
అర్ధరాత్రి ఒంటిగంటైనా తెలియని ఆచూకీ
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ప్రశాంతతకు మారుపేరు గన్నవరం. ఆది నుంచి టీడీపీకి కంచుకోట ఈ ప్రాంతం. ఆరుసార్లు టీడీపీని గెలిపించిన చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలది. 1983 నుంచి ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ కేవలం ఒక్కసారే ఇక్కడ విజయం సాధించింది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీని తమవైపు లాక్కుంది. స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన వంశీ వైసీపీ పెద్దల అండతో మరింత రెచ్చిపోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అందులో భాగంగా గడప గడపకూ కార్యక్రమంలో అడిగిన వారికి, అడగని వారికి పెద్ద ఎత్తున ఆర్థికసాయం చేస్తున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సెల్‌ఫోన్లు బహుమతులుగా ఇస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రకటనలు చేస్తూ గన్నవరంలో తనకు ఎదురులేదన్న భ్రాంతిని కలిగిస్తున్నారు.
గన్నవరం రణరంగం
టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురిచేసేందుకు వైసీపీ నాయకులు సోమవారం నాటి విధ్వంస రచనకు ప్రణాళిక వేశారు. సుమారు 5 గంటల పాటు చెలరేగిపోయారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు కార్లను తగలబెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలోనే ఈ విధ్వంసకాండ సాగింది. ఆయన ప్రధాన అనుచరులు ఓలుపల్లి మోహనరంగా (రంగా), భీమవరపు యేతేంద్ర రామకృష్ణ (రాము), ముల్ఫూరి ప్రభుకాంత్, అనగాని రాము, బుద్ధవరానికి చెందిన బసవరావు తదితరులు రాడ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ శ్రేణుల్లో భయాందోళనలు కలిగించాలన్న లక్ష్యంతో ఈ దాడులకు తెగబడినట్లు చెబుతున్నారు. టీడీపీ బీసీ నాయకుడు దొంతు చిన్నాపై దాడి చేయాలన్న ఉద్దేశంతో మొదలైన ఈ విధ్వంసం టీడీపీ కార్యాలయంపై దాడి, కార్ల దహనం, ఆపై రాళ్ల దాడి వరకు వెళ్లింది. సాయంత్రం 8 గంటలకు అంతా సద్దుమణిగింది అనుకునే సమయంలో మరోసారి చిన్నా ఇంటికి వెళ్లిన వంశీ అనుచరులు ఆయన కారును తగలబెట్టేందుకు ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులకు అండగా నిలిచేందుకు వచ్చిన పట్టాభిపై దాడిచేసి, ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి, అర్ధరాత్రి 12 గంటల సమయంలో మొదట మచిలీపట్నం, తరువాత నాగాయలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పోలీసులు కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. పైగా టీడీపీ వారిపైనే జులుం ప్రదర్శించారు.
అభివృద్ధికి అడ్డు పడాలనే..
విజయవాడతో కలిసిపోయినట్టుగా ఉండటం.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉండటంతో గన్నవరం అభివృద్ధి పరంగా శరవేగంగా దూసుకుపోతోంది. ఎన్నో కేంద్ర సంస్థలు.. ఐటీ సంస్థలు.. పారిశ్రామిక సంస్థలు ఈ నియోజకవర్గంలో కొలువుదీరాయి. కొండపావులూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్ సంస్థతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడీఎం) కూడా ఇక్కడే ఉంది. సూరంపల్లిలో కేంద్ర ప్లాస్టిక్ ఇండస్ర్టీ (సీపెట్) ఏర్పాటైంది. ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ సంస్థ ఎయిర్‌పోర్టుకు సమీపంలోనే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పార్కును ఏర్పాటు చేసింది. గన్నవరంలో ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ ఉన్నాయి. తాజా పరిణామాలతో గన్నవరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
Updated Date - 2023-02-21T01:18:00+05:30 IST