వీఎన్ పల్లి వైద్యాధికారి లైంగిక వేధింపులు
ABN, First Publish Date - 2023-06-19T23:29:46+05:30
వైద్యాధికారి లైంగిక మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ వీఎన్‌పల్లి గ్రామ సచివాలయ ఏఎన్‌ఎంతో పాటు మరికొందరు మహిళా సిబ్బంది సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.
కడప(కలెక్టరేట్) జూన్ 19: వైద్యాధికారి లైంగిక మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ వీఎన్‌పల్లి గ్రామ సచివాలయ ఏఎన్‌ఎంతో పాటు మరికొందరు మహిళా సిబ్బంది సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం గీత, హైమావతి, సౌజన్య,,శారద ప్రియదర్శిని తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో పనితీరు సరిగా లేదంటూ పెట్టిన పోస్టింగుల పై వీఎన్‌పల్లి మెడికల్ ఆఫీసరు డాక్టర్ వెంకటగిరి ఫోన్‌లో దుర్బాష లాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో ఫిర్యాదు చేయడంతో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ డాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు, వీఎన్ పల్లి, అనిదెన గ్రామ సచివాలయాల పరిధిలో విధి నిర్వహణలో విఫలమ య్యారంటూ తమను చక్రాయపేట మండలం ఎర్రబొమ్మనపల్లి సచివాలయానికి మార్చారన్నారు. తాము నిబధ్దతతో పనిచేస్తున్నామని, రికార్డులు కూడా పెండింగ్ లేవన్నారు. అయితే, డాక్టర్ వెంకటగిరి ఏడాది కాలంగా తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తలదించుకొని విధులు నిర్వహించానని, డాక్టర్ వైఖరి శ్రుతి మించడం వల్లే తాను ఎదురు తిరగాల్సి వచ్చిందని ఏఎన్‌ఎం గీత కన్నీటి పర్యంతమయ్యారు. ఆడియో రికార్డింగ్ వ్యవహారం వైరల్‌గా మారినా డాక్టర్ వెంకటగిరి వ్యవహార శైలిని ఉన్నతాధికారులు దాచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త కర్నూలులో ప్రైవేట్ ఉద్యోగి అని, తనకు ముగ్గురు కూతుళ్లున్నారని, వారి బాగోగులు చూసుకొనేందుకు నానా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అనిదెల గ్రామ సచివాలయంలో విధులు పూర్తి చేసుకొని కమలాపురం వెళ్లే క్రమంలో ఇటీవల యాక్సిడెంట్ అయిందని, తన ఆరోగ్య రీత్యా బదిలీని రద్దు చేయాలని కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు.
Updated Date - 2023-06-19T23:29:46+05:30 IST