దొంగలు బాబోయ్
ABN, First Publish Date - 2023-06-18T23:15:12+05:30
మండల వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో వరి, వేరుశనగ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రైతులు సాగు చేసే పంటలకు వ్యవసాయ పరికరాలు అవసరం. ముఖ్యంగా ప్రస్తుతం మండల వ్యాప్తంగా మెట్ట ప్రాంతంలో బోరుబావుల కింద వేరుశనగను సాగు చేశారు.
స్పింక్లర్లు, పైపులు, స్టార్టర్లు, మోటార్లు మాయం
లబోదిబోమంటున్న రైతులు
మండలంలోని రైతులు సాగు చేసిన పంటల్లో దొంగలు పడ్డారు. ఏది దొరికితే అది మాయం చేసేస్తున్నారు. ఇప్పటికే స్పింక్లర్లు, పైపులు, స్టార్లర్లు, మోటార్లు తీసుకెళ్లారు. ఇంకేం తీసుకెళ్తారో అని రైతులు రాత్రింబవళ్లు కాపలా ఉంటున్నారు. ముఖ్యంగా నూలివీడు, పందికుంట, కొర్లకుంట, గరుగుపల్లె, గుండ్లచెరువు గ్రామాల్లో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
గాలివీడు, జూన్ 18: మండల వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో వరి, వేరుశనగ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రైతులు సాగు చేసే పంటలకు వ్యవసాయ పరికరాలు అవసరం. ముఖ్యంగా ప్రస్తుతం మండల వ్యాప్తంగా మెట్ట ప్రాంతంలో బోరుబావుల కింద వేరుశనగను సాగు చేశారు. మెట్ట ప్రాంతంలో వేరుశనగను సాగు చేయాలంటే స్పింక్లర్లు, డ్రిప్ వాడకం రైతాంగానికి తప్పనిసరైంది. తక్కువ నీటిని పొదుపుగా వాడుకోవడానికి వేరుశనగను సాగు చేసిన ప్రతి రైతు స్పింక్లర్లు, మినీ స్పింక్లర్లు, డ్రిప్పును ఉపయోగించి నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలమైనా ఒక్కో రైతు రెండెకరాల నుంచి 5 ఎకరాల వరకు వేరుశనగను సాగు చేశారు. వీటికి నీటి తడులను అందించే స్పింకర్లకు, డ్రిప్‌కు వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. దీన్ని ఆసరాగా తీసుకొన్న కొంత మంది దొంగలు రాత్రిపూట వ్యవసాయ భూముల దగ్గరకు వెళ్లి అక్కడున్న స్పింక్లర్లు, డ్రిప్ పైపులు, మోటార్లు, కేబుల్ వైర్లు, స్టాటర్లు వంటి వాటిని తీసుకెళుతున్నారు. ముఖ్యంగా నూలివీడు, పందికుంట, కొర్లకుంట, గరుగుపల్లె, గుండ్లచెరువు వంటి గ్రామా ల్లో వ్యవసాయ పరికరాలను తీసుకొని వెళ్లే దొంగలు ఎక్కువగా ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
పై గ్రామాల్లో సాగు చేసిన ప్రతి రైతుది ఏదో ఒకటి దొంగలు తీసుకెళుతున్నట్లు వారు వాపోయారు. పందికుంట పంచాయతీ బత్తినివాండ్లపల్లెకు చెందిన నక్కల శివారెడ్డికి చెందిన 13 పైపులు, కానాల సూర్యనారాయణకు చెందిన ఒక మోటారు, హెచ్‌డీపీఈ పైపులు, ఒక అడుగు కేబుల్ వైరును, కుడుముల భాస్కర్‌రెడ్డి బాయి మోటారును, చీపాటి క్రిష్ణారెడ్డికి చెందిన మోటారును దొంగలు తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంకా వివిధ గ్రామాల్లో చాలా మంది రైతులకు చెందిన వ్యవసాయ పరికరాలను దొంగలు తీసుకెళుతున్నట్లు సమాచారం. కొంత మంది చెప్పుకొంటుండగా మరికొంత మంది రైతులు చెప్పుకోలేకపోతున్నారు. కొంత మంది రైతులు కొనుగోలు చేసిన పది రోజుల్లోనే పరికరాలను దొంగలు తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా ప్రస్తుతం రైతులు 500 ఎకరాలకు పైగా వేరుశనగను సాగు చేసినట్లు సమాచారం. వ్యవసాయ పరికరాలను దొంగల బెడద నుంచి కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నదని, రాత్రింబవళ్లు కాపలా ఉంటున్నామని రైతులు వాపోతున్నారు.
తీవ్రంగా నష్టపోతున్నాం
- చీపాటి క్రిష్ణారెడ్డి, ఇడిపనచిన్నపల్లె, గరుగుపల్లె పంచాయతీ
ఒకపక్క వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, మరొక పక్క వ్యవసాయ పరికరాలను దొం గలు తీసుకెళ్లడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాము. ప్రస్తుతం నాకు చెందిన మోటారును దొంగలు తీసుకొని వెళ్లారు. నేను వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా ప్రతిసారి సాగు చేసినప్పుడల్లా ఏదో ఒక వస్తువును దొంగలు తీసుకొని వెళ్లడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.
దొంగల బెడద ఎక్కువ
- నక్కల శివారెడ్డి, బత్తినవాండ్లపల్లె, పందికుంట పంచాయతీ
నేను ప్రస్తుతం 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. వేరుశనగకు స్పింక్లర్ల ద్వారా నాటి తడులను అందిస్తున్నాను. ప్రతి సాగులోనూ ఎవరో ఒక్కరూ స్టాటర్‌ను కానీ, డ్రిప్‌ను, స్పింక్లర్లు, పైపులు తీసుకొని వెళుతున్నారు. ప్రస్తుతం గత పది రోజుల క్రితం 15 పైపులను తీసుకెళ్లారు. ఇలా నాది ఒక్కరిదే కాదు. మా గ్రామంలో చాలా మంది రైతులకు చెందిన వ్యవసాయ పరికరాలను దొంగలు తీసుకెళుతున్నారు. ఈ దొంగలు బెడద నుంచి వ్యవసాయ పరికరాలను కాపాడాలి.
Updated Date - 2023-06-18T23:15:12+05:30 IST