కాల్వలు పారేనా..?
ABN, First Publish Date - 2023-06-07T00:49:27+05:30
ఓవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు రెండు జిల్లాల్లో సాగు, తాగు నీరందించే ప్రధాన కాల్వలు పూడిపోయి ఉన్నాయి. ఖరీఫ్ ప్రారంభమైనా సాగుకు నీరందించే ప్రధాన కాల్వలు చెత్తాచెదారంతో నిండిపోయి, ఆక్రమణలతో కుంచించుకుపోయి కనిపిస్తున్నాయి. నీరు విడుదల చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులు, ఆ వదిలిన నీరు సక్రమంగా పారి పొలాలకు చేరుతుందా, లేదా అనే విషయంపై మాత్రం దృష్టిపెట్టట్లేదు.
పలుచోట్ల ఆక్రమణలతో అవస్థలు
పూడికతీయకుండా నీరెలా వస్తుందంటున్న రైతులు
ప్రధాన కాల్వల పరిస్థితి మరీ ఘోరం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
నీటి విడుదల సరే, పూడిక తీయండంటూ వేడుకోలు
హనుమాన్‌జంక్షన్ రూరల్ : రైతుల వద్ద నుంచి నీటి తీరువాను వడ్డీ సహా వసూలు చేసే అధికారులకు ప్రధాన కాల్వల పరిస్థితి కనిపించట్లేదా అని మండలంలోని తిప్పనగుంట,ఆరుగొలను, కాకులపాడు, దంటగుంట్ల, కానుమోలు తదితర గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేసవి రాగానే కాల్వల ఆధునికీకరణ కోసం రెండు నెలలు మూసివేసి పనులు చేసేవారని, నాలుగేళ్లుగా అలా జరక్కపోవడంతో గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో భారీ ముళ్లచెట్లు పెరిగాయని చెబుతున్నారు. ఫలితంగా కాల్వ పక్కనే ఉన్న పొలాలకు కూడా సాగునీరందని పరిస్థితి ఏర్పడింది.
ప్రధాన కాల్వలన్నీ అంతే..
పొలాలకు సాగు నీరందించడంతో పాటు తాగునీరందించే ఏలూరు కాల్వ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. గతంలో ఏలూరు కాల్వ తాటిచెట్టు లోతులో ఉండేదని, క్రమేణా కుంచించుకుపోయి ప్రస్తుతం ఐదు అడుగుల లోతు, 15 అడుగుల వెడల్పుతో పిల్ల కాల్వను తలపిస్తోందని రైతులు చెబుతున్నారు. కాకులపాడుతో పాటు రంగయ్యప్పారావుపేట, తిప్పనగుంట, దంటగుంట్ల తదితర గ్రామాలకు చెందిన 5వేల ఎకరాలకు పైగానీరందించే చానల్ కాల్వ అయితే, గడ్డి పెరిగిపోయి, ముళ్లచెట్లతో మూసుకుపోయింది. కాల్వల ఆధునికీకరణ పనులు సకాలంలో జరిగితే ఇటు ఖరీఫ్‌కు గానీ, అటు రబీకి గానీ సాగునీరంది సకాలంలో పంటలు చేతికొస్తాయని రైతులు చెబుతున్నారు. ఉపకాల్వ అయిన నరసన్నపాలెం యూటీ, వీరవల్లి యూటీ, కాకులపాడు చానళ్ల కింద సుమారు 15వేల ఎకరాలు సాగు చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం కాల్వలున్న పరిస్థితి చూస్తే చివరి భూములకు సాగునీరందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్వల ఆధునికీకరణ సకాలంలో చేయక పూడిపోవడంతో నీరెక్కడం లేదని, అందుకే మోటార్లు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని, అసలే ధాన్యం డబ్బు సకాలంలో అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తమకు ఇది మరింత భారమని పెరికీడు, రంగయ్యప్పారావుపేటకు చెందిన రైతులు వాపోయారు.
కాల్వల్లో ఆక్రమణలు
వర్షపు నీరు డ్రెయిన్ల ద్వారా బుడమేరులో కలిసే రామన్నగూడెం ప్రాంతంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అండతో కొంతమంది ఆక్రమణలు చేపట్టారు. వాటిని చేపల చెరువులుగా మార్చారు. గత జనవరిలో సాధారణ వర్షపాతం నమోదైనా దంటగుంట్ల పొలాల్లో నీరు నిలిచిపోవడమే ఇందుకు ఉదాహరణ. మొక్కుబడి పనులతో రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మునుపెన్నడూ లేని పరిస్థితి
గతంలో తుఫాన్లు వచ్చినప్పుడే రైతులు నష్టపోయేవారు. ఇప్పుడు సాధారణ వర్షానికి పొలాలు మునిగిపోతున్నా పట్టించుకోవట్లేదు. ఏలూరు కాల్వకు నీరు వదిలిన 4 రోజుల్లో 4 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన కాకులపాడు ప్రధాన కాల్వకు నీరు వచ్చేది. ఇప్పటి పరిస్థితి చూస్తే సాగునీరెప్పుడు వస్తుందో తెలియట్లేదు. - వి.శేషగిరిరావు, వైసీపీ నాయకుడు, కాకులపాడు
Updated Date - 2023-06-07T00:49:27+05:30 IST