ఖజానా.. నజరానా
ABN, First Publish Date - 2023-06-26T00:48:06+05:30
బహిరంగంగా లంచాలు గుంజడం ఎక్కడైనా చూశారా..! ప్రస్తుతం ఆర్టీసీలో జరుగుతున్నదిదే. ఖజానా శాఖ ఉద్యోగులకు లంచాలు సమర్పించేందుకు ప్రతి ఆర్టీసీ ఉద్యోగి నుంచి కొంత మొత్తాన్ని బహిరంగంగానే వసూలు చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టుగా.. ఈ వసూళ్లకు పాల్పడుతున్న వారు తమ వాటాలను కూడా అందులోనే కలుపుకొంటూ దండిగా గుంజుతున్నారు.
ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 నుంచి రూ.1,500 వరకూ..
పీఎన్‌బీఎస్, బస్ డిపోలు, గ్యారేజీలు, ఆఫీసుల్లో..
వాట్సాప్ గ్రూపుల్లో వసూళ్ల ఆడియో టేపులు లీక్
పీఎన్‌బీఎస్ కేంద్రంగా అంతా బహిరంగమే..
ప్రభుత్వంలో విలీనమయ్యాక ఆర్టీసీ వరకూ పాకిన అవినీతి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఖజానా శాఖలో తమ బిల్లులను పాస్ చేయించుకోవటానికి ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఆర్టీసీకి చెందిన వివిధ విభాగాల అధికారులు తమ ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ సహా పలు బస్ డిపోలు, గ్యారేజీలు, ఆఫీసులు.. ఇలా ఆయా విభాగాలకు సంబంధించి వసూళ్లపర్వం బహిరంగంగానే సాగుతోంది. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.500 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన అనేక విషయాలను ఆర్టీసీ ఉద్యోగులే వాట్సాప్ గ్రూపుల్లో బయటపెడుతున్నారు. ఖజానా ఉద్యోగులకు ఇచ్చే మామూళ్ల కోసం వివిధ విభాగాల్లోని ఉద్యోగుల నుంచి వసూళ్లకు సిబ్బందిని పురమాయించడం, ఇప్పటివరకు ఎంతమంది దగ్గర డబ్బు వసూలు చేసిందీ, ఇంకా ఎంతమంది నుంచి రావాల్సి ఉంది.. వంటి వివరాలకు సంబంధించిన ఆడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. దేనికోసం ఈ డబ్బు వసూలు చేస్తున్నారో ఈ ఆడియోల్లో స్పష్టంగా రికార్డైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఇంక్రిమెంట్ల బిల్లులకు కూడా భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటం విశేషం.
రూ.15 లక్షల పైమాటే..
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 3 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి సగటున రూ.500 వేసుకున్నా రూ.15 లక్షల పైమాటే వసూలవుతాయి. ఇది ఒక్కసారే.. ఇంక్రిమెంట్లు, అరియర్స్, ఇతర బెనిఫిట్లకు సంబంధించి మళ్లీ ఇంతే స్థాయిలో వసూలు చేస్తారు. ఈ వసూళ్ల పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా ఉంది. ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు తలమానికంగా ఉండేవారు, నోరున్నవారు, జీతాల బిల్లులు తయారు చేసేవారు ఈ వసూలుకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని నిలువరించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వంలో విలీనమయ్యాకే..
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావటంతో గతంలో మాదిరిగా సొంతంగా కాకుండా సీఎఫ్‌ఎంఎస్ విధానం ద్వారా ట్రెజరీ నుంచి జీతాలు అందుకోవాల్సి వస్తోంది. ట్రెజరీ శాఖలో ఆర్టీసీ బిల్లులు జాప్యమవుతున్న మాట వాస్తవం. దీనికి కారణమేమిటని ఆర్టీసీ వర్గాలు ఆరా తీయగా, మామూళ్ల విషయం బయటపడింది. ఆర్టీసీలో దశాబ్దాల పాటు పనిచేసిన కార్మికులు ఎన్నడూ ఎవరికీ లంచాలు ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులుగా లేని సమస్యను ప్రభుత్వంలో విలీనమయ్యాక ఎదుర్కొంటున్నారు. ఖజానా శాఖలో సంప్రదాయంగా నడుస్తున్న ఈ వ్యవహారానికి ఆర్టీసీ కూడా అలవాటు పడాల్సి వస్తోంది. పైసలు ఇవ్వనిదే బిల్లులను పాస్ చేయకపోవటంతో ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. ఇందులో కొందరు ఉద్యోగులు తమ స్వార్థం చూసుకుంటున్నారు.
ప్రక్షాళన జరగాలి
చేతిలో పైసలు పడితే కానీ ఖజానా శాఖలో బిల్లులు కదిలే పరిస్థితి లేదు. జీతాలు ఇవ్వాలంటే నజరానాలు ఇచ్చుకోవాలి. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగితే బహుమతులు ఇవ్వాలి. ఇదీ ఖజానా శాఖ లెక్క. లేదంటే బిల్లులు తొక్కి పట్టడం, సాంకేతిక తప్పులను వెతకటం, ఇబ్బంది పెట్టడం ఇక్కడ రివాజు. ఏళ్ల తరబడి నడుస్తున్న సంప్రదాయంతో ఇప్పటికే అన్ని శాఖల ఉద్యోగులు మామూళ్లు ముట్టజెబుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ఆర్టీసీ కూడా చేరింది. పెన్షనర్ల నుంచి కూడా మామూళ్లు దండుకుంటున్నారంటే ఖజానా శాఖ ఎంతటి అవినీతి కూపంలో కూరుకుపోయిందో తెలుస్తోంది.
Updated Date - 2023-06-26T00:48:06+05:30 IST