కమీషన్ల కక్కుర్తి
ABN, First Publish Date - 2023-02-21T01:24:13+05:30
కమీషన్లు ఇవ్వలేదని పూర్తి పనులు కాకుండా సగమే ఎంబుక్‌లో నమోదు చేశారు. పూర్తి పనులు చేసిన కాంట్రాక్టరును ఇబ్బంది పెట్టారు. సదరు కాంట్రాక్టర్ కలెక్టర్‌ను ఆశ్రయించడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో మరో అవినీతి బాగోతం బయటపడింది.
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాంచారయ్య మరో నిర్వాకం
కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వ్యవహారం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనుల కోసం రూ.30 లక్షలతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రెండేళ్ల కిందట టెండర్ పిలిచారు. నామినేషన్ పద్ధతిలో బండి వెంకాయమ్మ అనే కాంట్రాక్టర్ ఈ పనులను చేపట్టారు. పనులైతే పూర్తయ్యాయి. తనకు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ప్రకారం 585 మీటర్ల మేర కాంట్రాక్టర్ సీసీ డ్రెయిన్ నిర్మించారు. దీని వివరాలను 2020-21లో అప్పటి విజయవాడ రూరల్ మండల ఏఈ నాంచారయ్య కేవలం 140 మీటర్ల వరకే ఎంబుక్‌లో రికార్డు చేశారు. సదరు ఏఈ.. కాంట్రాక్టరును ముడుపులు అడగ్గా, ఆయన కుదరదనడంతో పనులు కొద్దిగా చేసినట్టుగా ఎంబుక్‌లో రికార్డు చేసినట్టు తెలుస్తోంది. దీంతో సదరు కాంట్రాక్టరుకు డబ్బు రావడం లేదు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఈ విషయాన్ని కలెక్టర్ దిల్లీరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన దీనిపై విచారణకు ఆదేశించటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం తతంగంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో విజయవాడ సర్కిల్ ఈఈ ధవళేశ్వరపు రామలింగేశ్వరప్రసాద్ ప్రస్తుత స్థానిక ఏఈ శ్వేతకు ఎంబుక్ రికార్డును నిర్దేశించినట్టు తెలుస్తోంది. దీనికి ఆమె నిరాకరించినట్టు సమాచారం. తన హయాంలో జరగని పనికి తానెలా ఎంబుక్ రికార్డు చేస్తానని చెప్పినట్టు తెలిసింది. ఏఈ నాంచారాయ్య ప్రస్తుతం పెనమలూరు మండల ఏఈగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పనికి కూడా ఎంబుక్ రికార్డు చేయాల్సిందిగా విజయవాడ సర్కిల్ ఈఈ ధవళేశ్వరపు రామలింగేశ్వరప్రసాద్.. కృష్ణాజిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి రాజుతో పాటు, పెనమలూరు ఏఈ నాంచారయ్యకు లేఖ రాశారు. ఎప్పుడో జరిగిన పనికి ఇప్పుడు ఎంబుక్ రికార్డు చేయమనటం ఒక తప్పయితే, ప్రస్తుతం జిల్లా కాకుండా వేరే జిల్లాలో ఉంటున్న ఏఈని బ్యాలెన్స్ పనుల ఎంబుక్ రికార్డు చేయమనటం గమనార్హం. సదరు ఏఈ నాంచారయ్యపై పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
అవనిగడ్డ పైపులైన్ల టెండర్ల రద్దుపై హైకోర్టులో కేసు
నాగాయలంక-కోడూరు వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మంచినీటి పైపులైన్ల పనులకు పిలిచిన టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రద్దు చేసిన ఉదంతంపై స్థానికులు హైకోర్టులో కేసు వేశారు. అధికార పార్టీ అనుచరులకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్వామిభక్తిని చూపటం విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్లను బెదిరించి, ఉపసంహరించుకునేలా అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు. ఈ క్రమంలో ఒక కాంట్రాక్టర్ మాత్రం ధైర్యంగా టెండర్ వే శారు. పోటీగా వచ్చిన కాంట్రాక్టర్ తక్కువగా కోట్ చేయటంతో టెండర్ చేజారుతుందన్న భయంతో అధికార పార్టీ నేతలు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రద్దు చేయించడంతో స్థానికులు కోర్టుకెళ్లారు.
Updated Date - 2023-02-21T01:24:15+05:30 IST