చెరువులను చెరబట్టారు
ABN, First Publish Date - 2023-06-26T01:07:35+05:30
ఒకప్పుడు వ్యవసాయానికి సాగునీరు అందిస్తూ.. బాటసారులకు, పశువులకు దాహం తీర్చే వనరులుగా ఉన్న చెరువులు నేడు కొందరు వైసీపీ నేతలకు కల్పతరువుగా మారాయి. అధికారం అండతో విచ్చలవిడిగా చెరువులు,
ఆక్రమించి.. ప్లాట్లుగా అమ్మేసి
కడప, ప్రొద్దుటూరు, పులివెందులలో ఇళ్ల స్థలాలకు విక్రయాలు
బరితెగించిన కొందరు వైసీపీ నేతలు
భవిష్యత్‌లో చెరువులు కనుమరుగే...
కడప, జూన్ 24 (ఆంరఽధజ్యోతి): ఒకప్పుడు వ్యవసాయానికి సాగునీరు అందిస్తూ.. బాటసారులకు, పశువులకు దాహం తీర్చే వనరులుగా ఉన్న చెరువులు నేడు కొందరు వైసీపీ నేతలకు కల్పతరువుగా మారాయి. అధికారం అండతో విచ్చలవిడిగా చెరువులు, కుంటలను ఆక్రమించి.. ప్లాట్లు వేసి ఇళ్ల స్థలాలకు విక్రయిస్తున్నారు. దీంతో చెరువులన్నీ కుచించుకుపోయి కనీసం ఆయకట్టుకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. వర్షాకాల నేపథ్యంలో చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తేనే ప్రస్తుతం చెరువుల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. మరి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు ఆక్రమణలను తొలగిస్తారా అంటే అది అసాధ్యమని కొందరు బహిరంగా విమర్శిస్తున్నారు.
జిల్లాలో సుమారు రూ.50కోట్లు పైగా విలువ చేసే చెరువులు కబ్జాదారుల ఆధీనంలో ఉన్నాయి. కడప, బద్వేలు, ప్రొద్దుటూరులో ఆక్రమించిన చెరువు, కుంటలను సెంటు రూ.10 నుంచి రూ.20లక్షల మధ్య అమ్మేయడంతో అక్కడ భవనాలు వెలిశాయి. మరి అధికార యంత్రాంగానికి అలాంటిచోట ఆక్రమణలు తొలగించే దమ్ముందా అనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో 590 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు సుమారు 25వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
ఆక్రమించేసి అమ్మేసెయ్...
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను కొందరు ఆక్రమించేసి పంటలు సాగుచేసుకుంటున్నారు. అయితే పట్టణాల్లో ఉన్న చెరువులను ప్లాట్లు వేసి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తు న్నారు. కడప నగరంలో పుట్లంపల్లె, ఊటుకూరు, బుడ్డాయపల్లె, మృత్యుంజయకుంటలో చెరువులు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఆక్రమణకు గురయ్యాయి.
- మృత్యుంజయకుంట కడప నగరం నడిబొడ్డున ఉంది. ఆ కుంటలో ఒకప్పుడు సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బోటుషికారు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే అక్కడ ఆ కుంట ఎంత విస్తీర్ణంలో ఉందో అర్థమవుతుంది. అయితే కుంట ఇపుడు ఇంకుడుగుంత స్థాయికి పడిపోయింది. నగరానికి చెందిన వైసీపీకి చెందిన ఓ నేత అనుచరులే కుంటను ఆక్రమించేశారు. సెంటు రూ.15 నుంచి రూ.20లక్షలకు అమ్మినట్లు చెబుతారు. ఇక్కడే దాదాపు వందకోట్ల మేర స్థలాలు క్రయవిక్రయాలు జరిగినట్లు ప్రచారం ఉంది.
- బుడ్డాయపల్లె చెరువుకు సంబంధించి కడపలోని ప్రధాన చెరువులతో పాటు పంట కాల్వలను ఆక్రమించేశారు. రాజీవ్‌మార్గ్, ఆర్టీసీ బస్టాండ్, వై జంక్షన్ మీదుగా పంట కాల్వలు ఉండేవి. అయితే ఆ ప్రాంతంలో సెంటు లక్షల్లో ఉండడంతో కనీసం బారెడు స్థలం ఉన్న కూడా లక్షలు విలువ చేస్తుంది. కడప నగర ముంపునకు గురవుతుందన్న ఉద్దేశ్యంతో పేదలున్న స్థలాల్లో ఉన్న ఇళ్లను అధికారయంత్రాంగం రేయింబవళ్లు పగులగొట్టింది. మరిపెద్దలు ఉండే రాజీవ్‌మార్గ్, ఆర్టీసీబస్టాండ్, వై జంక్షన్ రోడ్డు, అప్సర, సంధ్య సర్కిళ్లలో పెద్దలు వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
- ప్రొద్దుటూరు మండలంలోని బొజ్జవారిపల్లె చెరువును భూమిలేని నిరుపేదలు పంటలు సాగుచేసుకున్నారు. అయితే వాటిని కొందరు వైసీపీనేతలు స్వాధీనం చేసుకొని అక్కడ వెంచర్ వేస్తున్నట్లు చెబుతున్నారు.
- బద్వేలు పట్టణంలోని నాగులచెరువు విస్తీర్ణం 140 ఎకరాలు. ఇది అటు నెల్లూరు, ఇటు పోరుమామిళ్ల రహదారులకు పక్కనే ఉంది. ఇక్కడ ఎకరా రూ.2 కోట్ల నుంచి 5 కోట్లకుపైగానే ఉంది. రోడ్డుపక్కనే ఉండడంతో సెంటు స్థలం రూ.15 లక్షలకు పైగానే ఉంది. ఇదే అదునుగా ఆక్రమణలకు తెరలేపారు. ఆక్రమణదారులు ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. అమ్మేది కూడా వైసీపీ నేతలు కావడంతో ఆక్రమణలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిన ఇప్పటికీ ఫలితం శూన్యం.
- ప్రొద్దుటూరు మండలంలని మోడమీదపల్లె రెవెన్యూ పొలం పరిధిలో సర్వే నెంబర్ 71లో 1.30ఎకరాలు, సర్వేనెంబర్ 10లో 1.20ఎకరాలు కుంట భూములు ఉన్నాయి. ఇవన్నీ రింగురోడ్డు దగ్గరుండడంతో ఎకరం రూ.2కోట్లకు పైగానే ఉంది. వీటిని వైసీపీ నేతలు ఆక్రమించారు. ఇవి ప్రభుత్వ భూములని రెవెన్యూ బోర్డు పెట్టిన కూడా ఆక్రమించేసి అమ్మేస్తున్నట్లు చెబుతున్నారు.
- సి.కె.దిన్నె మండలంలోని ఊటుకూరు చెరవు ఆక్రమణకు గురైంది. ఇక్కడ దాదాపు రూ.50కోట్లు విలువచేసే స్థలం ఆక్రమణకుగురైంది. పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం చెరువులో 24ఎకరాలను ఆక్రమించేసి రిజిస్టర్ కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. చాపాడు మండలంలోని పల్లవోలు చెరువు 20ఎకరాలు, నాయనిచెరువు 60ఎకరాలు, ఖాదర్‌పల్లెచెరువు 50ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇవి కేవలం కొన్ని మాత్రమే.
చర్యలు తీసుకుంటాం...
చెరువులు ఆక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆక్రమణలు తొలగించాం. బద్వేలులో ఆక్రమణకు గురైన చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ వెంకటరామయ్య ఆంధ్రజ్యోతికి వెల్లడించారు.
Updated Date - 2023-06-26T01:07:35+05:30 IST