ఇసుక టన్నుకు వంద అధనం!
ABN, First Publish Date - 2023-08-02T00:38:45+05:30
ప్రభుత్వ ఇసుక పాలసీకి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పథకానికి వైసీపీ ప్రభుత్వం స్వస్థిచెప్పి టన్నుకు రూ.750లు ధర నిర్ణయించింది. అయితే డపింగ్ యార్డులో అదనంగా మరో వంద బాదేస్తూ, తూకంలోను దోచేస్తున్నారు.
తూకంలో మోసాలు.. అడిగితే బుకాయింపు
పై నుంచి ఆర్డర్ అంటున్న నిర్వాహకులు
మైలవరం, ఆగస్టు 1 : ప్రభుత్వ ఇసుక పాలసీకి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పథకానికి వైసీపీ ప్రభుత్వం స్వస్థిచెప్పి టన్నుకు రూ.750లు ధర నిర్ణయించింది. అయితే డపింగ్ యార్డులో అదనంగా మరో వంద బాదేస్తూ, తూకంలోను దోచేస్తున్నారు. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 50 ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్‌కు టన్ను నుంచి అర టన్ను ద్వారా రూ.30 వేలు నొక్కేస్తున్నారు. అదే విధంగా టిప్పర్లు ద్వారా రూ.70 వేలు మింగేస్తున్నారు. నిర్వాహకులకు రోజుకు సరాసరి రూ. లక్ష వరకు గిట్టుబాటు జరుగుతుందని కాటా పెట్టించుకొని మోసపోయిన బాధితులు ఆరోపిస్తున్నారు.
మైలవరం పట్టణం ఇసుక డంపింగ్ యార్డులో ప్రభుత్వం నిర్ణయించిన టన్ను ఇసుక ధర రూ.750లకు మరో రూ.100 అదనంగా చేర్చి టన్నుకు రూ.850లు వసూళ్లు చేస్తూ మోసం చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. తూకంలో నూ మోసపోతున్నామని బాధితులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌లో ఐదు టన్నుల ఇసుక పోయాల్సి ఉండగా కేవలం నాలుగు నుంచి నాలుగున్నర టన్నులు మాత్రమే పోస్తూ మోసానికి పాల్పడుతున్నారన్నారు. ఈతంతు కొన్నాళ్లు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఇసుక కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గొల్లపూడికి ఇసుక రవాణా చేసేందుకు టిప్పర్ వచ్చింది. అందులో 30 టన్నులకు టన్నుకు రూ.850 చొప్పున రూ.25,500 చెల్లించాడు. లోడింగ్ తర్వాత కాటా పెట్టించగా 27 టన్నులు మాత్రమే తూకం వచ్చింది. కాటా బిల్లులతో టిప్పర్ డ్రైవర్ వచ్చి సిబ్బందితో వాదనకు దిగితే మిగిలిన మూడు టన్నులు లోడు చేశారు. తూకం తగ్గిందని అడిగితే పోస్తు, అడగని వారిని సిబ్బంది అడ్డంగా మోసగిస్తున్నారు.
తూకం టన్నుల్లో తగ్గుతోంది
- శ్రీను, లారీ డ్రైవర్
20 టన్నులకు కేవలం 16 టన్నులు మాత్రమే పోస్తున్నారు. కాటా వేయిస్తే తప్ప అసలు విషయం తెలియడం లేదు. బయట కాటా పెట్టిస్తే దానికి మరలా డబ్బులు చెల్లించాలి. డంపింగ్ యార్డ్‌లోనే కాటా ఉంచితే మోసం పోయే అవకాశం ఉండదు.
ఎవరూ పట్టించుకోవడం లేదు
- నాగరాజు, టిప్పర్ డ్రైవర్
ఇసుక మోసం గురించి ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పొక్లెయిన్‌తో టన్నుల లెక్క వేస్తున్నారు. ఐదు టన్నులకు టన్ను, అరటన్ను తేడా వస్తున్నది. అదేమని అడిగితే పై నుంచి ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నాంటున్నారు. మోసానికి పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
Updated Date - 2023-08-02T00:38:45+05:30 IST